తమిళ స్టార్, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన ధనుష్ (Dhanush) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'సార్' (SIR Movie). ఆయనకు తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రమిది. తమిళంలో 'వాతి' (Vaathi Movie)గా విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ , త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఇందులో ఓ పాటను ధనుష్ పాడారు.
ధనుష్ 'సార్'...
సాంగ్ రెడీ సార్!
'సార్' సినిమాలో ఓ పాటను ధనుష్ ఆలపించారు. దానికి సంబంధించిన ఓ చిన్న వీడియో ఈ రోజు విడుదల చేశారు. అందులో జీవీ ప్రకాష్ కీ బోర్డు మీద మ్యూజిక్ ప్లే చేస్తుంటే... ధనుష్ హమ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతానికి అయితే ఆయన తమిళ్ లిరిక్స్ పాడుతూ ఉన్నారు. తెలుగులో ఆయన వాయిస్ ఉంటుందా? లేదా? అనేది చూడాలి. ఇటీవల విడుదలైన 'తిరు'లో తమిళ వెర్షన్ సాంగ్ ఆయన పాడగా... వేరే గాయకుడి చేత తెలుగులో పాడించారు. నవంబర్ 10న... అనగా గురువారం ఈ సాంగ్ విడుదల కానుంది.
ఇంతకు ముందు ధనుష్ కొన్ని పాటలు పాడారు. అన్నిటిలో 'వై థిస్ కొలవెరి డి' బాగా పాపులర్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ 'తిక్క'లో కూడా ఆయన ఓ పాట పాడారు.
Also Read : నేను ఒక్కరోజు టైమ్ తీసుకుంటా! కానీ, 'యశోద'కు... : సమంత ఇంటర్వ్యూ
డిసెంబర్ 2నే 'సార్'
Sir / Vaathi Movie Release Date : ముందుగా వెల్లడించినట్టుగా డిసెంబర్ 2న 'వాతి' / 'సార్' సినిమా విడుదల అవుతుందని, అందులో ఎటువంటి మార్పు లేదని చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పేర్కొంది. సో... మరో నెల రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట!
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్. 'భీమ్లా నాయక్', నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రమిది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ', అఖిల్ అక్కినేని 'మిస్టర్ మజ్ను', నితిన్ 'రంగ్ దే' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
విద్యా వ్యవస్థ నేపథ్యంలో 'సార్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆల్రెడీ 'యాన్ యాంబిషియస్ జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్' స్లోగన్‌తో విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇందులో ధనుష్ టైటిల్ రోల్ చేస్తున్నారని తెలిసింది.
'సూదు కవ్వం', 'సేతుపతి', 'తెగిడి', 'మిస్టర్ లోకల్', 'మార' తదితర చిత్రాలకు పనిచేసి దినేష్ కృష్ణన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కాగా... నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి కుమార్,తనికెళ్ల భరణి, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్.