జానకీరామచంద్రను ఎలాగైనా హైదరాబాద్ పోటీలకు వెళ్లకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది మల్లిక. అత్తమామ వేసుకొనే ట్యాబ్లెట్లను మార్చేస్తుంది. ఈ ట్యాబ్లెట్లు వేసుకొని కళ్లు తిరిగి పడిపోతుందని... జానకీ రామచంద్ర ట్రిప్ క్యాన్సిల్ అవుతుందని అనుకోని సంబరపడుతుంది. అనుకున్నట్టుగానే జ్ఞానాంభ వచ్చి ట్యాబ్లెట్లు వేసుకుంటుంది. ఇదంతా చూస్తూ ఆనందతాండవం చేస్తుంది మల్లిక. 


జానకీ రామచంద్రను ఇద్దరూ హైదరాబాద్ బయల్దేరతారు. వాళ్లను గోవిందరాజు ధైర్యవచనాలు చెబుతూ పంపిస్తుంటాడు. జ్ఞానాంభను పిలుస్తాడు గోవిందరాజు. అబ్బాయి వాళ్లు ఊరెళుతున్నారని పంపించాలని చెప్తాడు. చికితను పిలిచి టిఫిన్ బాక్స్‌లు అందిస్తుంది. ఆ హోటల్ తిండి తినొద్దని ఆకలేస్తే ఈ పులిహోరా తినమంటుంది జ్ఞానాంభ. వెళ్లొస్తామని చెప్పి ఇద్దరూ జ్ఞానాంభ కాళ్లకు దండం పెడతారు. వాళ్లను దీవిస్తూనే... కళ్లు తిరిగి పడిపోతుంది జ్ఞానాంభ. మల్లిక తన నటన ప్రదర్శిస్తూ గదిలోకి తీసుకెళ్తామని సలహా ఇస్తుంది. 


జ్ఞానాంభ అలా పడిపోవడంతో అంతా కంగారు పడతారు. ఏం జరిగిందని ఆరా తీస్తారు. ఎప్పటిలాగానే బలం ట్యాబ్లెట్స్‌ తీసుకున్నానని.. అప్పటి నుంచే ఇలా అవుతుందని అంటుంది జ్ఞానాంభ. జానకి తమ ఫ్యామిలీ డాక్టర్‌ను పిలుస్తుంది. వాళ్ల హైదరాబాద్ ప్రయాణం ఆగిపోయిందని మల్లిక సంతోష పడుతుంది. 
ఇంతలో జ్ఞానాంభ వేసుకున్న ట్యాబ్లెట్స్‌ను జానకీ చెక్ చేస్తుంది. ట్యాబ్లెట్స్ మారిపోయాయని గ్రహించి జ్ఞానాంభ బీపీ తగ్గిందని... బీపీ పెంచే పనిలో పడుతుంది. ఇంతలో లూసీ ఫోన్ చేసి 9 గంటలకల్లా పోటీలకు హాజరు కావాలని చెప్తుంది. 


జ్ఞానాంభ చాలా ఇబ్బంది పడుతుంది. దాన్ని చూసిన మల్లిక  కంగారు పడుతుంది. ఏమైనా జరిగితే తన మెడకు చుట్టుకుంటుందని భయపడుతుంది. ఇంతలో ఉప్పు, పంచదార కలిపిన నీళ్లను జానకి తీసుకొచ్చి జ్ఞానాంభకు తాగిస్తుంది. ఆ నీళ్లు తాగిన తర్వాత జ్ఞానాంభ కాస్త కోలుకుంటుంది. బీపీ డౌన్ అయిందని... ఏం కంగారు లేదని ఇంట్లో వాళ్లను సముదాయిస్తుంది జానకి. 


ఇంతలో డాక్టర్‌ వస్తారు.  ఏం జరిగిందని ఆరా తీస్తారు. విటమిన్ ట్యాబ్లెట్‌కు బదులు షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారని.. దానికి ఉప్పు నీళ్లు ఇచ్చామని చెబుతుంది జానకి. ఇంతలో మల్లిక ఓవర్ యాక్షన్ చేస్తుంది. అత్తయ్యను కాపాడాలంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంది. మల్లిక ఓవర్‌యాక్షన్ చూసి ఫ్యామిలీ అంతా అసహనంతో రగిపోతారు. 


అందర్నీ బయటకు పంపించిన డాక్టర్... జ్ఞానాంభు వైద్యం చేస్తుంది. ఇంతలో లూసీ మళ్లీ ఫోన్ చేస్తుంది. బయల్దేరా అని అడుగుతుంది. లేదని జానకి చెబుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తయ్య ప్రాణాల కంటే పోటీ ముఖ్యం కాదని.. తాము రాలేమని చెప్పేస్తుంది జానకి. ఇంతలో డాక్టర్‌ బయటకు వచ్చి టెన్షన్ పడాల్సిందేమీ లేదని.. జ్ఞానాంభ క్షేమంగా ఉన్నారని చెప్తారు.  



రేపటి భాగం
జ్ఞానాంభ కోలుకున్న తర్వాత రామచంద్ర ఆమె వద్దకు వెళ్లి క్షమాపణ కోరతాడు. అబద్దం చెప్పి వెళ్లడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో అంటాడు. జ్ఞానాంభకు ఇదేమీ అర్థం కాదు. ఎందుకిప్పుడు ఇదంతా అని అడుగుతుంది. ఎక్కడ అసలు విషయం చెప్పేస్తాడో అని గోవిందరాజు, జానకి టెన్షన్ పడతారు.