Jabardasth Latest Promo Out: ‘బుల్లితెర’ ప్రేక్షకులను వారం వారం నవ్వుల్లో ముంచెత్తుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షో ఈ వారం కూడా అలరించబోతోంది. రాబోయే ఎపిసోడ్ కు సంబంధించి విడుదలైన ప్రోమో ఫుల్ ఫన్ తో ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాపై రాఘవ పంచులు, కుష్బూ రివర్స్ పంచ్
ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రాఘవను చెప్పాపెట్టకుండా వచ్చారేంటని భార్య అడుగుతుంది. “మధ్యాహ్నం మా బాస్ లేడు వచ్చేస్తున్నానని ట్విట్టర్ లో పెట్టాను కదా.. ఇన్ స్టాలో కూడా పెట్టాను. ఆ రెండు మిస్సైనా తెలుసుకోవాలని వాట్సాప్ లో పెట్టాను. అది కూడా చూడలేదా?” అంటూ ఒంటికాలు మీద లేస్తాడు. “సరేగానీ..బాగా ఆకలిగా ఉంది. అర్జంటుగా వెళ్లి వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు పంపించు” అంటాడు రాఘవ. “వాటిని వాట్సాప్ లో పంపించు చాలు” అని కుష్బూ రివర్స్ పంచ్ వేయగానే అందరూ నవ్వుతారు.
తాగుబోతు రమేష్ పై నూకరాజు పంచులు, నోరు జారిన రోహిణి
‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ స్పూస్ చేసి నవ్వించాడు నూకరాజు. “ఉదయాన్నే లేచి నవ్వితే షుగర్ తగ్గుతుందట. ఆ విషయం తనకు షుగర్ వచ్చాకే తెలిసింది” అంటూ నూకరాజు చెప్పడంతో అందరూ నవ్వుతారు. ఇక తాగుబోతు రమేష్ పై నూకరాజు వేసిన పంచ్ లు కడుపుబ్బా నవ్విస్తాయి. “హాస్యంలో వందకు వంద మార్కులు తెచ్చుకున్న నువ్వు ఇక్కడేంటి 8, 8 మార్కులు వస్తున్నాయి” అనడంతో అందరూ నవ్వుతారు. ఫ్యామిలీ హోటల్ పేరుతో ఆటో రాం ప్రసాద్ వేసిన స్కిట్ పటాసులా పేలింది. హోటల్ కు వచ్చిన కస్టమర్లకు ఫ్యామిలీ అట్మాస్పియర్ ఏర్పాటు పేరుతో చేసే మోసం అందరినీ నవ్విస్తుంది. కస్టమర్లకు భార్యగా యాక్ట్ చేస్తూ రోహిణి వేసిన పంచులు ఓ రేంజిలో అలరిస్తున్నాయి.
బట్టల దుకాణంలో కెవ్వు కార్తిక్ టెన్షన్, హోటల్ ముందు రచ్చ చేసిన ఫైమా
ఇక బట్టల షాప్ లో ఎంప్లాయిగా కెవ్వు కార్తిక్ చేసిన ఫన్ అందరినీ ఆకట్టుకుంది. డిస్ ప్లే బొమ్మల మధ్యలో నిజమైన అమ్మాయిని పెట్టి, ఎక్కడ తన ఓనర్ కు తెలిసిపోతుందోనని ఆయన పడే టెన్షన్ ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తుంది. బుల్లెట్ భాస్కర్, ఫైమా, నాటీ నరేష్ చేసిన కామెడీ అందరినీ ఆకట్టుకుంది. నరేష్ బాగా చదివి 100కు 100 మార్కులు తెచ్చుకున్నా బుల్లెట్ భాస్కర్ కొట్టడం నవ్విస్తుంది. “అన్ని సబ్టెక్టులు బాగా చదివితే టీచర్లు నన్ను స్కూల్కు పిలవరు. అదే జీరో తెచ్చుకుంటే అందరూ టీచర్లు పిలుస్తారు” అని నవ్విస్తాడు. భాస్కర్ ఫైమాను కాదని మరో అమ్మాయితో ఓ హోటల్ గదిలో ఉండగా, ఫైమా అక్కడికి పోలీసులతో వచ్చి చేసిన రచ్చ అందరినీ అలరిస్తుంది. మీడియా ముందు ఆమె ఏడ్చే ఏడ్పులు నవ్వుల పువ్వులు పూయిస్తాయి.
మరోసారి జగన్ మీద పంచ్ వేసిన రింగ్ రియాజ్
ఎప్పటిలాగే ఇమ్మాన్యుయేల్ వర్షాతో డబుల్ మీనింగ్ డైలాగులతో స్కిట్ చేశాడు. తాను ఇంట్లో లేనప్పుడు ఏవో సౌండ్లు వస్తున్నాయంటూ భార్యను అనుమానిస్తాడు. “అవునండీ మీరు ఇంట్లో లేనప్పుడు వస్తువులు వాటంతట అవే పడుతున్నాయి. ఏదో ఆత్మ ఉందని భయమేస్తుంది” అంటుంది వర్ష. “ హైదరాబాద్ లో ఉన్న వాళ్లు అందరూ అయిపోయారు ఆత్మల దగ్గరికి కూడా వెళ్లావా?” అంటూ అతడు వేసే పంచ్ అందరినీ నవ్వించింది. ఇక దయ్యాన్ని తరిమికొట్టేందుకు మాంత్రికుడు రియాజ్ ను పిలిపిస్తాడు. పదింటికి వస్తానని 11 గంటలకు వచ్చారేంటి? అని అడుగుతాడు ఇమ్మూ. “నేను పదికి రాను, పదకొండుకే వస్తా” అంటూ వైఎస్ జగన్ పై వేసిన పంచ్ అందరినీ నవ్విస్తుంది.