Seethe Ramudi Katnam Telugu Serial Today Episode మధుమితని మహాలక్ష్మి తన ఇంటికి పిలుస్తుంది. దీంతో మధు ఆలోచనలో పడుతుంది. అప్పుడే జలజ మధు దగ్గరికి వచ్చి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడుంటే అందరూ మాటలు అంటారు అని మహాలక్ష్మి గారితో వెళ్తే మంచిదని చెప్తుంది.


మధు: సూర్య స్టేషన్‌లో ఉన్నాడు తనతో చెప్పకుండా తనని వదిలేసి ఎలా వెళ్లను అక్క.
జలజ: అదంతా నేను చూసుకుంటాను. అయినా నువ్వు ఇదంతా చేస్తుంది సూర్య కోసమే కదా.. సూర్యకి నేను మీ బావగారు చెప్తాంలే.
మధు: అక్కడికి వెళ్తే సీత ఏమనుకుంటుందో..
జలజ: సీత ఏమైనా పరాయిదా నీ సొంత చెల్లే కదా.. నీ కష్టాన్ని అర్థం చేసుకోదా సీత చాలా మంచిది మధు. అని జలజ మధుమిత బట్టలు సర్దుతుంది.


రామ్ ఇంటికి వచ్చి సీతని పిలుస్తాడు. సీత లేదు అని తన ఊరు వెళ్లిందని రేవతి, చలపతి చెప్తారు. ఇక వాళ్లిద్దరూ మహాలక్ష్మి ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికే అక్కడికి వెళ్లింది అంటే రామ్ వాళ్లతో వాదిస్తారు. సీత కావాలనే తన పిన్నిని ఇబ్బంది పెట్టడానికి వెళ్లిందని అంటాడు. రేవతి, చలపతి సీతకు సపోర్ట్‌గా మాట్లాడుతారు. సీతకు ఇంట్లో అన్యాయం జరుగుతుంది అని చెప్తారు. సీతని నమ్మి అంతా అర్థం చేసుకో అని అంటారు. కానీ రామ్ పిన్ని చేసిందే రైట్ సీత రాంగ్‌గా అర్థం చేసుకుంటుంది అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు మధుమిత మహాలక్ష్మి వాళ్లతో వెళ్లడానికి రెడీ అవుతుంది. 


మహాలక్ష్మి: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్ మధుమిత.
జనార్థన్: నువ్వు మాతో రావడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
మధు: మిమల్ని ఇబ్బంది పెడుతున్నాను అని చాలా గిల్టీగా ఉందండి.
మహాలక్ష్మి: నో గిల్టీ నువ్వు మా కోడలిగా మా ఇంటికి రాబోతున్నావ్. 
మధు: ఏంటండి అన్నారు.
జనార్ధన్: అదే నమ్మా నీ చెల్లెలు మా కోడలు కదా నువ్వు కూడా మా కోడలే.. పదమ్మా వెళ్దాం.
మధు: ముందు స్టేషన్‌కి వెళ్లి సూర్యకి విషయం చెప్పి వెళ్దామండి.
జలజ: అవసరం లేదు మధు.. సూర్యకి నేను మీ బావగారు చెప్తాం.
జనార్థన్: స్టేషన్ దగ్గర మీడియా వాళ్లు ఉంటే అనవసరంగా విషయం బయటకు వస్తుందమ్మా. 
జలజ: ఏం చేయాలో మేడం వాళ్లకి తెలుసు మధు. నువ్వు హ్యాపీగా వెళ్లు. 
సీత: మధు కారు ఎక్కుతుంటే.. అక్కా..
మహాలక్ష్మి: నువ్వేంటి సీత ఇక్కడికి వచ్చావ్..
సీత: మా అక్క కోసం వచ్చాను. 
జనార్ధన్: అదేంటి సీత మీ అక్క విషయం మేం చూసుకుంటాం అని మహా మన ఇంట్లోనే చెప్పింది కదా మళ్లీ నువ్వు ఎందుకు వచ్చావ్. 
