Gruhalakshmi Telugu Serial Today Episode: ఎందుకు నా వెంట పడుతున్నావు అంటూ నందాపై తులసి కోప్పడుతుంది. దీంతో నంద షాక్‌గా ఉండిపోతాడు. తులసి లోపలికి వెళ్తుంది. బెడ్‌రూంలో అనసూయ, పరంధామయ్య మాట్లాడుకుంటూ ఉంటారు.


పరంధామయ్య: అనసూయ నన్ను వదిలి ఎక్కడికి పోవద్దు.


అనసూయ: నేను ఎక్కడికి వెళ్లనండి. మీతోనే ఉంటాను.


పరంధామయ్య: మరి ఎప్పుడూ నవ్వుతూ ఉండే నువ్వు ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు. చెప్పు అనసూయ.


అనసూయ: నేనేం ఏడవడం లేదండి


పరంధామయ్య: ఒకసారి తులసిని పిలువు అనసూయ


అనసూయ: ఇప్పుడెందుకండి ఏదైనా అవసరం అయితే చెప్పండి నేను ఉన్నాను కదా


పరంధామయ్య: అది కాదు అనసూయ నన్ను ఏదైనా వృద్దాశ్రమంలో చేర్పించమని చెబుదామని పరంధామయ్య చెప్పగానే తులసి పాలు తీసుకుని లోపలికి వస్తుంది.


తులసి: ఇంకోసారి ఆ మాటంటే నేనే ఇల్లు వదిలి వెళ్లిపోతాను. ఈ తులసిని చూడకుండా మీరు ఉండగలరేమో కానీ మా మావయ్యను చూడకుండా నేను ఉండలేను. అంటూ తులసి బాధపడుతుంది. మరోవైపు రాజ్యలక్ష్మీ, బసవయ్య, సంజయ్‌ గార్డెన్‌లో కూర్చుని హ్యాపీగా నవ్వుకుంటుంటారు.


బసవయ్య: దివ్య పిచ్చి ప్లాన్‌లో నాలుగవ ఆధ్యాయం ప్రారంభం. పాపం పిచ్చి పిల్ల మనసు ప్రశాంతంగా ఉండాలని మెడిటేషన్‌ మొదలు పెట్టింది. తను ప్రశాంతంగా ఉంటే మనకు ప్రశాంతత ఉండదని తెలియదు పాపం. మొగుడి  ప్రాణం డేంజర్‌లో ఉందన్న విషయం చెవిన పడగానే కట్లు విప్పుకున్న ఆంబోతులా పరుగెత్తింది.


రాజ్యలక్ష్మీ: కంగారు పడుతున్న దివ్యను చూసి విక్రమ్‌కు పిచ్చెక్కుతుంది. మింగలేడు కక్కలేడు.  ఇంకెవ్వరికీ చెప్పుకోలేడు. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతాడు.


సంజయ్‌: అమ్మా.. అన్నయ్య పరిస్థితి చూశారుగా అటు వదిన వైపు మాట్లాడలేక, ఇటు మన వైపు మాట్లాడలేక తెగ ఇబ్బంది పడిపోతున్నాడు.


దివ్యను పిచ్చిది అని ఫ్రూప్‌ చేసి విక్రమ్‌కు దివ్యకు విడాకులు ఇప్పించి జానును ఈ ఇంటి పెద్ద కోడలును చేయాలి అని ప్లాన్‌ చేస్తారు రాజ్యలక్ష్మీ, బసవయ్య, సంజయ్‌. మరోవైపు భాగ్యం టీ తాగుతూ ఉంటుంది ఇంతలో లాస్య వస్తుంది.


భాగ్యం: ఏంటి కనిపించడం మానేశావు.


లాస్య: ఏంటి దిగులు పెట్టుకున్నావా?


భాగ్యం: అంత లేదులే ఊరికే తెలుసుకుందామని


లాస్య: నా టార్గెట్‌ చెప్పానుగా నందూని తిరిగి నా సొంతం చేసుకోవడం.


భాగ్యం: ఈ మాట అప్పుడెప్పుడో చెప్పావు.


అనగానే చూస్తూ ఉండూ త్వరలోనే నందూ వచ్చి నా ఒడిలో వాలిపోతాడు. అంటుంది లాస్య. లాస్య మాటలకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్తుంది భాగ్యం. దివ్య ఆటోలో ఏడుస్తూ విక్రమ్‌ కోసం హాస్పిటల్‌కు వెళ్తుంది. విక్రమ్‌ను వెతుక్కుంటూ లోపలికి వెళ్తుంది. దివ్యకు విక్రమ్‌ ఎదురు వస్తాడు.


దివ్య: విక్రమ్‌ నీకేం కాలేదుగా


విక్రమ్‌: దివ్య ఏమైంది నీకు ఏంటి హడావిడి. అయినా హాస్పిటల్‌కు ఎందుకొచ్చావు.


దివ్య: విక్రమ్‌ నీకేం కాలేదుగా ముందు విషయం చెప్పు.  


విక్రమ్‌: నాకేం కాలేదు ముందు విషయం చెప్పు.


అనగానే కారు ఎందుకు డ్యామేజ్‌ అయింది అని అడుగుతుంది దివ్య. అది ఎవరో అడ్డు రావడంతో కారు డివైడర్‌ను తాకింది అని విక్రమ్‌ చెప్పగానే దివ్య తన మీద ఒట్టు వేసి నిజం చెప్పమని అడగడంతో విక్రమ్‌ దివ్యకు నిజంగానే ఏదో అయ్యింది కూల్ గా అడిగి తెలసుకోవాలని మనసులో అనుకుంటాడు. మరోవైపు లాస్య బొకే తీసుకుని తులసి వాళ్ల ఇంటికి వస్తుంది. పరంధామయ్య సోపాలో పడుకుని ఉండటం చూసి ఈ ముసలోడు ఇంకా పడుకుని ఉన్నాడేంటి? అని మనసులో అనుకుని లోపలికి వెళ్లి ఆయన్ను నిద్ర లేపి నన్ను గుర్తు పట్టారా? అని అడుగుతుంది. ఎక్కడో, ఎప్పుడో చూసినట్లు ఉందని పేరు గుర్తుకు రావడం లేదని చెప్తాడు. దీంతో మీకు మాయదారి జబ్బు వచ్చిందని అదేంటో చెప్తానని అనడంతో తులసి వస్తుంది. తులసిని చూసిన పరంధామయ్య ఈ అమ్మాయి ఎవరో నాకు జబ్బు ఉందని చెప్తుంది అని పరంధామయ్య చెప్పగానే తులసి కోపంగా మామయ్యను లోపలికి తీసుకెళ్లమని అనసూయకు చెప్పి లాస్యపై కొప్పడుతుంది తులసి.


తులసి: తనకు జబ్బు గురించి తెలియకుండా కంటికిరెప్పలా చూసుకుంటున్నాము. తీరిగ్గా వచ్చి ఆయనకు జబ్బు సంగతి చెప్తా అంటావా?


లాస్య: అరె ఎందుకంత ఆవేశం జబ్బు పేరు ఆయనకు చెప్పకుండా దాచినంత మాత్రాన జబ్బు తగ్గిపోతుందా?   


అంటూ లాస్య మాట్లాడగానే అందరూ కలిసి లాస్యను తిడతారు. నిన్ను భరించలేకే వాడు నిన్ను వదిలేసింది అంటూ అనసూయ లాస్యను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.