Jagadhatri Serial Today Episode: దివ్యాంక మాటలు విని కౌషికిని అనుమానించిన సురేష్‌...ఆమె గదిలో డబ్బుల బ్యాగ్‌ కోసం వెతుకుతాడు. ఆ విషయం చూసి జగధాత్రి, కేదార్ సురేష్‌ను వారిస్తారు. అక్కకి తెలిస్తే...బాధపడుతుందని చెబుతుండగానే అక్కడికి కౌషికి వచ్చి వెతుక్కోనివ్వమని ధాత్రి, కేదార్‌ను బయటకు తీసుకెళ్తుంది. వాళ్లు హాల్లో కూర్చుని ఉండగా....సురేష్ లోపల నుంచి డబ్బుల బ్యాగ్‌తో బయటకు వస్తాడు. 
 
ఆ డబ్బుల సంచి చూసి కౌషికితోపాటు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ డబ్బులు సంచి వెంకటేశ్‌ నుంచి తీసుకోలేదని...వ్యాపారం నిమిత్తం నువ్వే బ్యాంకు నుంచి డ్రా చేసుకుని తీసుకొచ్చావని చెప్పు కౌషికి మారు మాట్లాడకుండా వెళ్లిపోతానని సురేష్ అంటాడు. ఆమాటలు విన్న కౌషికి...నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ డబ్బుకు నాకు ఎలాంటి సంబంధం లేదని...ఆ డబ్బులు నా గదిలోకి ఎలా వచ్చాయో కూడా తెలియదని అంటుంది. అయితే దివ్యాంక చెప్పింది నిజమేనంటావు అని సురేష్ అంటాడు. ఆమె నిజాన్ని నిర్భయంగా అమ్ముకుంటే...నువ్వు చాటుమాటుగా అమ్ముకుని బతుకుతున్నావన్నమాట అని అంటాడు.
 
భర్త సురేష్ అన్న మాటలకు కౌషికి చాలా బాధపడుతుంది.ఇంతలో కేదార్‌, జగధాత్రి సురేష్‌కు సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తారు. నిజం తెలుసుకోకుండా మాటలు అనుకోవడం మంచిదికాదని అంటారు.మనం కూర్చుని మట్లాడుకుందామని చెబుతారు. వెంటనే వైజయంతి, నిషిక కలుగుజేసుకుని నువ్వు ఇన్నాళ్లు చెప్పిన నీతులన్నీ ఒట్టి బూటకాలేనా అని కౌషికిని నిలదీస్తారు. నువ్వు ఏదో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నావని అనుకున్నామని... కానీ నువ్వు చేస్తున్న పని ఇదా అని అంటారు. మేం ఏం చెప్పినా మాకు వ్యాపారం చేయడం రాదని నోటికొచ్చినట్లు మాట్లాడుతావు... ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎలాంటి వ్యాపారం చేస్తున్నావోనని అనరాని మాటలు అంటారు. 
 
దీంతో జగధాత్రి నిషికపై గట్టిగా మండిపడుతుంది. కళ్లముందు నిజం కనపడుతుంటే...ఇంకా ఎందుకు మభ్యపెట్టాలని చూస్తున్నారని అంటారు. కౌషికి కలుగజేసుకుని మీరు ఏం అన్నా పర్వాలేదని...నా విలువలు గురించి మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరిస్తుంది. దివ్యాంక మాటలు విని వదినను అనుమానిస్తున్నావా అని ధాత్రి సురేష్‌ను నిలదీస్తుంది. కళ్లముందు నిజం కనిపిస్తున్నా...నమ్మకపోతే నా అంత మూర్ఖుడు ఉండడని అంటాడు. 
 
ఆ మాటలు విన్న కౌషికి వెంటనే నా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపో అంటుంది. నువ్వు తప్పులు చేస్తుంటే ప్రశ్నించిన వారిని ఇంట్లో నుంచి గెంటేస్తావా అని అంటాడు. నేను అంటే నమ్మకం లేనివాళ్లు నా ఇంట్లో ఉండటానికి వీళ్లేదని అంటుంది. దీంతో సురేష్ బయటకు వెళ్లిపోతాడు. కౌషికి ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది. సుధాకర్‌, జగధాత్రి,కేదార్ వెళ్లి ఆమెను ఓదార్చుతారు. అన్నయ్య చెప్పుడు మాటలు విని అలా మాట్లాడాడని ధాత్రి అంటుంది. నిషిక వాళ్ల మాటలకు అసలు విలువేలేదని సుధాకర్ సర్దిచెబుతాడు. ఇన్నాళ్లు నిజం కోసం బయటివాళ్లతో పోరాడుతూనే ఉన్నానని...ఇప్పుడు సొంతవాళ్లతోనూ పోరాడాల్సి వస్తోందని కౌషికి బాధపడుతుంది. ఆమెను ఓదార్చి ధాత్రి బయటకు వస్తుంది.
 
ఇదంతా దివ్యాంక కుట్రని తేలింది కాబట్టి...ఖచ్చితంగా ఆ డబ్బు ఇంట్లోకి వచ్చిందంటే నిషిక వాళ్లపనేనని ధాత్రి అంటుంది. వెళ్లిచూద్దాం పదా అని కేదార్‌ను తీసుకుని వెళ్తుంది. ఎప్పుడూ మనమీద అరిచే కౌషికి ఇవాళ ఏడుపుముఖం పెట్టడం చూస్తుంటే ఎంతో ఆనందమేసిందని వైజయంతి నిషికతో అంటుంది.మనం ఇవాళ కొట్టిన దెబ్బకు కౌషికి గిలగిల కొట్టుకుందని సంతోషపడుతుంటారు. 
 
అప్పుడే  దివ్యాంక ఫోన్‌చేసి అక్కడ ఏం జరిగిందని అడగ్గా...మన ప్లాన్ సక్సెస్‌ అంటూ ఆమెతో మాట్లాడతారు.అయితే వాళ్లిద్దరూ విడిపోయినప్పుడు తీసిన వీడియో పంపమని చెబుతుండగా...జగధాత్రి అక్కడికి వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావని అడగ్గా నిషిక దురుసుగా సమాధానిస్తుంది. ఫోన్‌ లాక్కుని చూసి ధాత్రి నిషిక చెంప పగులగొడుతుంది. అందులో ఉన్న వీడియో చూసి ఫోన్ నేలకోసి కొట్టి పగులగొడుతుంది. ఈ విషయం వదినకు చెప్పి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించనందుకు సంతోషించండని ఇద్దరిని హెచ్చరించి వెళ్లిపోతుంది.