సీత: నేను మా అక్కతో మాట్లాడాలి.
జలజ: మేడం మధుతో అంత మాట్లాడారు. 
సీత: మీరు ఎలాంటి వాళ్లో నాకు బాగా తెలుసు మీ లాంటి వాళ్ల చేతిలో మా అక్కని పడనివ్వను. 
మహాలక్ష్మి: చూశావా మధుమిత మేం నీ కోసం అంత దూరం నుంచి వస్తే నీ చెల్లెలు సీత ఎలా మాట్లాడుతుందో. 
జనార్ధన్: సీత ఎప్పుడూ ఇంతేనమ్మా.. మేం మంచి చేయాలి అనుకుంటే ఇలానే అడ్డుకుంటుంది.
సీత: అక్క నేను నీతో మాట్లాడాలి కొంచెం పక్కకు వస్తావా..
మహాలక్ష్మి: ఇక్కడే మాట్లాడు సీత.
సీత: నేను మా అక్కతో పర్సనల్‌గా మాట్లాడాలి రా అక్క. 
జలజ: సీత మధు మనసు మార్చేస్తుంది ఏమో మేడం. మధు మీతో రాకుండా చేస్తుంది ఏమో.
మధు: నా కోసం మహాలక్ష్మి గారు వచ్చారు కదా మళ్లీ నువ్వెందుకు వచ్చావ్ సీత.
సీత: అదేం ప్రశ్న అక్క నీ కోసం ఆవిడ రావడానికి నేను రావడానికి తేడా లేదా..
మధు: అది కాదు నువ్వు పంపిస్తేనే వాళ్లు వచ్చారు అనుకున్నాను.
సీత: వాళ్లు ఇక్కడికి వస్తున్నట్లు నాతో చెప్పలేదు. బ్యాగ్ తీసుకొని నువ్వెక్కడికి బయల్దేరావ్..
మధు: మహాలక్ష్మి గారి ఇంటికి అదే మీ ఇంటికే. సూర్యని బయటకు తీసుకొచ్చే వరకు నన్ను మీ ఇంట్లోనే ఉండమన్నారు.
సీత: మనసులో.. అంటే మా అక్కని నీ దగ్గరకు రప్పించుకొని.. నీ గుప్పెట్లో పెట్టాలి అనుకున్నావా అత్తయ్య. ఎవరింట్లో ఉండాల్సిన ఖర్మ నీకేంటి అక్క. మనకు మన పుట్టిళ్లు లేదా.. నేను ఇప్పుడే ఇంటికి వెళ్లి వస్తున్నా నాన్న నిన్ను మన ఇంటికి తీసుకురమ్మన్నారు. పద వెళ్దాం.
మధు: వద్దు సీత నేను మళ్లీ ఆ ఇంటి గడప తొక్కదలచుకోలేదు. నేను మహాలక్ష్మి గారితోనే వెళ్తాను. సూర్యను విడిపిస్తాను అని అప్పటి వరకు నన్ను భద్రంగా చూసుకుంటాను అని ఆమె హామీ ఇచ్చారు. ఆ పని మన నాన్న చేయరు సీత. నోరు తెరచి దండం పెట్టి అడిగాను చేయను అనేశారు.
సీత: అందుకని నువ్వు ఆవిడతో వెళ్తావా వద్దు అక్క.
మధు: అంత కంటే నాకు వేరే దారిలేదు. 
సీత: నీకు ఏమైనా పిచ్చా.. నాన్న నిన్ను తీసుకురమ్మన్నారు. నాన్న సూర్య బావని విడిపిస్తారు. నాన్నకు నేను చెప్తాను. నా మాట విను అక్క.
