Minister Roja Selvamani Visits Tirumala With Jabardasth Team: ఆంధ్రప్రదేశ్ మంత్రి, ప్రముఖ నటి రోజా సెల్వమని తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ‘జబర్దస్త్‘ కమెడియన్లు అంతా కలిసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. రోజా పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందే తిరుమలకు చేరుకున్న ‘జబర్దస్త్‘ టీమ్ మెంబర్స్, ఉదయాన్నే అందరూ కలిసి ఆమె దగ్గరికి వెళ్లి బర్త్ డే విషెష్ చెప్పారు.






‘జబర్దస్త్‘ కమెడియన్లతో శ్రీవారిని దర్శించుకున్న రోజా


అనంతరం ‘జబర్దస్త్‘ టీమ్ తో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీ వారికి జరిగే నైవేధ్య విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి రోజాకు టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. తీర్థప్రసాదాలు ఇచ్చి సత్కరించారు. పుట్టినరోజు నాడు ‘జబర్దస్త్‘ సభ్యులతో కలిసి స్వామి వారిని  దర్శించుకోవడం సంతోషంగా ఉందని రోజా వెల్లడించారు.   






తిరుమల శ్రీవారు అంటే రోజాకు ఎంతో ఇష్టం


వాస్తవానికి రోజాకు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అంటే చాలా ఇష్టం. పుట్టిన రోజు, పర్వదినాలతో పాటు, వారానికి ఓసారి వేంకటేశ్వరుడి చెంతకు వెళ్తారు. స్వామి వారిని దర్శించుకుంటే తనకు మనసు ప్రశాంతంగా ఉంటుందని గతంలో చాలా సార్లు రోజా వెల్లడించారు. అందుకే తరచుగా కలియుగ ప్రత్యక్షదైవాన్ని దర్శించుకుంటానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, గతంలో నగరి నియోజకవర్గాన్ని తిరుపతి బాలాజీ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ కూడా చేశారు. తమ ఇలవేల్పు అయిన శ్రీవారి నుంచి తమ నియోజకవర్గాన్ని వేరు చేయకూడదని కోరారు. కానీ, ఆమె అనుకున్నది జరగలేదు. ఆమె నియోజకవర్గాన్ని తిరుపతి బాలాజీ జిల్లాలో కలపలేమని చెప్పారు అధికారులు. అయినప్పటికీ, శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అంటే ఆమెకు ఎంతో నమ్మకం ఉండటంతో తరచుగా తిరుమలకు వస్తుంటారు.


రోజాకు థ్యాంక్స్ చెప్పిన ‘జబర్దస్త్‘ కమెడియన్లు


తాజాగా ‘జబర్దస్త్‘ టీమ్ తో కలిసి రోజా శ్రీవారిని దర్శించుకోవడంతో తిరుమల పరిసరాల్లో సందడి నెలకొంది. నిత్యం టీవీలో చూసే కమెడియన్లు తిరుమలలో కనిపించడంతో భక్తులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. వారితో సెల్ఫీలు తీసుకున్నారు. అటు మంత్రి రోజా బర్త్ డే సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం పట్ల ‘జబర్దస్త్‘ కమెడియన్లు సంతోషం వ్యక్తం చేశారు. తమకు ఇంత చక్కటి దర్శనం చేయించిన రోజాకు ధన్యవాదాలు చెప్పారు.


Read Also: డ్రస్సు కారణంగా అనసూయ పాట్లు - కానీ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేయకుండా - పుష్ప 2 అప్‌డేట్ కూడా!