Javed Akhtar Counters to Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడు నెలలు అయిపోయింది. ఈ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా ఈ సినిమాను చాలామంది ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పటికీ దీనిపై వస్తున్న కాంట్రవర్సీలకు బ్రేక్ పడడం లేదు. బాలీవుడ్‌లోని పలువురు బడా స్టార్లు ఇప్పటికీ ‘యానిమల్’ గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు. అందులో జావేద్ అఖ్తర్ కూడా ఒకరు. ఇప్పటికే ఒక ఈవెంట్‌లో ‘యానిమల్’పై విమర్శలు చేసిన జావేద్.. మరోసారి ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగాపై ఫైర్ అయ్యారు.


జావేద్ అఖ్తర్ కౌంటర్..


కొన్నాళ్ల క్రితం ఒక ఈవెంట్‌లో ‘యానిమల్’పై ఓపెన్‌గా విమర్శలు కురిపించారు జావేద్ అఖ్తర్. దానిపై సందీప్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. జావేద్ అఖ్తర్ కుమారుడు ఫర్హాన్ అఖ్తర్.. ‘మిర్జాపూర్’ లాంటి సిరీస్ తెరకెక్కిస్తే తప్పు లేదా అని కౌంటర్ ఇచ్చాడు. దీనిపై జావేద్ తాజాగా స్పందించారు. ‘‘ఆయన నా వ్యాఖ్యలకు స్పందించడం గౌరవంగా భావిస్తున్నాను. నా 53 ఏళ్ల కెరీర్‌లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాట కూడా అసభ్యకరంగా ఉండడం తను చూడలేదు. అందుకే తను నా కొడుకు ఆఫీస్‌ వరకు వెళ్లిపోయి, అక్కడ ఒక టీవీ సీరియల్‌‌లో ఉన్న తప్పులను కనిపెట్టాడు. కానీ దానిని ఫర్హాన్ డైరెక్ట్ చేయలేదు, అందులో యాక్ట్ కూడా చేయలేదు. తన కంపెనీ.. దానిని నిర్మించింది’’ అంటూ సందీప్ మాటలకు రీ కౌంటర్ ఇచ్చారు జావేద్ అఖ్తర్.


తనకు ఆ హక్కు ఉంది..


అంతే కాకుండా ఈ ఇంటర్వ్యూలో ఫిల్మ్ మేకర్స్‌కు ఏదైనా తెరకెక్కించే స్వేచ్ఛ ఉంటుందని గుర్తుచేశారు జావేద్ అఖ్తర్. ‘‘నేను ఫిల్మ్ మేకర్‌ను అస్సలు విమర్శించడం లేదు. ఒక ప్రజాస్వామ్య సమాజంలో తను ఒక్క యానిమల్ మాత్రమే కాదు.. ఎన్నో యానిమల్స్ తెరకెక్కించవచ్చు. నా బాధ అంతా ఫిల్మ్ మేకర్స్ గురించి కాదు.. ఆడియన్స్ గురించే. తనకు ఏ సినిమా అయినా తెరకెక్కించే హక్కు ఉంది కానీ దానిని హిట్ చేయాలా వద్దా, ప్రోత్సహించాలా వద్దా అనే నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది’’ అంటూ ‘యానిమల్’ను ప్రోత్సహించడం ప్రేక్షకుల తప్పు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు జావేద్ అఖ్తర్. 


బాధపెట్టింది..


‘‘తను మిర్జాపూర్ గురించి మాట్లాడడం నన్ను బాధకు గురిచేసింది. 53 ఏళ్ల నా కెరీర్‌లో నువ్వు ఒక్కటి కూడా బయటికి తీయలేకపోయావు’’ అంటూ సందీప్ రెడ్డి వంగాను సూటిగా ప్రశ్నించారు జావేద్ అఖ్తర్. ముందుగా ఒక ఈవెంట్‌లో ఫిల్మ్ మేకర్స్ ఎలాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారో ఒకసారి ఆలోచించాలని, మూవీలో హీరో.. హీరోయిన్‌ను షూ నాకమని చెప్పడం, అమ్మాయిని కొట్టడం లాంటివి చేసినా కూడా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడం మంచిది కాదని ‘యానిమల్’పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు జావేద్. దానికి కౌంటర్‌గా ముందుగా తన కుమారుడు నిర్మించిన ‘మిర్జాపూర్’ సిరీస్‌ను చూడమని, దేశంలో ఉండాల్సిన బూతులు అన్నీ అందులోనే ఉన్నాయని వ్యాఖ్యలు చేశాడు సందీప్.


Also Read: రియల్‌ లైఫ్‌లోనైనా, రీల్‌ లైఫ్‌లోనైనా వేరొకరి బిడ్డను అనాథగా విడిచిపెట్టలేను - హీరో విశాల్‌