జపనీస్ ఆటో దిగ్గజ కంపెనీ హోండా.. భారత్ లో మళ్లీ తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అత్యధికంగా అమ్ముడవుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్‌లోకి వచ్చే ఏడాదిలోగా తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నది. ఏడాదికి 30 లక్షలకు పైగా అమ్మకాలతో SUV సెగ్మెంట్ వాహనాలు దుమ్మురేపుతున్నాయి. కానీ, హోండా కంపెనీ నుంచి ప్రస్తుతం ఏ SUV అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో సరికొత్త SUVని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
కంపెనీ తన వ్యాపారాన్ని మరింత వృద్ధిపరిచే దిశగా హెల్దీ ప్రణాళికలు రచిస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సిఇఒ టకుయా సుమురా వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా హోండా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. గత మూడేళ్లలో కంపెనీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమని తెలిపారు. ఈ కారణంగానే భారత్ లోని ఒక ప్లాంట్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని తయారీ సైట్‌లను మూసివేసిట్లు చెప్పారు. భారతదేశాన్ని హోండా కంపెనీ అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఒకటిగా భావిస్తుందన్న ఆయన.. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV విభాగంలో నూతన ఉత్పత్తి పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నట్లు వెల్లడించారు.
హోండా దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో తన మార్కెట్ వాటాను FY19లో 5.44 శాతం ఉండగా.. FY 22లో 2.79 శాతానికి పడిపోయింది. అత్యధికంగా అమ్ముడవుతున్న SUV సెగ్మెంట్‌లో ఉత్పత్తులు లేకపోవడం వల్ల కంపెనీ వాల్యూమ్‌లు, మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టిందని సుమురా అంగీకరించారు. కంపెనీ ఇప్పుడు తన అమ్మకాలను పునరుద్ధరించడానికి వచ్చే ఏడాది SUV మోడల్ ను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. SUV మార్కెట్ బలంగా అభివృద్ధి చెందిందన్న సుమురా.. మొత్తం ప్యాసింజర్ వాహనాల విభాగంలో 50 శాతం వాటాను కలిగి ఉందన్నారు. వచ్చే ఏడాది SUV విడుదలతో మంచి వృద్ధిలోకి వస్తామని భావిస్తున్నట్లు వెల్లడించారు.
రాబోయే SUV మోడల్ ను అత్యంత పోటీతత్వ విభాగంలో ఎలా ఉంచాలి? అనే అంశంపై కంపెనీ ఆలోచిస్తుందన్నారు సుమురా . తమ కొత్త మోడల్ మంచి ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో నంబర్ వన్ గా మారడం చాలా కష్టమన్న ఆయన.. గట్టిపోటీ మాత్రం ఇస్తామన్నారు. ఇప్పటికే నూతన SUV మోడల్ అభివృద్ధి దశ దాదాపు పూర్తయిందన్నారు. భారీ ఉత్పత్తి ప్రారంభానికి ముందు కంపెనీ ఇప్పుడు కొన్ని తుది సర్దుబాట్లు చేసే ప్రక్రియలో ఉందని వెల్లడించారు. ప్రస్తుతం హైబ్రిడ్ టెక్నాలజీపై ఆధారపడ్డ కంపెనీ, దేశ వ్యాప్తంగా తగిన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు భవిష్యత్తులో బ్యాటరీ ఎలక్ట్రిక్ ఉత్పత్తులను తీసుకురానున్నట్లు తెలలిపారు.
హోండా ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 30 EV మోడళ్లను విడుదల చేయాలని యోచిస్తోందని సుమురా తెలిపారు. వార్షిక ఉత్పత్తి పరిమాణం 20 లక్షల యూనిట్లకు పైగా ఉంటుందన్నారు. తన వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా, హోండా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో తన మూడు మోడళ్లైన జాజ్, WR-V , నాల్గవ తరం సిటీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది.