మురారీ ముకుంద గురించి ఆలోచిస్తూ ఉండటం చూసి రేవతి వచ్చి పలకరిస్తుంది. కానీ మురారీ డల్ గా వెళ్ళిపోయేసరికి కృష్ణతో ఏమైనా గొడవ జరిగిందా అని అనుమానపడుతుంది. ముకుంద మురారీతో కలిసి ఉన్న ఫోటో పట్టుకుని చూస్తూ మాట్లాడుకుంటుంది.


ముకుంద: నిన్ను బ్లాక్ మెయిల్ చేశానని అనుకోకు. నీ ప్రేమ పొందటం కోసం నాకు ఇంతకన్నా ఏం చేయాలో అర్థం కాలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఎప్పుడో ఒకసారి మనం తప్పకుండా కలుస్తామనే ఆశ నాలో చావలేదు. రోజూ నీకోసం ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నాకు నువ్వు ఎక్కడ దూరం అవుతావో అనే ఆలోచన నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నువ్వు నా ప్రాణం అందుకే నువ్వు లేకుండా జీవితాంతం చస్తూ బతికే కంటే నా ప్రేమతో నిన్ను మార్చుకోగలను అనిపించింది. నా ప్రేమని అర్థం చేసుకో అపార్థం చేసుకుని దూరం చేసుకోకు అనుకుంటుండగా అలేఖ్య వచ్చి మురారీతో మాట్లాడవా అంటుంది. మాట్లాడానని చెప్తుంది.


అలేఖ్య: అంటే ఆదర్శ్ ఇక తిరిగి రాడా?


ముకుంద: ఈ ఇంటికి వస్తాడేమో కానీ నా జీవితంలోకి తిరిగి రాడు. ఇక కృష్ణ మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది


Also Read: కావ్యని కొట్టాలనుకోవడం తప్పేనన్న రాజ్- కుటుంబం నుంచి తనని తాను వెలివేసుకున్న అపర్ణ


అలేఖ్య: ఎందుకో ఇది వర్కౌట్ అవదని అనిపిస్తుంది. ప్రేమలో ఓడిపోవడం కొత్త కాదు. కానీ భార్యాభర్తలు విడిపోవడం అంత ఈజీ కాదు. కుటుంబం పరువు కోసం అత్తయ్య ఎంత కఠినంగా ఉంటారో నందిని విషయంలో చూశాం. గతంలో జరిగిన ప్రేమ కోసం నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావ్ అనిపిస్తుంది. ఆదర్శ్ ని నువ్వు భర్తగా ఎలా యాక్సెప్ట్ చేయడం లేదో అలాగే మురారీ నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఏం చేస్తావ్. ప్రేమని పొందాలనే పోరాటంలో నువ్వు జీవితాన్ని కోల్పోతున్నావ్ ఆలోచించుకో. ఇక నీ ఇష్టం అనేసి వెళ్ళిపోతుంది. ముకుంద మాత్రం తన మాటలు పట్టించుకోదు.


కృష్ణ గదిలో కూర్చుని మురారీతో ముకుంద మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య నాకేం చెప్పింది.. ఇక్కడ ఏం జరుగుతుంది. ఒట్టేసి మరి చెప్పింది వాడికి నువ్వంటే ప్రాణమని. కానీ ఇక్కడ వీళ్ళు ఒకరినొకరు హగ్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి ఈ ఇంట్లో ఏసీపీ సర్ మనసులో అసలు నా స్థానం ఏంటి? ఎవరిని నమ్మాలి. ఎవరిని నిలదీయాలి? ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు. ఇన్నాళ్ళూ వెతుకుతున్న ప్రశ్న ఆ డైరీ అమ్మాయి ఎవరని? ముకుంద రూపంలో నిజం బయట పడిందని మౌనంగా వెళ్లిపోవాలా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రేవతి వస్తుంది. గది మొత్తం చిందరవందరగా ఉండటం చూసి ఏమైందని అడుగుతుంది. కృష్ణని మాటల్లో పెట్టి నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. చివరికి అత్తయ్య కూడా మోసం చేసిందని కృష్ణ మనసులో బాధపడుతుంది.


కృష్ణ గదిలోకి రాగానే మురారీ మౌనంగా ఉంటాడు. మీరు తప్పు చేశారు మీ తప్పు సరిదిద్దుకొండి అప్పటి వరకు మిమ్మల్ని క్షమించనని కృష్ణ మనసులో అనుకుంటుంది. కింద దుప్పటి వేసుకుని పడుకోబోతుంటే బెడ్ మీద పడుకోవచ్చు కదా అంటాడు. కానీ కృష్ణ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లావో కూడా చెప్పవా? నాతో మాట్లాడవా అని అడుగుతూ ఉంటాడు. కృష్ణ ఏడుస్తూ కన్నీళ్ళు దిగమింగుకుంటుంది. మురారీ వైపు కూడా చూడకుండా నిద్రవస్తుందని అబద్ధం చెప్తుంది.


మురారీ: నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను నా మొహం కూడా చూడకుండా మాట్లాడుతున్నావ్


కృష్ణ: చేతులు జోడించి కోపంగా నేను బాగా అలిసిపోయాను. నాకు నిద్ర వస్తుంది. మీ రూమ్ లో పడుకోవడం ఇబ్బంది అంటే చెప్పండి నేను వెళ్ళి బయట పడుకుంటాను అనేసరికి మురారీ సైలెంట్ గా ఉండిపోతాడు. పొద్దున్నే మురారీ నిద్రలేచేసరికి ముకుంద కాఫీ పట్టుకుని ఎదురుగా నిలబడుతుంది. తనని చూసి కంగారుగా గదిలోకి ఎందుకు వచ్చావ్ కృష్ణ ఎక్కడని అంటాడు.


Also Read: పనిమనిషిగా మారిన రాజ్యలక్ష్మి- దివ్యకి దూరమవుతోన్న విక్రమ్!


ముకుంద: ఎక్కడికో కంగారుగా వెళ్ళిపోయింది తనని చూస్తే మళ్ళీ తిరిగి వచ్చేలా అనిపించలేదు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్లిపోతారు. నువ్వు కాఫీ తాగు


మురారీ: ఎవరైనా ఇలా చూస్తే దరిద్రంగా ఉంటుంది


ముకుంద: ఎప్పటికైనా మన విషయం తెలియాల్సిందే కదా ఎందుకు కంగారు. నువ్వు ఈ కాఫీ తాగితే వెళ్తాను


తరువాయి భాగంలో..


త్యాగం పేరుతో మీ కుటుంబం బాగుండాలని నాకు నచ్చని పెళ్లి చేసుకోమనీ చెప్పడం అన్యాయం కాదా అని ముకుంద రేవతిని నిలదీస్తుంది. కృష్ణ దగ్గరకి మురారీ వస్తాడు. ఎందుకు అలా ఉన్నావని అడుగుతాడు. యుద్దం అయిపోగానే చాలా మంది లీవ్స్ మీద ఇంటికి వచ్చేశారు మరి ఆదర్శ్ ఇంటికి ఎందుకు రాలేదని కృష్ణ మురారీని ప్రశ్నిస్తుంది.