Krishna Mukunda Murari Today Episode ముకుంద కోసం పరుగులు తీసిన మురారి తన గదిలో కూర్చొని ఆలోచిస్తుంటాడు. ముకుంద చనిపోతే బతికున్న మనిషిలా కనిపించడం ఏంటని ఆలోచిస్తాడు. తాను అన్యాయం చేసినట్లు ముకుంద చూపు ఉందని.. నిజంగా ముకుంద విషయంలో తప్పు చేశానా అని మురారి అనుకుంటాడు. ఇంతలో కృష్ణ బట్టలు పట్టుకొని వస్తుంది.


కృష్ణ: ఏంటి ఏసీపీ సార్ ఏం ఆలోచిస్తున్నారు.
మురారి: నేను తప్పు చేశాను కృష్ణ. ముకుంద చనిపోవడానికి, ఆదర్శ్ ఇలా ఒంటరిగా మిగిలిపోవడానికి నేను కారణం కాదు కదా..
కృష్ణ: మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు. ఒకరి తలరాతకు మరొకరు ఎప్పుడూ కారణం కాదు. 
మురారి: పైకి కనిపిస్తున్న కారణాలు అన్నీ నేనే కారణం అని నన్నే వెలెత్తి చూపిస్తున్నాయి కదా. ఒకప్పుడు నేను ముకుంద మీద చూపించిన ప్రేమే ముకుందను నన్ను మర్చిపోలేకుండా చేసింది. ఆప్రేమే నన్ను వదులుకోలేక తనని తాను అంతం చేసుకునేలా చేసింది. 
కృష్ణ: తప్పు చేసిన వాళ్లు సాధారణంగా తప్పించుకుంటారు. అలాంటిది మీరు ఏం తప్పు చేయకపోయినా నిందని మీ నెత్తిన పులుముకోవాలి అని చూస్తున్నారు. ఏంటిది ఏసీసీసార్. ఆదర్శ్‌ ప్రేమ కోసం మీ ప్రేమను త్యాగం చేశారు అది మీ తప్పు ఎలా అవుతుంది.
మురారి: కదా.. పోనీ నేను ఏమైనా ముకుందకు ఆశలు పెంచేలా ప్రవర్తించానా అంటే అదీ లేదు. నిజం చెప్తున్నా నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ముకుంద ఆదర్శ్‌ భార్యగానే చూశాను అంతకు మించి నాకు ముకుంద మీద వేరే ఉద్దేశమే లేదు నమ్ముతావా కృష్ణ. 
కృష్ణ: అదేం మాట ఏసీపీ సార్ మీ మీద నమ్మకం లేకపోవడం అంటే నా మీద నాకు నమ్మకం లేకపోవడమే. ముకుంద మీద మీకు ప్రేమ లేదు. ముకుందతో మీరు వెళ్లిపోతారు అనే భయం కూడా నాకు లేదు. మీరు కేవలం వాళ్లు కలిసి ఉండాలి అనే ఉద్దేశంతోనే వాళ్లు కలిసి ఉండాలని ఈ ప్రయత్నం చేశారు. అంతేకాని ఇందులో మన తప్పు ఏం లేదు. ఎవరైనా మనం తప్పు చేశాం అంటే మన తలరాత అనుకోవాలి కానీ తప్పు చేశాం అని బాధ పడకూడదు. 
 
