పండగ ఏదైనా సరే, బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ దొరుకుతుంది. ఆయా వేడుకలకు అనుగుణంగా స్పెషల్ షోలను ఏర్పాటు చేస్తాయి టీవీ చానెళ్లు. ఇక వినాయకచవితి సందర్భంగా స్టార్ మా అదిరిపోయే షోను ప్లాన్ చేసింది. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ ప్రేక్షకులను ఓ రేంజిలో ఎంటర్ టైన్ చేయబోతోంది. తాజాగా ఈ షోకు సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది. స్టార్ మా సీరియల్ నటీనటులతో పాటు పలువురు కమెడియన్లు, సినిమా నటీనటులు, డ్యాన్సర్లు అద్భుతంగా అలరించారు. ప్రోమో మొదలుకాగానే యాంకర్ వర్షిణి మీద వేసే పంచ్ కడుపుబ్బా నవ్విస్తుంది. ”నువ్వు పండక్కి వచ్చావో తెలియదు, పండగ అయ్యాక ఓ ప్రోగ్రాం చేస్తాం చూడు దానికి వచ్చావో తెలియదు” అనగానే షోలోని వారంతా నవ్వుతారు. పండగ తర్వాత చేసే ప్రోగ్రామ్ ఏంటి? అని వర్షిణి అయోమయంలో పడుతుంది.  రికార్డింగ్ డ్యాన్స్ అనడంతో ఆమెకు బల్బ్ వెలుగుతుంది.


రైతు బిడ్డలా కామెడీ చేసిన ముక్కు అవినాష్


ఇక ఈ షోలో సిటీ టీమ్, పల్లెటూరు టీమ్ గా విడిపోయి ప్రేక్షకులకు కామెడీ పంచుతారు. పల్లెటూరి టీమ్ లోని  ముక్కు అవినాష్, సిటీ టీమ్ లోని హరి చేసే ఫన్ ఆకట్టుకుంటుంది.  మీ పల్లెటూర్లలో వినాయకుడి విగ్రహాలు ఇంత ఉంటాయని, మా సిటీలో తల పైకెత్తి చూడాల్సి వస్తుందని హరి అంటాడు. అసలు వినాయకుడిని దేనితో తయారు చేస్తారు? అని అడుగుతాడు అవినాష్. మట్టి అని చెప్తాడు హరి. ఆ మట్టి పుట్టిందే మా విలేజ్ లో రా అంటాడు. ఈ సందర్భంగా అన్నా, నేనన్నా రైతుబిడ్డనన్నా అంటూ కామెడీ చేస్తాడు. రైతు పుట్టింది కూడా విలేజ్ లో నేరా అంటూ నవ్వుల్లో ముంచేస్తాడు. సిటీ సిటీ అంటూ చిన్న చూపు చూస్తారు ఎందుకు? దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది మేమే కాదా అంటుంది అరియానా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్లం చిన్న చూపు. ఇప్పుడు పెద్దగా అయ్యావుగా పెద్ద చూపే చూస్తున్నాం అనడంతో అందరూ నవ్వుతారు.  ఇక నటి తేజస్వి డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.


స్పెషల్ గెస్టులుగా బోయపాటి, తమన్


ఈ షోకి స్పెషల్ గెస్టులుగా దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్ వచ్చారు. ఇక ‘రూల్స్ రంజన్’ జోడీ కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరు చేసిన డ్యాన్స్, కామెడీ అందరినీ ఆకట్టుకుంది. హరికి, ముక్కు అవినాష్ కు నేహా రాకీ కట్టడం అందరినీ అలరిస్తుంది.   


షోకే హైలెట్ గా మానస్ ‘పుష్ప’ గెటప్


ఇక ‘పుష్ప2’ సినిమాలో అల్లు అర్జున్ మాదిరిగా గంగమ్మ జాతర గెటప్ వేసుకుని అందరినీ అలరించాడు ‘బ్రహ్మముడి’ సీరియల్ నటుడు మానస్. ‘ఏ బిడ్డా, ఇది నా అడ్డా’ అనే పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. అచ్చం బన్నీలాగే ఆహార్యం కనబరుస్తూ ఆకట్టుకున్నాడు. ఇక గణపతి పాటకు చేసిన స్పెషల్ సాంగ్ పై దర్శకుడు బోయపాటి ప్రశంసల జల్లు కురిపించారు. అద్భుతంగా ఉందంటూ అభినందించారు. ఇక ఈ షోలో ఫన్ గేమ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ షో నవంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు  స్టార్ మాలో ప్రసారం కానుంది.  



Read Also: 300 కోట్లు కాదు, అంత కంటే ఎక్కువే - ‘జవాన్‘ బడ్జెట్ ఎంతో రివీల్ చేసిన అట్లీ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial