Illu Illalu Pillalu Serial Today Episode చందు దూరం పెట్టడంతో వల్లీ ఏడుస్తూ పుట్టింటికి వెళ్తుంది. ఇక నుంచి అత్తారింటికి వెళ్లను.. ఆ పది లక్షల విషయంలో నేను తనని మోసం చేశానని అనుకుంటున్నారు అని  వల్లి ఏడిస్తే. నీ ప్రేమతో నీ మాటలతో అల్లుడి గారిని నువ్వు దారిలోకి తీసుకొచ్చేయాలి అని భాగ్యం సలహా ఇస్తుంది. 

వల్లీ ఏడుస్తూ ఆ పది లక్షలు మనం ఇస్తేనే ఆయన నాతో మాట్లాడుతారు. ఆయన మాట్లాడకపోతే నేను ఉండలేనమ్మా.. మీరు ఏదో ఒకటి చేసి ఆ పది లక్షలు ఇస్తేనే నా కాపురం బాగుంటుందని ఏడుస్తుంది. భాగ్యం కూతుర్ని ఓదార్చుతూ ఇన్ని మాయలు మోసాలు చేసి ఇన్ని అబద్ధాలు చెప్పి నిన్ను ఆ ఇంటి కోడలు చేసింది నీ కాపురం బాగుండాలి అనే.. ఇప్పుడు నీ కాపురం కూలి పోయే పరిస్థితి వస్తే ఊరుకుంటానా నేనే ఏదో ఒకటి చేయి ఆ పది లక్షలు ఏర్పాటు చేస్తా నువ్వేం భయపడకు అని శ్రీవల్లిని అత్తింటికి పంపిస్తుంది. 

భాగ్యం ఇంటికి భద్రావతి, విశ్వ వస్తారు. ఇదేం ప్రకృతి వైపరిత్యం.. తీరం దాటిన తుఫాను దారి తప్పినట్లు ఇలా వచ్చారేంటో.. పైగా మీరు మా వియ్యంకుల శత్రువులు మీరు మా ఇంటికి వచ్చారేంటి అని భాగ్యం అంటుంది. మొన్న పిచ్చ కొట్టుడు కొట్టారు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు అని ఆనంద్‌రావు అంటాడు. భద్రావతి భాగ్యంతో నాకు నువ్వు ఓ సాయం చేస్తే మీ  పది లక్షలు అవసరం మేం తీర్చుతాం అని అంటుంది. మేటరేంటో చెప్పండి అని భాగ్యం అడిగితే నా మేనల్లుడికి రామరాజు చిన్న కూతురికి పెళ్లి చేయాలి అనుకున్నాం.. మా రెండు కుటుంబాలకు పడదు కాబట్టి ఈ సంబంధం కుదరడం అసాధ్యం కాబట్టి నా మేనల్లుడికి రామరాజు చిన్న కూతురికి చనువు ఏర్పడేలా మీ కూతురు రాయభారం చేయాలి అంటుంది. నా కూతురు రాయభారం చేయాలి అనుకున్నప్పుడే నాకు ఏదో తేడా కొడుతుందని భాగ్యం అంటుంది. 

రామరాజు కుటుంబం నాశనం అయిపోవాలని కత్తుల నూరిన మీరు ఇలా లోక కల్యాణం కోసం పెళ్లి చేస్తామని అంటే నమ్మేయదు ఈ భాగ్యం అని అంటుంది. భద్రావతి ఎమోషనల్‌ డ్రామా మొదలు పెడుతుంది. పాతికేళ్లగా నా చెల్లికి, ఇప్పుడు నా మేనకోడలికి దూరంగా ఉన్నాను ఆ బాధ భరించడం నాకు ఇష్టం లేదు.. ఈ పెళ్లితో మా రెండు కుటుంబాలు కలిసిపోవాలి అనుకుంటున్నాను ఇందులో ఎలాంటి మాయ లేదు మోసం లేదు అని పదిలక్షలు ఇచ్చి నమ్మితే సాయం చేయండి అని పదిలక్షలు అక్కడ పెడుతుంది. 

శ్రీవల్లి కష్టం గుర్తొచ్చి భాగ్యం ఆనంద్‌ ఆలోచించి డబ్బులు తీసుకొని సాయం చేయాలని అనుకుంటారు. భద్రావతితో మీ ఆలోచన వెనక కుట్రలు కుతంత్రాలు లేవని చెప్తున్నారు కాబట్టి మీకు సాయం చేయడానికి ఒప్పకుంటున్నామని చెప్పి డబ్బు తీసుకుంటారు. భద్రావతి మనసులో ఓరేయ్ రామరాజు ఆటలో మొదటి మెట్టు ఎక్కేశాంరా అనుకుంటుంది. 

ప్రేమ ఇక కల్యాణ్ తన జోలికి రాడు అని అనుకొని కాలేజ్‌కి బయల్దేరుతుంది. కల్యాణ్ మళ్లీ ప్రేమకి కాల్ చేస్తాడు. ఊరంతా పరుగెత్తించి కొట్టినా నీకు భయంలేదారా నీ ఫొటోలకు నేను భయపడనురా అని అంటే అయితే నీ పెళ్లి ధీరజ్‌తో ఎలా అయిందో మీ మామకి చెప్తా.. నేను తీసుకెళ్లి వదిలేస్తే వాడు పెళ్లి చేసుకున్నాడని చెప్పేస్తా.. నీకు నాకు ఎఫైర్ ఉందని అందరికీ నమ్మిస్తా అప్పుడు నీ బతకు ఏం అవుతుందో ఆలోచించుకో.. గంటలో నా పక్కలోకి రాకపోతే నీ మామకి నిజం చెప్పేస్తా అని బెదిరిస్తాడు. ప్రేమ మళ్లీ కుప్పకూలిపోయి ఏడుస్తుంది. 

ధీరజ్ కాలేజ్‌కి వెళ్లి ప్రేమ ఫ్రెండ్స్ అందరికీ ప్రేమ ప్రవర్తన గురించి అడుగుతాడు. ప్రేమ ఏడుస్తూ కల్యాణ్ విషయం మామయ్యకి చెప్తే నర్మద అక్క అత్తయ్యలు పెద్ద ప్రాబ్లమ్‌లో పడతారు. నా కారణంగా ఎలాంటి గొడవలు జరగకూడదు అంటే ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.