ఒకప్పుడు సినిమాలు రెండున్నర గంటలకు మించి ఉండేవి కావు. వీలైనంత క్రిస్పీగా సినిమాలను ఎడిట్ చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో విడుదలవుతోన్న చాలా సినిమాలు మూడు గంటలకు పైగానే ఉంటున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'రంగస్థలం' లాంటి సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితో చాలా బాగా ఆడాయి. తాజాగా 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2' సినిమాలు కూడా ఎక్కువ నిడివితోనే ప్రేక్షకులను మెప్పించాయి. 


సినిమాలో విషయం ఉంటే నిడివి పెద్ద మేటర్ కాదని నిరూపించాయి ఈ సినిమాలు. ఈ క్రమంలో ఏప్రిల్ 29న విడుదల కానున్న 'ఆచార్య' సినిమాను కూడా ఎక్కువ రన్ టైంతోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా రిలీజ్ కోసం కేడీఎంలను ముందుగానే పంపించారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు రన్ టైమ్ తెలిసిపోయింది. అక్కడివారు సమాచారం ప్రకారం.. 'ఆచార్య' సినిమా రన్ టైమ్ 2 గంటల 46 నిమిషాలు. 


తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే నిడివితో సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. కొరటాల తన కెరీర్ లోనే చాలా ఎక్కువ సమయంలో తీసుకొని చేసిన సినిమా ఇది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం కూడా చాలా సమయం తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. 


కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తిరుణ్ణావుక్క‌రుసు సినిమాటోగ్రాఫ‌ర్‌. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావ‌డం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి సినిమాల‌ను తీయ‌డంలో కొరటాలకు మంచి పేరుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!


Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత