Samantha Ruth Prabhu about Citadel Web Series: దాదాపు పదేళ్లకు పైగా సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా వెలిగిపోతోంది సమంత. మంచి కథలను ఎంచుకుంటూ, తన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ స్టార్‌గా ఎదిగింది. అలాంటి సామ్.. ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. మయాసైటీస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల సామ్.. సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం తన చేతిలో ఒక హాలీవుడ్ చిత్రంతో పాటు హిందీ వెబ్ సిరీస్ కూడా ఉంది. తనను వెబ్ సిరీస్ ప్రపంచానికి పరిచయం చేసిన రాజ్, డీకేలతో కలిసి సమంత చేస్తున్న సిరీసే ‘సిటాడెల్’. తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న సమంత.. ఈ వెబ్ సిరీస్‌పై అప్డేట్ ఇచ్చింది.


చాలా గర్వపడుతున్నాను..


‘సిటాడెల్’ అనేది ఒక అమెరికన్ వెబ్ సిరీస్. ఇప్పటికే అందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇక ఈ సిరీస్‌కు ఇప్పుడు ఇండియన్ వర్షన్ రెడీ అవుతోంది. అందులో వరుణ్ ధావన్, సమంత హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా ‘సిటాడెల్’లో నటించడంపై తన అనుభవాలను గుర్తుచేసుకుంది సామ్. ‘‘నా జీవితంలోనే కష్టమైన రోల్ అది. ఎందుకంటే నేను శారీరికంగా చాలా బలహీనంగా ఉన్న సమయంలో అది చేశాను. నా దృష్టిలో సిటాడెల్ ఇప్పటికే సక్సెస్ ఎందుకంటే చాలా దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు నేను దానికోసం షూటింగ్ చేశాను. మళ్లీ అలా చేయగలుగుతానా లేదా కూడా నాకు తెలియదు. అప్పుడు కూడా చేస్తానని అనుకోలేదు. ఆ విషయంలో నా గురించి నేను చాలా గర్వపడుతున్నాను’’ అని తెలిపింది.


అదే సమయంలో షూటింగ్..


రాజ్, డీకేలు దర్శకత్వం వహిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలోనే దీనిని అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమాల నుండి సంవత్సరం పాటు బ్రేక్ తీసుకొని మయాసైటీస్ కోసం చికిత్స తీసుకోవాలని సమంత నిర్ణయించుకున్న సమయంలోనే.. ముందుగా ఉన్న కమిట్‌మెంట్ వల్ల ‘సిటాడెల్’ షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. అందుకే ఆ సమయంలో తను చాలా బలహీనంగా ఉన్నానని చెప్పుకొచ్చింది సామ్. ఇక ‘సిటాడెల్’ తర్వాత సమంతను మళ్లీ ఎప్పుడు చూస్తారో ప్రేక్షకులకు క్లారిటీ లేదు. తన హాలీవుడ్ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదు.


‘ఫ్యామిలీ మ్యాన్’తో రూటు మార్చింది..


అప్పటివరకు సినిమాలతోనే బిజీగా ఉంటూ.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సమంతను వెబ్ సిరీస్ ప్రపంచానికి పరిచయం చేశారు రాజ్, డీకే. అప్పటివరకు ఎక్కువగా పక్కింటమ్మాయి పాత్రలు పోషిస్తూ తన నటనను ప్రూవ్ చేసుకున్న సామ్.. ఒక్కసారిగా‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లో విలన్‌గా కనిపించింది. అందులో డీ గ్లామర్ పాత్రలో కనిపించడంతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న రాజీగా నటించింది. దీంతో సమంతను అలా చూసి ఒక్కసారిగా ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. అందుకే తన కెరీర్‌లో అలాంటి సక్సెస్ ఇచ్చిన రాజ్, డీకేలతోనే మరోసారి చేతులు కలిపి ‘సిటాడెల్’ చేసింది. అయితే ఈ సిరీస్‌లో సమంత భారీ యాక్షన్ సీన్స్‌లో కూడా కనిపించనుందని, వరుణ్ ధావన్‌కు, తనకు మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం.


Also Read: నా 53 ఏళ్ల కెరీర్‌లో అలాంటిది జరగలేదు - సందీప్ వంగాపై జావేద్ అఖ్తర్ ఫైర్