తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకులలో ఒకరైన విజయ్ (Vijay) తో దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మిస్తున్న సినిమా 'వారసుడు' (Varasudu Movie). తమిళంలో 'వారిసు' (Varisu) పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ టాక్ ఏంటంటే... ఈ సినిమాతో విడుదలకు ముందే 'దిల్' రాజు అండ్ కో 30 కోట్ల రూపాయలు లాభం పొందారట. 


కళ్ళు చెదిరేలా 'వారసుడు' ప్రీ రిలీజ్ బిజినెస్
Varisu Pre Release Business : తమిళనాడులో విజయ్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. మినిమమ్ ఆయన సినిమాలు వందకోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అందుకని, తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో రూ. 72 కోట్ల నుంచి రూ. 75 కోట్ల మధ్య సొంతం చేసుకుందట. ఓవర్సీస్ రిలీజ్ రైట్స్‌ను రూ. 38 కోట్లకు ఫార్స్ ఫిలిమ్స్ సొంతం చేసుకుందని సమాచారం. డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయ్యిందని... తెలుగు, తమిళ భాషల హక్కులను సుమారు 150 కోట్లకు అటు ఇటుగా అమ్మేశారని టాక్. ఆడియో రైట్స్ టీ సిరీస్ తీసుకుంది. ఐదు కోట్లకు ఆ డీల్ కుదిరిందని బాలీవుడ్ టాక్.
 
తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట. సినిమా నిర్మాణానికి సుమారు 250 కోట్లు అవుతోందని వినబడుతోంది. ఆ లెక్కన విజయ్ సినిమాతో 'దిల్' రాజు (Dil Raju) కు 30 కోట్లు లాభమే. అది కాకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. ఎటు చూసినా దిల్ రాజు మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్.


తెలుగు సినిమా కాదు... తమిళ చిత్రమే!
'వారసుడు' సినిమాను తొలుత తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. తెలుగులో షూటింగ్ ఆపేసినప్పుడు ఆ సినిమా షూటింగ్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. అప్పుడు తమది తమిళ సినిమా అని పేర్కొన్నారు. ఆ తర్వాత 'బీస్ట్' విడుదల సమయంలో కూడా విజయ్ తమిళంలో తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఇటీవల దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కూడా అదే మాట చెప్పారు.  


Also Read : బాలకృష్ణ సినిమా కోసమూ వెయిట్ తగ్గా - ఫ్లాష్‌బ్యాక్‌లో, ప్రజెంట్‌లో...


విజయ్ జోడీగా రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినెమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.