పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా 'రాధేశ్యామ్' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. విధికి, ప్రేమకి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. ఈ క్రమంలో హీరో, హీరోయిన్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారనేది సినిమాలో చూపించారు. జస్టిన్ ప్రభాకరన్ సాంగ్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. 


ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'రాధేశ్యామ్' సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడం, పైగా ప్రభాస్ సినిమా కావడంతో చాలా ఓటీటీ సంస్థలు ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 'రాధేశ్యామ్' నిర్మాతలతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. 


సాధారణంగా ఏ సినిమా అయినా.. థియేట్రికల్ రిలీజ్ అనంతరం నాలుగు వారాల తరువాతే డిజిటల్ ప్లాట్ ఫామ్ కు వస్తుంది. అంటే 'రాధేశ్యామ్' ఏప్రిల్ 11 తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. కానీ ఏప్రిల్ 2న ఉగాది పండగ కావడంతో ఆ రోజే మధ్యాహ్నం 12 గంటల నుంచి 'రాధేశ్యామ్' సినిమాను స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రికార్డ్ సాధిస్తుందో చూడాలి. 


ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. 'రాధే శ్యామ్'కు తొలి రోజు రూ. 79 కోట్ల గ్రాస్ వచ్చింది. రెండో రోజు రూ. 40 కోట్ల గ్రాస్, మూడో రోజైన ఆదివారం రూ. 32 కోట్ల గ్రాస్ వచ్చింది. మొత్తం మీద మూడు రోజుల్లో రూ. 151 కోట్లు గ్రాస్ ను వసూలు చేసింది.