నందు: కృష్ణ తప్పు ఏం లేదు అని ఆదర్శ్‌ అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్పాలి పిన్ని. లేదంటే ఈ ద్వేషం పంతంగా మారి ఇంకో ప్రమాదానికి దారి తీస్తుంది. ఇక మధు అక్కడికి వస్తే ఆదర్శ్ కృష్ణని అన్న మాటల్ని చెప్తుంది. 
మధు: పిచ్చా వాడికి ఏమైనా ఇందులో కృష్ణ చేసిన తప్పు ఏంటి. ముకుంద అడ్డే తొలగించుకోవాలి అనుకుంటే దానికి కష్టపడి ఆదర్శ్‌ని అంత దూరం నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటి. ముకుంద ఎప్పుడు ప్రేమిస్తే ఏంటి ఇప్పుడు మురారి తన భర్త తన భర్తను కన్నెత్తి చూసినందుకు కృష్ణనే ముకుందను ఇంటి నుంచి బయటకు పంపించేయొచ్చు. లేదంటే తనే మురారిని ఇంట్లో నుంచి తీసుకొని బయటకు వెళ్లిపోవచ్చు. ఇన్ని పాట్లు పడాల్సిన అవసరం ఏముంది. 
సుమలత: అదే వాడు అర్థం చేసుకోవడం లేదురా.. ఏం చేయాలి. చిన్న పిల్లాడి కంటే అధ్వానంగా తయారయ్యాడు. 
మధు: అయితే వాడికి నాలుగు తగిలించాల్సేందే.. లేకపోతే ఏంటి తన కోసం కృష్ణ అంతలా ఆలోచిస్తే తన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఏదో భార్య పోయిన బాధలో ఉన్నాడని ఆలోచిస్తూ ఉంటే ఎక్కువ చేస్తున్నాడు. అసలు తప్పంతా ఆదర్శదే. ముకుందకు ఆదర్శ్ అంటే ఇష్టం లేదు అని అప్పుడప్పుడు చూసే నాకే అర్థమైంది. ఎప్పుడూ చూసే ఆదర్శ్‌కి ఆమాత్రం అర్థం కాలేదా.. శోభనం గదిలో నువ్వేంటే నాకు ఇష్టం లేదు ఆదర్శ్‌ అని చెప్పించుకునే వరకు ఎందుకు తెచ్చుకున్నాడు.
నందు: ఆదర్శ్‌కి అనుమానం రాకుండా నటించుంటుంది అందుకే తెలుసుకోలేకపోయాడు. 
మధు: మరి కృష్ణ దగ్గర కూడా అలాగే నటించొచ్చు కదా. ముకుంద మారింది అని కృష్ణ నమ్మొచ్చు కదా అది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. అంతా కృష్ణ స్వార్థం కోసమే చేసింది అంటే ఎలా ఇవన్నీ కాదు నేను వెళ్లి చెప్పాల్సిన విధంగా చెప్తాను.
రేవతి: అరే ఆగరా అసలే వాడు ఆవేశంలో ఉన్నాడు. నాలుగు రోజులు ఆగితే ఆవేశం తగ్గుతుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. 


మరోవైపు కృష్ణకు పరిమళ ఫోన్ చేస్తుంది. మురారి చూసి కృష్ణకు చెప్తాడు. హాస్పిటల్‌కి ఎప్పుడు వస్తావని అడగటానికి ఫోన్ చేసుంటుంది అని అంటాడు. దీంతో కృష్ణ ఫోన్ తీసుకొని కట్ చేసేస్తుంది. ఇక పరిమళకు కృష్ణ కాల్ చేస్తుంది. తన ఫ్రెండ్ హాస్పిటల్ ఓపెనింగ్‌కు రిబ్బన్ కటింగ్‌కు రమ్మని చెప్తుంది. దీంతో మురారి రేపు కృష్ణని నేను తీసుకొని వస్తాను అని అంటాడు. 


మధు రాత్రి ఆరుబయట కూర్చొని మందు తాగుతుంటాడు. ముకుంద ఎంత పని చేశావు. నువ్వు చనిపోవడం వల్ల ఏం సాధించావు. కృష్ణ మురారిలను వీడదీయగలిగావా అని అనుకుంటాడు. అదృష్టం బాగుండి చనిపోయావు.. అదే నాముందు ఉంటేనే అని అనుకుంటాడు. అప్పుడు మధు పక్కన మరో గ్లాస్ పెడితే మధు అది ఆదర్శ్‌ అనుకొని ఏదేదో మాట్లాడుతాడు. ముందు పోస్తాడు. ఇక గ్లాస్ తీసుకొని ఆదర్శ్‌కి ఇవ్వాలి అని చూస్తే అక్కడ ముకుంద కనిపిస్తుంది. దీంతో మధు బిత్తరపోతాడు. ముకుంద ఆత్మ వచ్చింది అనుకొని గజగజ వణికిపోతాడు. 


ముకుంద: ఏంటి మధు నన్ను తిట్టుకుంటున్నావు. నేను ఆత్మ హత్య చేసుకోవడానికి ఆ కృష్ణ కదా కారణం మరి నన్ను తిడతావెందుకు. ఇది ఏమైనా న్యాయంగా ఉందా..
మధు: అయ్యో.. దెయ్యం.. అని పరుగులు తీస్తాడు. ముకుంద దెయ్యంగా వచ్చింది పెద్దమ్మ.. దెయ్యం.. దెయ్యం.. 


ఇక మురారి ఆరుబయట కాల్ మాట్లాడుతూ ఉంటే.. ముకుంద చాటుగా మురారి అని పిలుస్తుంది. మురారి ముకుంద అని చుట్టూ చూస్తాడు. ఇక ముకుందా చాటుగా ఉండి అక్కడ కాదు మురారి ఇక్కడ దగ్గరకు రా అంటూ మురారిని పరుగులు పెట్టిస్తుంది. ఎందుకు ఇలా సాధిస్తున్నావ్ అని మురారి అరుస్తాడు. ముకుంద మాత్రం కృష్ణతో కలిసి హాస్పిటల్ ఓపినింగ్‌కు వెళ్లొద్దని మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని బెదిరిస్తుంది. కృష్ణ మీద పగతో మీ చుట్టే తిరుగుతూ చెప్పింది చేస్తాను అని నువ్వు కృష్ణకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అని అంటుంది.  


