Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అమ్మిరాజుని అంబిక తప్పిస్తుంది. అంబిక కారుని విహారి, లక్ష్మీ వాళ్లు ఫాలో అవుతారు. అమ్మిరాజు అంబికతో ఎవరు నువ్వు అని అడిగితే నేను అంబికను.. నువ్వు చేసే వెధవ పని గురించి మీ నాన్న నాకు చెప్పాడు అని అంటుంది. నేను కావేరిని కలవాలి అని అమ్మిరాజు అంటే వెనకొస్తున్నా కార్లని చూడరా.. కొంచెం ఉంటే దొరికిపోయే వాడిని.. మన ప్లాన్ పోయేది అని అంటుంది.
అంబిక, విహారి, లక్ష్మీ వాళ్లకి దొరక్కుండా డ్రైవింగ్ చేస్తుంది. ఇద్దరి నుంచి తప్పించుకుంటుంది. విహారి, కావేరి, లక్ష్మీ, సంధ్యలు కలుసుకుంటారు. చెప్పకుండా వెళ్లిపోవడమేనా లక్ష్మీ నేను నిన్ను కాపాడలేను అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఇదంతా చేసింది అమ్మిరాజు అని అనుకుంటారు. అమ్మిరాజుని అంబిక ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక నుంచి జాగ్రత్తగా ఉండకపోతే చంపేస్తా అని చెప్పి మళ్లీ ప్లాన్ మార్చమని అంటుంది. అమ్మిరాజు ఇంటికి వెళ్లగానే వీర్రాజు ఊరు వెళ్లిపోదాం అని చెప్పి బ్యాగ్ సర్దమని పానకాలుకి చెప్తాడు. ముగ్గురు ఇళ్లు దాటే టైంకి గుమ్మం ముందు లక్ష్మీ, విహారి, కావేరి, సంధ్య ఉంటారు.
వీర్రాజు, అమ్మిరాజు బిత్తరపోతారు. లక్ష్మీ, విహారి, సంధ్య ముగ్గుర్ని చితక్కొడతారు. ఫోన్ తీసుకొని వీడియో డిలీట్ చేస్తారు. తర్వాత కావేరితో అమ్మిరాజుని కొట్టిస్తారు. అమ్మిరాజు పెద్దగా నవ్వుతాడు.. దాంతో విహారి అమ్మిరాజుని వెతికి జేబులో ఉన్న పెన్‌డ్రైవ్ తీసుకుంటాడు. ఇది ఉందనే ఇలా నవ్వుతున్నాడని చెప్పి దాన్ని విరిచేస్తాడు. లక్ష్మీ ఫోన్ కింద విసిరి కొడుతుంది. లక్ష్మీ సంధ్యతో వీడు ఈ జన్మలో బయటకు రాకుండా శిక్ష పడేలా చేయండి అంటుంది. సంధ్య తన పోలీసుల్ని పిలిచి ముగ్గురినీ తీసుకెళ్లమని అంటుంది.
విహారి లక్ష్మీని ఇంటికి పిలిస్తే లక్ష్మీ ఇంటికి రాను అని అంటుంది. మన మధ్య పొరపాటున ఏర్పడిన బంధమే కానీ మీకు నాకు ఏం సంబంధం లేదు అని అంటుంది. నీ మనసు చంపుకొని మాట్లాడుతున్నావ్.. నీ గుండెల్లో ప్రేమ చంపుకొని మాట్లాడుతున్నావ్ అని అంటాడు. మీకు సహస్రమ్మకి మధ్య నేను ఉండటం మంచిది కాదు.. ఆమె గర్భవతి నేను ఉండటం వల్ల మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు.. అందుకే నేను అక్కడ ఉండటం మంచిది కాదు అని అంటుంది. నేను దూరంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావా.. నువ్వు మీ ఊరు వెళ్లే నేను అడ్డు చెప్పను.. నువ్వు వెళ్తే మీ అమ్మానాన్న దగ్గరకి వెళ్లాలి.. లేదంటే ఇప్పటికి నేనే నీకు భర్తని కదా నా దగ్గరే ఉండాలి.. అలా కాదు అంటే నీ భర్తగా నేను చచ్చానని లెక్క అంటాడు. అలా అనొద్దు విహారి గారు అని లక్ష్మీ అంటుంది. మనం ఇద్దరం విడిపోతే ఇద్దరికీ జీవితం లేనట్లే.. మన కథ ముగింపు ఎలా ఉన్నా ఇద్దరం కలిసే బతుకుదాం అని అంటాడు. లక్ష్మీని తీసుకొని ఇంటికి వెళ్తాడు.
సహస్ర, పద్మాక్షిలు లక్ష్మీ ఎక్కడికి వెళ్లిపోయిందా అని చాలా టెన్షన్ పడతారు. లక్ష్మీకి సరోగసీ చేశారు ఏం అవుతుందో ఏంటో అని టెన్షన్‌గా ఉందని సహస్ర అంటుంది. ఇంతలో లక్ష్మీని తీసుకొని విహారి వస్తాడు. లక్ష్మీని చూసి పద్మాక్షి, సహస్ర చాలా సంతోషపడతారు. అందరినీ పద్మాక్షి పిలుస్తుంది. యమున కోపంగా లక్ష్మీని కొడుతుంది. పద్మాక్షి షాక్ అయి ఏంటి వదినా అలా కొట్టావు లక్ష్మీని అని అడుగుతుంది. చెప్పకుండా అలా వెళ్లిపోతే అందరం ఎంత కంగారు పడతామో తెలీదా అని అడుగుతుంది. లక్ష్మీ సారీ చెప్తుంది. లక్ష్మీ వెళ్లడానికి కారణం ఉందని విహారి అంటాడు. కావేరి తన వల్లే లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిందని చెప్తుంది. విషయం మొత్తం తెలిసి అందరూ నోరెళ్లబెడతారు. కావేరి ఏడిస్తే లక్ష్మీ కావేరిని ఓదార్చుతుంది. విహారి కావేరితో ఇలా ఎవరైనా చేస్తే ప్రాణం తీసేయాలి.. సమాజం నీ వైపే ఉంటుంది అని అంటాడు.