బిగ్ బాస్ సీజన్ 7లో ఈ వారమంతా ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీతోనే కంటెస్టెంట్స్ అంతా బిజీగా గడిపేశారు. టాస్కులు అన్నీ పూర్తయినా కూడా చివరి టాస్క్ దగ్గరకు వచ్చేసరికి ఎవరు విన్నర్ అని సంచాలకులుగా ఉన్న శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ డిసైడ్ అవ్వలేకపోయారు. వారి మధ్య డిస్కషన్ పూర్తి అవ్వకముందే నిన్నటి (నవంబర్ 16న) ఎపిసోడ్‌ ముగిసింది. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి అని ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తుండగా.. దీని గురించి శోభా, ప్రశాంత్ మధ్య జరిగిన గొడవతో పాటు కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలయ్యింది. 


శోభాపై శివాజీ ఆరోపణలు..
నిన్నటి ఎపిసోడ్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ మధ్య డిస్కషన్ ఎక్కడైతే ఆగిందో.. నేటి ఎపిసోడ్ మళ్లీ అక్కడి నుండే కొనసాగుతుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ముందుగా ‘‘నీ ప్రకారం ఎవరు విన్నర్ చెప్పు’’ అని శోభా.. ప్రశాంత్‌ను అడుగుతుంది. ‘‘నా ప్రకారం ముగ్గురు ఆడారు. ముగ్గురిలో శివన్న’’ అని ప్రశాంత్ చెప్తుండగానే.. ‘‘డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దు’’ అని శోభా తనను చెప్పనివ్వకుండా అడ్డుపడింది. ఇదే విషయం గురించి శివాజీ, యావర్ కూడా చర్చించడం మొదలుపెట్టారు. ‘‘ఆ అమ్మాయి ఎప్పుడు సంచాలకురాలిగా ఉన్నా అయితే అమర్.. లేదా ప్రియాంక. వాళ్లు బాల్ ముందుగా ఎవరిది కిందపడితే వాళ్లదే అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అదొక్కటే మాట వాళ్లది’’ అని శివాజీ ఆరోపించాడు.


శివాజీ మాటలకు శోభా కన్నీళ్లు..
ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో ఎవరు విన్నర్ అనే నిర్ణయాన్ని చెప్పమని శోభా, ప్రశాంత్‌లను అడిగాడు బిగ్ బాస్. బిగ్ బాస్ అడిగిన తర్వాత కూడా శోభా, ప్రశాంత్ మళ్లీ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఒకసారి రూల్స్ ప్రకారం చూద్దాం అని ప్రశాంత్ అనగా.. ఏమైనా అంటే ఆ రూల్స్ తీసి చూస్తున్నావు అంటూ ప్రశాంత్‌పై సీరియస్ అయ్యింది శోభా. ‘‘నియమాల ప్రకారం అన్నప్పుడు ఒకవేళ నేను కానీ, ప్రశాంత్ కానీ తప్పు నిర్ణయం తీసుకొని ఉంటే.. నేను శిక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను’’ అని శోభా అందరి ముందు స్టేట్‌మెంట్ ఇచ్చింది.


‘‘నువ్వు సంచాలకురాలిగా ఉన్న ప్రతీసారి గొడవలు, వాగ్వాదాలు జరిగాయి కాబట్టే నేను ఇప్పుడు నా అభిప్రాయాన్ని చెప్పాల్సి వచ్చింది. మూడుసార్లు నువ్వు సంచాలకురాలిగా ఉన్నందుకు నేను ఇబ్బందిపడ్డాను’’ అని వాదించాడు శివాజీ. ఆ తర్వాత టాస్కు గురించి అమర్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘మీరు కొన్ని చూడలేదు’’ అని అమర్ ఆరోపించగా.. శోభా దానికి ఒప్పుకోలేదు, సీరియస్ అయ్యింది. దీంతో అమర్ కూడా సీరియస్ అయ్యాడు. ‘‘మొదటి నుండి చూస్తున్నా అని అనగానే శోభా ట్రిగర్ అయిపోయింది’’ అని ప్రియాంకతో చెప్పాడు అమర్‌దీప్. శివాజీతో జరిగిన వాగ్వాదాన్ని గుర్తుచేసుకొని ఏడుపు మొదలుపెట్టింది శోభా. ‘‘ఎవరు ఏం చెప్పినా నోరు ఎత్తకూడదు. అలా ఉంటేనే అందరికీ నచ్చుతావు’’ అని తనకు తాను చెప్పుకుంటూ బాధపడింది. 



మరోసారి సంచాలకురాలిగా శోభా..
ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ గోల ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఐల్యాండ్స్‌పై నుండి నడుచుకుంటూ వెళ్లి.. అవతల వైపు ఉన్న ఇటుకలను ఇటువైపు కంటెస్టెంట్స్ పేరు మీద ఉన్న స్టాండ్స్‌పై పెట్టాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ తెలిపారు. ఈ పోటీలో ఒక్కొక్క లెవెల్ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ టాస్క్ నుండి తప్పుకుంటూ ఉంటారు. ముందుగా రతిక, ఆ తర్వాత గౌతమ్.. కెప్టెన్సీ రేసు నుండి తప్పుకున్నారు. ఈ టాస్కులో కూడా శోభా శెట్టిని సంచాలకురాలిగా పెట్టారు బిగ్ బాస్. ఇటుకల విషయంలో అమర్‌దీప్‌కు, ఇతర కంటెస్టెంట్స్‌కు గొడవ జరగగా.. ‘‘సంచాలకులను ఎందుకు పెట్టారు బిగ్ బాస్. మీకు మీరే వాదించుకుంటుంటే వాదించుకోండి. ప్రశాంత్, అమర్ ఆగండి’’ అంటూ వారి మీద సీరియస్ అయ్యింది. శోభా మాటలను పట్టించుకోకుండా ‘‘అన్నీ మీరే తీసుకెళ్లండి’’ అంటూ సీరియస్ అయ్యి అక్కడి నుండి వెళ్లిపోయాడు అమర్.



Also Read: ఫలించని శోభా ఎత్తులు - ఎవిక్షన్ ఫ్రీ పాస్ అతడికే, పాపం పల్లవి ప్రశాంత్!