Kumari Aunty Campaigning In Andhra Pradesh Elections: కుమారీ ఆంటీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. హైదరాబాద్ లో పుడ్ సెంటర్ నిర్వహిస్తూ బాగా పాపులర్ అయ్యింది. స్టార్ హోటళ్లకు మించి వ్యాపారం చేస్తూ సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. ఒకానొక సమయంలో కుమారీ ఆంటీ ఫుడ్ సెంటర్ కారణంగా ట్రాఫిక్ కు ఇబ్బంది కలగుతుందనే కారణంగా పోలీసులు ఆమె వ్యాపారాన్ని క్లోజ్ చేయాలని ఆదేశించారు. ఈ విషయం నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరడంతో ఆయన జోక్యం చేసుకున్నారు. ఆమె ఫుడ్ సెంటర్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. స్వయం ఉపాధి పొందే వారికి కచ్చితంగా తమ ప్రభుత్వ మద్దతు ఉంటుందని వెల్లడించారు. మొత్తంగా ఫుడ్ సెంటర్ నిర్వహణతో కుమారీ ఆంటీ సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో కుమారీ ఆంటీ పలు టీవీ షోలతో పాటు సీరియల్స్ లోనూ కనిపిస్తోంది.
ఏపీలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
తాజాగా కుమారీ ఆంటీ ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షం అయ్యింది. మహా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు ఓటు వేయాలంటూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పలు వార్డుల్లో స్వచ్ఛందంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఓటర్లంతా కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తోంది.
“మహర్షి సినిమాలో మహేష్ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి వెనిగండ్ల రాము గారు. సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్ లో రాము గారు సేవ చేస్తున్నారు. నా స్వస్థలమైన పేద ఎరుకపాడులో ప్రజలందరి మంచి కోసం ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉంది. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో, అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉంది. వెనిగండ్ల రాము గెలిస్తేనే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను. నా స్వస్థలమైన గుడివాడ మీద మమకారంతో, గుడివాడలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో, రాము గారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నాను. గుడివాడలో ఉపాధి అవకాశాలు, లేకపోవడంతో నాలాంటి వారు ఎందరో పక్క రాష్ట్రాలు వెళ్లి కష్టపడాల్సి వస్తుంది. కొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడలేదు. చక్కటి విజన్ ఉన్న రాము గారు, కష్టపడే వారికి, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రాము గారి లాంటి నాయకులు అధికారంలో ఉంటేనే, మాలాంటివారికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా వెనిగండ్ల రాము గారిని, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వల్లభనేని బాలశౌరి గారిని గెలిపించి,ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలి” అని కుమారీ ఆంటీ విజ్ఞప్తి చేసింది.
గతంలో జగన్ ప్రభుత్వం తనకు ఇల్లు ఇచ్చిందని చెప్పిన కుమారీ ఆంటీ, ఇప్పుడు కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడం పట్ల వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
Also Read: గొప్ప మనసు చాటుకున్న జ్యోతిరాయ్ (జగతి మేడం) - పద్మ శ్రీ మొగిలయ్యకు ఆర్థిక సాయం