Naga Panchami Today Episode పంచమి కోసం మోక్ష పాలు రెడీ చేస్తుంటే.. శబరి వచ్చి కుంకుమ పువ్వు కలుపుతుంది. ఇక శబరి పంచమి కోసం పాలు తీసుకెళ్లిన తర్వాత చిత్ర, జ్వాలలు మెట్ల మీద నూనె పడేస్తారు. మోక్ష జారిపడితే ఆ నింద పంచమి కడుపులో బిడ్డమీద పెట్టేయొచ్చని ప్లాన్ వేస్తారు. మోక్ష తన గదికి వెళ్తుండగా నూనె మీద కాలు వేసి జారి పడిపోతాడు.
రఘురాం: అరగంటలో స్ఫృహాలోకి వస్తాడు అన్నారు ఇంకా రాలేదు.
జ్వాల: ఆ సోది అమ్మ చెప్పినట్లే అవుతుంది అత్తయ్య అప్పుడే ఇంట్లో అరిష్టం జరగడం ప్రారంభమైంది.
చిత్ర: అయినా చిత్రం కాకపోతే రోజూ తిరిగే ఇంట్లో మోక్ష పడిపోవడం ఏంటి. అంతా పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎఫెక్టే.
వైదేహి: అంతా నా ఖర్మ. ఒక్కరూ నా మాట వినడం లేదు అందుకే నా బిడ్డకు ఈ పరిస్థితి వచ్చింది.
శబరి: సూటి పోటి మాటలతో ఒరిగేది ఏం లేదు వైదేహి. ఒకరి మనసుని గాయపరచడం తప్పు.
వైదేహి: మీరు అందరూ ఇలా చెప్పే నా నోరు మూయిస్తున్నారు. ఆ బిడ్డ పుట్టుక అష్టదరిద్రం అని చెప్తున్నా మీరెవ్వరూ నా మాట వినడం లేదు. నా బిడ్డ ప్రాణం పోతే మళ్లీ తిరిగి వస్తుంది అంటే నేను ఎవర్నీ ఏమీ అనను. పంచమి నువ్వే చూస్తున్నావ్ కదా నీ కడుపులో బిడ్డ బయటకు రాకముందే నా బిడ్డ ప్రాణాల మీదకు వచ్చింది. నీ మీద నాకు ఎలాంటి కోపతాపాలు లేవు నా బాధ అంతా కొడుకు గురించే. మా గురువుగారికి మా మీద కానీ మా ఇంటి మీద ఎలాంటి ద్వేషం లేదు అలాంటి వార్త చెప్పడానికి. జరగబోయేది ఆయన కంటికి కనిపిస్తుంది కాబట్లే అలా చెప్పారు. ఆయన మాట నమ్మకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. నువ్వు నీ బిడ్డను ప్రసవిస్తే నాకు నా బిడ్డ దూరం కావడం ఖాయం.
జ్వాలా: మోక్షకు ఇంత జరిగినా పంచమి ఒప్పుకోవడం లేదు అంటే అంతకంటే స్వార్థం మరొకటి లేదు.
చిత్ర: భర్త కన్నా బిడ్డేం ఎక్కువ కాదు. ఎంత మూర్ఖులు అయినా సరే ఇంకా పుట్టని బిడ్డ కోసం భర్తను చంపుకోదు.
వైదేహి: పెద్ద మనసుతో అర్థం చేసుకో పంచమి నాకు పుత్రభిక్ష పెట్టు తల్లి. అని కొంగుచాచి అడుగుతుంది. గర్భం తీయించడానికి మోక్ష ఒప్పుకోడు. నాకు ఏ సాయం చేయాలన్నా నువ్వే చేయాలి పంచమి. రేపు మోక్ష నిన్ను నా ఇంటి నుంచి తీసుకెళ్లిపోతే నేను ఉండగలనా.. నీ నిర్ణయం బట్టే మా తల్లీకొడుకుల ప్రాణాలు ఉన్నాయి ఆలోచించు పంచమి.