మధు: నీ మాట విని నేను నీతో వస్తాను కానీ తర్వాత జరిగేది ఏంటో తెలుసా. నువ్వు నన్ను నాన్న ఇంట్లో దించి నాకు సాయం చేయమని చెప్పి వెళ్లిపోతావ్. ఒకటి రెండు రోజులు బాగానే ఉంటుంది. తర్వాత ఎవరో వస్తారు మీ కూతురు ఇలా మీ అల్లుడు అలా అని అంటారు. నాన్నకి కోపం వచ్చి నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొడతారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి. 
సీత: అలా ఏం జరగదు అక్క. నాన్న అలాంటోడు కాదు.
మధు: అలాగే జరుగుతుంది సీత. రామ్‌ని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు నువ్వు ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ నేను సూర్యని పెళ్లి చేసుకొని సొంత పుట్టింటిలోనే నిందలు అవమానాలు పడ్డాను. నాన్నకు నన్ను చంపేయాలి అన్నంత కోపం ఉంది. సాయం చేసే గుణం లేదు. నేను కష్టంలో ఉన్నప్పుడు నాన్న నన్ను ఆదుకోలేదు. నా అన్నవారు ఎవరూ రాలేదు. కానీ మహాలక్ష్మిగారు వచ్చారు. నాకు ధైర్యం చెప్పారు. సూర్యని విడిపించే ప్రయత్నం చేస్తాను అని నాకు ప్రామిస్ చేశారు. అందుకే నేను ఆమెతో వెళ్లడానికి ఒప్పుకున్నాను.
సీత: ఆవిడ నువ్వు అనుకున్న అంత మంచిది కాదు అక్క. అర్థం చేసుకో ఆవిడతో వెళ్లకు.
మధు: సారీ సీత నేను వెళ్తాను నువ్వు నాకు అడ్డు చెప్పొద్దు.
సీత: ఆవిడ నిన్ను ఎందుకు తీసుకువెళ్తుందో తెలుసా. నీకు ఆవిడ ప్లాన్ మొత్తం చెప్పనా..
మధు: నాకు ఏం చెప్పొద్దు. నేను ఆవిడతోనే వెళ్తాను.. సరే నువ్వు సూర్యని బయటకు తీసుకురాగలవా. నీ వల్ల అవుతుందా చెప్పు. అవ్వదు కదా.. నీ ప్రయత్నం నువ్వు చేసే ఉంటావు. అలాగే నా ప్రయత్నం నన్ను చేయనివ్వు. నన్ను వెళ్లనివ్వు. మనం బయల్దేరుదామా అండీ..
సీత: వద్దు అక్క నాన్న ఇంటి దగ్గరకు వెళ్దాం పద.
మధు: వద్దు సీత నన్ను పదే పదే అడగకు.
మహాలక్ష్మి: ఏంటి సీత నేను మీ అక్కకి సాయం చేయనా. నువ్వు చెప్తే కదా మేం ఇక్కడికి వచ్చాం. మేం చేసింది అంతా నీకు ఎందుకు అర్థం కావడం లేదు సీత.
జలజ: ఈ పరిస్థితుల్లో మీ అక్కకి మేడం తప్ప ఇంకెవరూ సాయం చేయలేరు సీత. మీ అక్కమీద నీకు ఏ మాత్రం ఇష్టం ఉన్నా దయచేసి ఒప్పుకో. మంచి అవకాశాన్ని చెడగొట్టకు.
మధు: ఒకసారి నా వల్ల నీ తలరాత మారింది అన్నావు సీత. ఇప్పుడు నీ వల్ల నా విధిరాత మారకూడదు. నేను మహాలక్ష్మి గారితో వెళ్తున్నాను. నువ్వు కూడా వెళ్లిపో.. మహాలక్ష్మి వాళ్లతో మధు వెళ్తే సీత కారు వెనక పరుగులు తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'ఫ్యామిలీ స్టార్' మూవీ టీజర్‌: ఏవండి.. కాలేజ్‌కి వెళ్లాలి - అయితే లీటర్ పెట్రోల్ కొట్టించు.. ఆకట్టుకుంటున్న 'ఫ్యామిలీ స్టార్‌' టీజర్