మరోవైపు మధు ఇంట్లో గజగజ వణికిపోతూ అందర్ని వణికిస్తాడు. దెయ్యం ఉందని.. ముకుంద దెయ్యం అయిందని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. మురారి కూడా అక్కడికి వస్తాడు. మధు జరిగింది అంతా చెప్తాడు. అయితే తాను కూడా ముకుంద మాటలు విన్నాను అని చెప్తే అందరూ కంగారు పడతారు అని మురారి చెప్పడు. పైకి మాత్రం ఏం కాదు అని మధుకి చెప్తాడు.  


మరోవైపు ఆదర్శ్ బయటకు వెళ్లడం రేవతి చూసి అడుగుతుంది. ఫ్రెండ్ పార్టీకి వెళ్తాను అని అంటాడు. తన ఇష్టం వచ్చినట్లు ఉండే అర్హత లేదా అని అరుస్తాడు. మీ అందరితో కలిసి ఈ ఇంట్లో ఉంటుంటే నరకంగా ఉందని అంటాడు. ఇక మురారి వచ్చి ఆదర్శ్‌ కాలర్ పట్టుకుంటాడు. 


మురారి: ఆదర్శ్‌ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు పెద్ద వాళ్లతో మాట్లాడే పద్ధతేనా ఇది. 
ఆదర్శ్‌: అవునురా నేను ఇంతే నాకు పద్ధతులు తెలీవు. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకొకటి మాట్లాడటం నాకు చేతకాదు. ఏదైనా ముఖం మీద చెప్పడం అలవాటు.
మురారి: ఏంట్రా అలవాటు. ఎప్పటి నుంచి.. ముందు ఇలానే ఉండేవాడివా.. అయినా ఇప్పుడు అమ్మ ఏమంది. ఈ టైంలో బయటకు వెళ్లడం ఎందుకు భోజనం చేసి నిద్రపో అంది అదికూడా తప్పేనా.. నువ్వు చెప్పే పద్ధతే తప్పు. 
రేవతి: మురారి వదిలేయ్ నాన్న ఏదో చిరాకులో ఒక మాట అనేశాడు ఇప్పుడు ఏమైంది చెప్పు.
మురారి: ఎవరి మీద చిరాకు ఎందుకు చిరాకు. జరిగిన దాని గురించి ఇక్కడ అందరూ బాధ పడుతున్నాం కానీ రెస్పాండ్ అయ్యే పద్ధతి ఒకటి ఉంటుంది కదా.
ఆదర్శ్‌: ఉంటుందిరా. కానీ బలి కోరే వాడి రెస్పాన్స్.. బలి అయ్యేవాడి రెస్పాన్స్ ఒకేలా ఉండవు. ఎవడి బాధ వాడిది. అయినా నువ్వేం నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉందిగా నీ మాయలాడి పెళ్లాం తనకి ఇచ్చుకో నీ సలహాలు..
మురారి: ఆదర్శ్‌ మర్యాదగా మాట్లాడు.. 
ఆదర్శ్‌: అవున్రా తను మాయలాడే. ఏంటిప్పుడు. రేయ్ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే నీ పెళ్లాం లాంటి వాళ్లని మాయలాడినే అంటారురా..


ఇద్దరూ ఒకర్ని ఒకరు కొట్టుకుంటారు. అందరూ విడిపించాలి అని ప్రయత్నించినా వదులుకోరు. దూరం నుంచి ముకుంద అది చూస్తుంది. షాక్ అవుతుంది. ఇక మురారి ముకుందని చూసి ఆగిపోతాడు. తర్వాత చూస్తే ముకుంద అక్కడ ఉండదు. ఇక ఆదర్శ్‌ బయటకు వెళ్లిపోతాడు. ఇక ముకుంద కృష్ణ, మురారిలు దగ్గర కాకుండా చూసుకోవాలి అని అనుకుంటుంది. ఇక మురారి అదంతా తన భ్రమ అని సర్దిచెప్పుకుంటాడు. ఒకవేళ ముకుంద దెయ్యం అయినా సరే ఏం చేయలేదు అని రేపు కృష్ణని హాస్పిటల్ ఓపినింగ్‌కు తీసుకెళ్తాను అని పదిరెట్లు ప్రేమ చూపిస్తాను అని ముకుంద ఏం చేస్తుందో చూస్తాను అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  ఆ సమయంలో చాలా బలహీనంగా ఉన్నాను, నా గురించి నేను గర్వపడుతున్నాను - సమంత