మోక్షకు మెలకువ వస్తుంది. అందరూ కుశల ప్రశ్నలు వేస్తారు. అయితే ఎవరికీ ఏం చెప్పకుండా మోక్ష పంచమిని తీసుకొని బయటకు వెళ్లిపోతాడు. వైదేహి కింద పడి ఏడస్తుంది. ఇక మోక్ష పంచమితో నీ కడుపులో ఉన్న బిడ్డ నేను అందంగా పుట్టాలి అందుకు కుంకుమ పువ్వు కలిపిన పాలు ఇవ్వమని అడిగితే వెళ్లాను అని చెప్తాడు. పంచమి అత్త మాటలు తలచుకొని ఏడుస్తుంది.
పంచమి: మీరు మన బిడ్డ మీద అంత ప్రేమ పెంచుకోవద్దు మోక్షాబాబు. నాకు అయితే అన్ని ఆశలు లేవు. అన్నీ చంపుకుంటున్నాను.
మోక్ష: అర్థమైంది పంచమి మా అమ్మ మాటలు సీరియస్‌గా తీసుకోకు. నేను అంటే తనకు ప్రాణం. మనం ఎక్కడికి వెళ్లడం లేదు. మా అమ్మ నన్ను ఎక్కడికి వెళ్లనివ్వుదు.
పంచమి: నా బాధ అంతా మీ గురించే మోక్షాబాబు. నా మధ్య, మీ అమ్మ మధ్య నలిగిపోతున్నారు.
మోక్ష: అదేం లేదు పంచమి నాకు మీ ఇద్దరు ఇష్టం కానీ ఇప్పుడు మరొకరు ఆ ప్రేమ పంచుకోబోతున్నారు.
పంచమి భర్తని ప్రేమతో హగ్ చేసుకుంటుంది. ప్రేమగా ఆరుబయటే భర్తకు తినిపిస్తుంది. మోక్ష కూడా పంచమికి తినిపిస్తాడు. తర్వాత మోక్ష పంచమి ఒడిలో పడుకుండిపోతాడు. పంచమి కూడా అక్కడే పడుకుంటుంది.
నాగేశ్వరి: మాతా మీరు నాకు అప్పగించిన కార్యం నెరవేర్చలేనేమో అని భయంగా ఉంది మాతా. పంచమి గర్భంలో ఉన్న మహారాణి విశాలాక్షి జన్మకు ఏవో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అనిపిస్తుంది మాతా.
నాగదేవత: నీకు ఎందుకు అలా అనిపించింది నాగేశ్వరి. మహారాణి తనను తాను కాపాడుకోగలదు.
నాగేశ్వరి: లేదు మాతా అసలు పసిబిడ్డనే ఈ భూమ్మీదకు రాకుండా ఏవో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నాగదేవత: నీ మీద పూర్తి నమ్మకంతో ఆ బాధ్యత నీకు అప్పగించాను. మహారాణి పుట్టుకకు ఎలాంటి అవరోధం వాటిళ్లకూడదు. ఆ బిడ్డ పుట్టకుండా చేస్తే నాగలోకానికి మహారాణి లేకుండా పోతుంది.
నాగేశ్వరి: అలాంటి పరిస్థితి రాకుండా నా ప్రాణాలు తెగించి పోరాడుతాను మాతా. కానీ నా వల్ల ఆ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని పంచమి తన బిడ్డ మీద ఒట్టు వేసి నన్ను పంపేసింది.
నాగదేవత: పంచమికి కనిపించకుండా నువ్వు ఆ ఇంటి పరిసరాల్లోనే ఉంటూ మన కార్యం నెరవేర్చు నాగేశ్వరి. నీ సామర్ధ్యం మీద నాకు విశ్వాసం ఉంది.
మరోవైపు ఇంట్లో అందరూ మోక్ష ఇంటి నుంచి వెళ్లిపోతాడేమో అని కంగారుగా హాల్‌లో ఎదురు చూస్తుంటారు. ఇక వైదేహి మోక్ష ఇంటి నుంచి వెళ్లిపోతే చనిపోతాను అని భర్తతో చెప్తుంది. తన కొడుకుకు తానంటే ప్రాణం అని వదిలి వెళ్లడని అంటుంది. ఇంతలో మోక్ష వచ్చి అవునమ్మ నువ్వు అంటే నాకు ప్రాణం కానీ మేం వెళ్లిపోతున్నాం అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.