AP TS Bifurcation Issues : ఏపీ, తెలంగాణ విభజన సమస్యలపై ఈనెల 23న కీలక సమావేశం జరగనుంది. దిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో విభజన సమస్యసపై సమావేశం జరగనుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోంశాఖ సమాచారం పంపించింది. ఈ నెల 23న జరిగే సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుందని సమాచారం. సెప్టెంబర్‌ 27వ తేదీ జరిగిన సమావేశంలో ఉమ్మడి అంశాలతో పాటు ఏపీకి చెందిన ఏడు అంశాలపై అధికారులు చర్చించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, అమరావతికి అనుసంధానం చేసే రైల్వే ప్రాజెక్టులతో పాటు పలు అంశాలను గత సమావేశం అజెండాలో కేంద్రం చేర్చింది. అయితే ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే భేటీ అసంపూర్తిగా ముగిసింది. విభజన చట్టంలోని అంశాలను 10 ఏళ్లలోపు పూర్తిచేయాలనే నిబంధనలు ఉండడంతో, ఆ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది.  


 ఏడు అంశాలపై చర్చ 


విభజన సమస్యలపై సెప్టెంబరు 27న జరిగిన  సమావేశం ఎజెండాలో మొత్తం 14 అంశాలు చేర్చి 7 అంశాలపై చర్చించారు.  ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, పునర్విభజన చట్టంలో లేని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనపై చర్చించారు. సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ విభజన అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్నాయి. బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన, ఏపీ ఎస్సీఎస్సీఎల్, టీఎస్ఎస్ఎల్ క్యాష్ క్రెడిట్, 2014-15  రైస్ సబ్సిడీ విడుదల అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు దాదాపు 26 సార్లు సమావేశాలు జరిగాయి. 


సెప్టెంబర్ 27 సమావేశంలో 


గత సమావేశంలో రాజధానికి వెయ్యి కోట్ల నిధులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఇప్పటికే ఇచ్చిన రూ.15 వందల కోట్ల ఖర్చుల వివరాలు అందజేయాలని కేంద్ర హోంశాఖ కోరింది. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విధంగా రాజధానికి రూ.29 వేల కోట్లు ఇవ్వాలని ఏపీ కోరగా కేంద్ర హోంశాఖ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వెనుకబడిన 7 జిల్లాలకు నిధుల అంశాన్ని గత సమావేశంలో ఏపీ అధికారులు లేవనెత్తారు. ఐదేళ్లపాటు నిధుల ఇవ్వాలని మాత్రమే నిర్ణయించారని కేంద్రం హోంశాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రానికి రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే బోర్డు తేల్చిచెప్పింది. అయితే ఈ విషయంపై నిర్ణయం మంత్రి వర్గానికి వదిలేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థల విభజన విషయంలో షీలా బిడే కమిటీ సిఫార్సులపై తెలంగాణ అంగీకరించడంలేదని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణతో సంబంధం లేకుండా కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవచ్చు కదా అని ఏపీ అధికారులు అన్నారు.  న్యాయ నిపుణులు సలహా అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.


సింగరేణిపై 


ఏపీ అధికారులు లేవనెత్తిన ఏ ఒక్క అంశానికి  తెలంగాణ అధికారులు అంగీకారం తెలపలేదు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహా పలు సంస్థల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ అధికారులు చెప్పారు.  పౌర సరఫరాల శాఖ బకాయిల గణాంకాల్లో తేడాలున్న విషయాన్ని ఏపీ అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. విభజన చట్టం ప్రకారం సింగరేణిని పంచాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. 51 శాతం ఈక్విటీని పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్నారన్నారు. సింగరేణికి ఉన్న ఏకైక అనుబంధ సంస్థ ఏపీహెచ్​ఎంఈఎల్​లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు ఈక్విటీ వర్తిస్తుందని తెలిపారు.