అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రభాస్ ఎపిసోడ్ రెండో భాగం వచ్చేసింది. మొదటి భాగం పూర్తిగా ఫన్ మోడ్‌లో సాగగా, రెండో భాగం మాత్రం ఫన్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా సాగింది. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభాస్ కూడా స్టేజీ మీద ఎమోషనల్ అయిపోయాడు. ప్రభాస్‌తో పాటు బాలకృష్ణ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి.


గోపిచంద్ స్టేజీ మీదకు ఎంటర్ అవ్వడంతో ఈ ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. గోపిచంద్‌ను ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ అడగ్గా, వచ్చే సంవత్సరం ఉండవచ్చేమో అని గోపిచంద్ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్, గోపిచంద్‌లతో బాలకృష్ణ ఒక గేమ్ ఆడారు.


గోపిచంద్ తండ్రి టి.కృష్ణ ప్రస్తావన కూడా వచ్చింది. దీంతో పాటు ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు ప్రభాస్, గోపిచంద్ ఎలా ఆలోచించారనే దానిపై కూడా బాలకృష్ణ ప్రశ్నించారు. మొదటి ఎపిసోడ్‌కు ఏ మాత్రం తగ్గని విధంగా ఆసక్తికరంగా ఈ రెండో ఎపిసోడ్ కూడా సాగింది.


ఈరోజు తాము ఈ పరిస్థితిలో ఉన్నామంటే పెదనాన్న వల్లే అని ప్రభాస్ అన్నారు.. ఆయనకు తామంతా రుణపడి ఉన్నామని ఎమోషనల్ అయ్యారు. తమ కుటుంబం అంతా పెదనాన్న మిస్ అవుతోందని ప్రభాస్ తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో నెల రోజులు ఉన్నారని ప్రభాస్ తెలిపారు. అప్పుడు తానూ ఆసుపత్రిలో ఉన్నానని, నిరంతరం వైద్యులతో సంప్రదింపులు జరిపానని ప్రభాస్ పేర్కొన్నారు.


కృష్ణంరాజు మరణించిన సమయంలో తాను టర్కీలో ఉన్నారని బాలకృష్ణ తెలిపారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'వీర సింహా రెడ్డి' చిత్రీకరణలో ఉండటంతో భారతదేశానికి ఆయన రాలేకపోయారు. ఆ విషయాన్ని గుర్తు చేసిన బాలకృష్ణ 'నాకు విషయం తెలియగానే కంట్రోల్ చేసుకోలేకపోయా. వెంటనే ఏడుపు వచ్చేసింది' అని చెప్పారు.


గతవారం విడుదల అయిన బాహుబలి ఎపిసోడ్ మొదటి భాగం స్ట్రీమింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆహా సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఎపిసోడ్ చూడాలని ఎంత ప్రయత్నించినా అభిమానులకు యాప్ ఓపెన్ కాలేదు. ఆ తర్వాత అర్థరాత్రి దాటాక సర్వర్లు రీస్టోర్ అయ్యాయి. అయితే రెండో ఎపిసోడ్‌తో ఆ ప్రమాదం రాలేదు.