Unstoppable NBK PSPK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మరి కాసేపట్లే స్ట్రీమ్ కానుంది. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఒక టాక్ షో ఎపిసోడ్‌కు ఇలా జరగడం భారతదేశంలోనే ఇదే తొలి సారంట. ఈ విషయాన్ని ‘ఆహా’ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించింది.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ స్క్రీనింగ్ జరగనుంది. ఎపిసోడ్ రాత్రి తొమ్మిది గంటలకు స్ట్రీమ్ కానుండగా, ఫ్యాన్స్ సాయంత్రం నుంచే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు. ప్రసాద్ ల్యాబ్స్ ముంగిట టపాసులు పేలుస్తూ సందడి చేస్తున్న విజువల్స్‌ను కూడా ఆహా సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇందులో మొదటి భాగం ఈరోజు స్ట్రీమ్ కానుంది. రెండో భాగం ఎప్పుడు స్ట్రీమ్ కానుందో ఇంకా తెలియరాలేదు. ఫిబ్రవరి 10వ తేదీన కానీ లేదా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీన కానీ రెండో భాగం స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. మొదటి ఎపిసోడ్ నిడివిని కూడా ఆహా ప్రకటించింది. ఈ ఎపిసోడ్ నిడివి 75 నిమిషాలు. అంటే గంటా 15 నిమిషాల పాటు ఈ ఎపిసోడ్‌ను చూడవచ్చన్న మాట.
ఈ ఎపిసోడ్‌లో కొన్ని వివాదాస్పద అంశాలను కూడా టచ్ చేసినట్లు కనిపించింది. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, ఇంత ఫాలోయింగ్ ఉండి కూడా ఓట్లుగా మారలేకపోవడం వంటి అంశాలను ప్రోమోలో ప్రస్తావించారు. ‘ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా’ అని అడిగినప్పుడు దానికి పవన్ చెప్పిన సమాధానాన్ని పూర్తిగా చెప్పలేదు. అలాగే తనకు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వచ్చిన విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. రాష్ట్రంలో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నప్పటికీ, ఆ ప్రేమ ఓట్ల రూపంలో ఎందుకు కనిపించడం లేదు అని బాలయ్య అడిగారు.
ఇక ఈ ఎపిసోడ్‌లో సాయిధరమ్ తేజ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. పంచె కట్టుకుని వచ్చిన తేజ్‌ను చూసిన బాలకృష్ణ ‘ఏమ్మా... పెళ్లి చూపులకు వచ్చావా? ఇక్కడే ఉన్నారు చూడు’ అని ఆట పట్టించారు. ‘అమ్మాయిలని ఎలా గౌరవించాలో కూడా ఆయనే నేర్పారండీ.’ అని పవన్ కళ్యాణ్ గురించి తేజ్ చెప్పారు. ‘తొడ కొట్టి వెళ్లిపో’ అని సాయి ధరమ్ తేజ్‌కు బాలయ్య చెప్పారు. అప్పుడు తేజ్ బాలకృష్ణ దగ్గరకు వెళ్లగా ఆయన ‘నా తొడ కాదమ్మా నీ తొడ కొట్టాలి.’ అన్నారు.
ఈ ఎపిసోడ్ ప్రోమోలో ‘ఈశ్వరా... పవనేశ్వరా... పవరేశ్వరా...’ అంటూ పవన్ గురించి బండ్ల గణేష్ ఇచ్చిన వైరల్ స్పీచ్‌ను బాలకృష్ణ ఇమిటేట్ చేయగా... అన్‌స్టాపబుల్‌లో బాలయ్య రెగ్యులర్‌గా చెప్పే ‘నేను మీకు తెలుసు. నా స్థానం మీ మనసు.’ అనే మాటను పవన్ కళ్యాణ్ అన్నారు.
‘గుడుంబా శంకర్ సినిమాలో ప్యాంట్ మీద ప్యాంట్ వేశావు. అలా ప్యాంటేసి పాతిక సంవత్సరాలు వయసు తగ్గావు తెలుసా?’ అని పవన్‌ను బాలయ్య ఆటపట్టించారు. ఆ తర్వాత ఇద్దరూ మొదటి సారి కలిసినప్పటి ఫొటోను చూపించి ‘అప్పుడు నేను యంగ్‌గా ఉన్నాను కదా’ అని బాలయ్య అనగా ‘ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు’ అని పవన్ కాంప్లిమెంట్ ఇచ్చారు.