Operation Valentine Teaser: మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు సంబంధించిన స్టోరీతో ఈ మూవీ రూపొందుతోంది. వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మితమవుతోంది. బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ విడుదల అయ్యింది. ‘ఫస్ట్ స్ట్రైక్’ పేరుతో విడుదల చేసిన ఈ టీజర్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంది.


కళ్లు చెదిరే విజువల్ ట్రీట్, అదిరిపోయే డైలాగ్స్  


“మన ఎయిర్ ఫోర్స్‌ ను ఇంకో దేశానికి పంపించడమంటే.. వార్ ను డిక్లేర్ చేయడమే” అనే ఎయిర్ చీఫ్ చెప్పే మాటలతో టీజర్ మొదలవుతుంది. “ప్రతీకారం తీర్చుకుంటూ పోతే దేశాలు ఉండవు. సరిహద్దులు మాత్రమే ఉంటాయి” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక, వరుణ్ తేజ్ డైలాగ్స్  మరింత పవర్ ఫుల్ గా ఉన్నాయి. శత్రువుకు బుద్ది చెప్పే సమయం వచ్చిందంటూ.. “మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‍ది కూడా” అనే డైలాగ్ తో తోటి ఎయిర్ ఫోర్స్ సిబ్బందిలో దేశభక్తిని నింపే ప్రయత్నం చేస్తారు. ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా వరుణ్ తేజ్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో యుద్ధ విమానాల విన్యాసాలు గూస్ బంప్స్ కలిగించేలా ఉన్నాయి. వైమానిక దాడులను అత్యద్భుతంగా తెరకెక్కించారు. కెప్టెన్ రుద్రగా వరుణ్ చక్కటి పాత్రను పోషించారు. హీరోయిన్ మానుషి కూడా ఎయిర్ ఫోర్స్ లోనే పని చేస్తుంది. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ కూడా జనాలను ఆకట్టుకునేలా ఉంది. ఇక సంగీత దర్శకుడు మిక్కి జే మేయర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరో లెవర్ అని చెప్పుకోవచ్చు.



యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న‘ఆపరేషన్ వాలెంటైన్’


నిజానికి ఈ సినిమాను భారత వైమానికి దాడులకు సంబంధించిన కొన్ని యథార్థ సంఘటనలను బేస్ చేసుకుని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజా టీజర్ చూస్తుంటే, పాక్ ఉగ్ర స్థావరాలు, లాంఛ్ ప్యాడ్స్ మీద దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా రూపొందించినట్లు అర్థం అవుతోంది. మొత్తంగా ఈ టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచిందని చెప్పుకోవచ్చు.


వరుణ్ ఆశలన్నీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మీదే!


అటు గత కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మీద భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. ఒకప్పుడు వరుణ్ సినిమా అంటే కచ్చితంగా ఆడేస్తుంది అని ప్రేక్షకులు భావించేవారు. కానీ, ఆయన గత చిత్రాలు వరుసగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ‘గని’, ‘గాండీవధారి అర్జున’ సినిమాలు మరింత దారుణ ఫలితాలను ఇచ్చాయి. అంతకు మందు వచ్చిన ‘F3’ కూడా మరీ చెప్పుకోదగ్గ విజయాన్ని ఏమీ అందుకోలేదనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి ఎక్కాలని ఆయన భావిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీతోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న విడుదలకానుంది.  


Read Also: 'సలార్' టికెట్స్ - ఏపీ, తెలంగాణలో ఇంకా ఎందుకు ఓపెన్ కాలేదంటే?