Ustaad Trailer: యంగ్ హీరో శ్రీసింహ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కుర్రహీరో. ఇటీవలే శ్రీసింహ ‘భాగ్ సాలే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించాడు. ఆ సినిమా వచ్చి ఎన్నో రోజులు గడవకముందే మరో సినిమాను లైన్ లో పెట్టాడు శ్రీసింహ. ‘ఉస్తాద్’ అనే మరో సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫణిదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా మెరవనుంది.  ఇప్పటికే ఈ మూవీకు సంబంధించిన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 


ఆకట్టుకునేలా ‘ఉస్తాద్’ ట్రైలర్..


ట్రైలర్ చూస్తుంటే సినిమా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీలా కనబడుతోంది. ట్రైలర్ లో శ్రీసింహా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపిస్తున్నాడు. అయితే మూవీలో హీరోకు ఒక చిన్న లోపం ఉంటుంది. అదే కోపం వచ్చిన ప్రతీ సారీ కంటికి కనిపించిన ఏదొక వస్తువును పగలగొడుతూ ఉండటం. ఇది నచ్చక తన తండ్రి ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. అలాంటి హీరో ఎంతో ఇష్టంగా చూసుకునే వస్తువు తన బైక్. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. ఆ బైక్ రైడింగ్ మీద ఉన్న ఇష్టమే అతన్ని పైలెట్ అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఈ మధ్యలోనే ఒక అమ్మాయితో లవ్ లో పడతాడు హీరో. తర్వాత తాను పైలెట్ అవ్వాలన్న కోరికను తన ఇంట్లో చెబితే తన తండ్రి నమ్మడు. మరి పైలెట్ అవ్వాలన్న హీరో ఆశ ఎలా నెరవేరింది? తను ప్రేమించిన అమ్మాయితో వచ్చిన సమస్య ఏంటి? తాను ప్రాణంగా చూసుకునే బైక్ ను ఎందుకు పగలకొడతాడు? తనకి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని దాటుకొని చివరకు పైలెట్ ఎలా అయ్యాడు అనేది స్టోరీ. 


ట్రైలర్ లోనే సినిమా మెయిన్ ప్లాట్ ను చూపించేశారు. అయితే ఈ కథ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ లానే ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉన్నా ఇలాంటి ఇన్స్పిరేషనల్ కథలను స్క్రీన్ పై చాలా జాగ్రత్తగా చూపించాలి. అందులో ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. మరి దర్శకుడు  మూవీను ఎలా చూపిస్తాడో చూడాలి. ఇక మూవీలో హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ ను కూడా గ్లామర్ గానే చూపించారు. పాటలు, మ్యూజిక్ పర్వాలేదనిపిస్తున్నాయి. మొత్తంగా ‘ఉస్తాద్’ ట్రైలర్ ను టైటిల్ కు తగ్గట్టుగానే కట్ చేశారు మేకర్స్. మరి మూవీ థియేటర్లలో ఎలా ఉంటుందో చూడాలి. 


ఇక ఈ సినిమాను వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. అకీవా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 12న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు ముందు చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’, రజినికాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి వాటి మధ్య రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.



Also Read: ఇలియానా నిండు గర్భం - దగ్గరలో డెలివరీ డేట్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial