రిషబ్ శెట్టి (Rishab Shetty) కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన కన్నడ సినిమా 'కాంతార' (Kantara Movie). ఈ చిత్రానికి భాష, ప్రాంతం వంటి సరిహద్దులకు అతీతంగా ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. ఈ విజయంలో రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, భూత కోలతో పాటు సంగీతం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. నేపథ్య సంగీతానికి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా 'వరాహ రూపం' పాటకు! ఆ బాణీ కాపీ అని విమర్శలు వచ్చాయి. ఆ వివాదం ఇప్పుడు కోర్టులో ఉంది. 


'వరాహ రూపం' పాటను ప్లే చేయకండి!
'కాంతార'లోని పతాక సన్నివేశాల్లో వచ్చే 'వరాహ రూపం...' సాంగ్ (Varaha Roopam Daiva Va Rishtam ) ఉంది కదా! అది తమ 'నవసర'కు కాపీ అని 'తైక్కుడం బ్రిడ్జ్' (Thaikkudam Bridge) మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. అంతే కాదు... కోర్టులో కేసు కూడా వేసింది. 


కేరళలోని థియేటర్లలో, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో (యూట్యూబ్, ఓటీటీ వేదికల్లో) 'వరాహ రూపం' పాటను ప్లే చేయకూడదని కేరళ కోజికోడ్ సెషన్స్ కోర్టు 'కాంతార' చిత్ర దర్శక నిర్మాతలను ఆదేశించింది. ఒక విధంగా ఈ తీర్పు 'తైక్కుడం బ్రిడ్జ్' మ్యూజిక్ బ్యాండ్‌కు నైతిక మద్దతు అని చెప్పాలి.  


'నవరస...' బాణీకి
'వరాహ రూపం' కాపీ!
Varaha Roopam Vs Navarasam : 'కాంతార' విడుదల అయిన కొన్ని రోజులకు 'వరాహ రూపం' పాట తాము స్వరపరిచిన 'నవరస...'కు కాపీ అని 'తైక్కుడం బ్రిడ్జ్' మ్యూజిక్ బ్యాండ్ పేర్కొన్నది. ఇంకా ''కాంతార' చిత్రానికి, మాకు ఎటువంటి సంబంధం లేదు. మా సాంగ్ 'నవసర', 'కాంతార'లోని 'వరాహ రూపం...' పాట మధ్య సారూప్యతలు ఉన్నాయి. ఇది పూర్తిగా కాపీ రైట్ చట్టాలను ఉల్లఘించడమే. ఇన్స్పిరేషన్, కాపీ... మా దృష్టిలో ఈ రెండిటి మధ్య గీత చాలా భిన్నమైనది. అలాగే, వివాదాస్పదమైనది కూడా! అందువల్ల, ఈ కాపీకి కారణమైన వాళ్ళపై మేం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాం'' అని 'తైక్కుడం బ్రిడ్జ్' తెలియజేసింది. అయితే... ఈ వివాదంపై 'కాంతార' చిత్ర బృందం ఇప్పటి వరకు స్పందించలేదు. 


Also Read : పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'లో విలన్‌గా హిందీ హీరో


'తైక్కుడం బ్రిడ్జ్' బ్యాండ్‌ను మలయాళ సంగీత దర్శకుడు గోవింద్ వసంత, గాయకుడు సిద్ధార్థ్ మీనన్ స్థాపించారు. మలయాళ హిట్ 'ప్రేమమ్', తమిళ హిట్ '96', సాయి పల్లవి 'గార్గి' తదితర చిత్రాలకు గోవింద్ వసంత సంగీతం అందించారు.


కాపీ రైట్ ఆరోపణలను పక్కన పడితే... రోజు రోజుకూ 'కాంతార'ను ప్రశంసిస్తున్న ప్రముఖల జాబితా పెరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, రెబల్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే... ఇలా ఒక్కరేమిటి? చాలా మంది ప్రముఖులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. అంతేనా? బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు సాధిస్తోంది. ప్రశంసల పరంగా, వసూళ్ల పరంగా దూకుడు చూపిస్తున్న 'కాంతార' చిత్రానికి 'వరాహ రూపం...' సాంగ్ విషయంలో కోర్టులో చుక్కెదురు అయ్యింది.