గణపతితో విద్య పెళ్లి సంబంధం మాట్లాడటానికి ఇంటికి వచ్చిన ఆదినారాయణను అవమానించారని కూతురు గిరిజ, ఆమె భర్త అప్పారావును మందలిస్తుంది పార్వతి. దాంతో గిరిజ, అప్పారావు ఇంట్లో నుంచి వెళ్లాలని నిశ్చయించుకుంటారు. ఇంతలో ఆదినారాయణ తన కొడుకు మురళితో కలిసి గణపతి ఇంటికి వస్తాడు. వాకిట్లో అడుగు పెడుతూనే ఆ ఇంట్లో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని బాధపడతాడు. కానీ తన కూతురు ఇష్టపడిన గణపతితోనే ఆమె పెళ్లి జరగాలంటే ఇలాంటి అవమానాల్ని లెక్కచేయకూడదనుకుని ఇంట్లోకి వెళతాడు. వాళ్లని చూసిన పార్వతి, శ్రీశైలం, ఇందు ఆనందంతో పలకరించి కూర్చొమ్మని చెబుతారు. గిరిజ, అప్పారావు మాత్రం ఎంత అవమానించినా మళ్లీ వచ్చారంటే వాళ్ల అవసరం అలాంటిది అంటూ నిష్టూరంగా మాట్లాడతారు. తన కూతురు, అల్లుడు మాటల్ని పట్టించుకోవద్దని ఆదినారాయణను బతిమాలుతుంది పార్వతి.
విద్య గణపతి మాస్టారును ఇష్టపడటం వల్ల తానేం చేయలేకపోతున్నానని, అందుకే ఎన్నిసార్లు అవమానించినా మళ్లీ సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చానని aఆదినారాయణ చెప్తాడు. పాత విషయాలేవి మనసులో పెట్టుకోకుండా తన కూతురు విద్యను ఈ ఇంటి కోడలుగా పంపించడానికి అంగీకరిస్తున్నానని చెబుతాడు. విషయం విన్న గణపతి కుటుంబం ఆనందపడుతుంది. అక్కడనుంచి బయలుదేరిన ఆదినారాయణకు గుమ్మంలో సుబ్బు ఎదురు పడతాడు. ఆదినారాయణను నానామాటలు అని అవమానిస్తాడు సుబ్బు. ఆదినారాయణ తన కాళ్లు పట్టుకునేలా చేస్తానని చేసిన ఛాలెంజ్‌ని త్వరలోనే నిజం చేస్తానంటాడు. తన అన్నతో ఆదినారాయణ కూతురు పెళ్లికి ముందే తన కాళ్లు పట్టుకునేలా చేస్తానని మరోసారి ఛాలెంజ్ చేస్తాడు. కూతురు కోసం కోపం అణుచుకుంటాడు ఆదినారాయణ. సుబ్బు పైకి చెయ్యెత్తిన మురళిని వారిస్తాడు. ఇలాంటి వ్యక్తులున్న ఇంట్లో విద్య ఎలా సంతోషంగా ఉండగలదని వాపోతాడు మురళి.
గణపతితో పెళ్లి కుదిరిన ఆనందంలో ఉంటుంది విద్య. గణపతి, విద్య ఫోన్లో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. గణపతి స్కూల్లో పాఠాలు చెబుతుంటే చాటుగా చూడటం, పిల్లల్ని అతని గురించి అడిగి తెలుసుకోవడం తన కోరికని చెబుతుంది విద్య. అది విని షాకవుతాడు గణపతి. అలాంటి పనులు మాత్రం చేయకని కోరతాడు. విద్య ఆనందంగా ఉండటం చూసి కోపంతో రగిలిపోతుంది శ్రీనిధి. విద్య వల్లే తన జీవితం నాశనమవుతుందని, ఎలాగైన విద్య పెళ్లి ఆపాలని అనుకుంటుంది. గణపతి ఇంట్లో జరిగిన అవమానానికి బాధపడుతూ ఇంటికి చేరుకుంటాడు ఆదినారాయణ. గణపతి ఇంట్లో విద్య సంతోషంగా ఉంటుందనే నమ్మకం కలగడం లేదని వాపోతాడు. ఆ ఇంట్లో మనుషులంతా చాలా దారుణంగా మాట్లాడుతున్నారని కోపంతో ఊగిపోతాడు మురళి. పదే పదే తనకోసం తండ్రి అవమానాల పాలు కావడంతో బాధపడుతుంది విద్య. కానీ ఆ ఇంట్లో మనుషులను సరైన దార్లో పెట్టే బాధ్యత ఆ ఇంటి కోడలిగా తనదేనని తండ్రికి నచ్చజెబుతుంది.
Also Read: బెడిసికొట్టిన ప్లాన్- మాళవికని తీసుకెళ్లిపోయిన వసంత్, వేదనే వెళ్లగొట్టిందని అనుకున్న యష్
విద్య, గణపతి, పార్వతి కలిసి గుడికి వెళతారు. తమ కోరిక నెరవేరబోతున్నందుకు దేవుడికి దండం పెట్టుకుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటారు. అయితే గణపతి తనకి స్కూల్లో పనుందని వెళ్లిపోతాడు. అంతలోనే పద్మ విద్యకు ఫోన్ చేసి గణపతిని పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతుంది. అది విని పార్వతి, విద్య షాకవుతారు.