దక్షిణాది సినీ పరిశ్రమలో రాణించి పలువురు ముద్దుగుమ్మలు బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. వారిలో కొందరు బాగా రాణించగా, మరికొంత మంది ఒకటి, రెండు సినిమాలు చేసిన వెనక్కి మళ్లారు. ఇప్పటికే శృతి హాసన్, తాప్సీ, రష్మిక మందన్న, పూజా హెగ్డే బాలీవుడ్ లో పలు సినిమాలు చేశారు. అయినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. రష్మిక మాత్రం ప్రస్తుతం రెండు, మూడు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.


ముంబై వీధుల్లో కీర్తి, వరుణ్ ఆటో రైడ్


ప్రస్తుతం మరో సౌత్ బ్యూటీ బాలీవుడ్ వైపు దృష్టి సారించింది.  ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ కు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయట. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు దర్శకులు కథలు చెప్పారట. వారిలో ఓ కథ నచ్చి ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారట.  ఇండస్ట్రీలో ఈ మూవీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా కీర్తి సురేష్, వరుణ్ ధావన్ ఆటోలో ముంబై వీధుల్లో తిరుగుతూ కనిపించారు. వరుణ్ ఒంటి మీద షర్ట్ లేకుండా కేవలం బనియన్ తోనే కనిపించాడు. కీర్తి చేతులకు మెహందీ పెట్టుకుని జీన్స్, టీ షర్ట్ తో కనిపించింది. ఈ వీడియో బయటకు వచ్చాక, కీర్తి బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయినట్లేనని తేలిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.   






మాస్ యాక్షన్ నేపథ్యంలో కీర్తి తొలి బాలీవుడ్ చిత్రం


ఇక కీర్తి తొలి సినిమా మాస్ యాక్షన్ నేపథ్యంలో రూపొందబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు కాలీస్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇప్పటి వరకు సౌత్ అద్భుత నటనతో ఆకట్టుకున్న కీర్తి సురేష్, బాలీవుడ్ లో ఏమేరకు రాణిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.   


చివరి సారిగా  ‘భోళా శంకర్’లో కనిపించిన కీర్తి


కీర్తి సురేష్ చివరి సారిగా తెలుగులో ‘భోళాశంకర్’ సినిమాలో కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ సినిమా ‘వేదాళం’కు రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించింది. హీరో సుశాంత్ ముఖ్య పాత్రలో కనిపించారు. రఘుబాబు, మురళీ శర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రగతి సహా పలువురు నటీనటులు ఇతర పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. అంతకు ముందు నానితో కలిసి కీర్తి నటించిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.


Read Also: చిరు సినిమాలో ఆ క్యారెక్టర్ ఉండదట, అసలు విషయం చెప్పిన దర్శకుడు వశిష్ట!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial