Pallavi Prashanth: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదైంది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర బీభత్సం సృష్టించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని సుమోటోగా తీసుకుని జూబ్లీహిల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా పోలీసులు ఎంత చెప్తున్నా వినకుండా పల్లవి ప్రశాంత్ బయట ర్యాలీ చేశాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్‌పై కేసులు నమోదయ్యాయి.


ఫైనల్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న అమర్ దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కొందరు దాడికి దిగారు. కేవలం కార్లపై మాత్రమే కాకుండా అటు వైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కూడా దాడి చేశారు. వారిని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు ఎంతో కష్టపడ్డారు. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ కారును కూడా అక్కడ ఆపకుండా పంపించేశారు. అయితే బయట ఏం జరుగుతుందో తెలియని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పోలీసులపై సీరియస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘శాంతిభద్రతలకు భంగం కలుగుతోంది. నడవండి. బండి కదులుతూనే ఉండాలి. ఆగొద్దు’ అని పోలీసులు చెప్తూ ఉండటం ఈ వీడియోలో చూడవచ్చు.


‘ఏంటన్నా ఇది. ఒక రైతుబిడ్డకు కొంచెం కూడా విలువ ఇవ్వట్లేదు’ అని పల్లవి ప్రశాంత్ ప్రశ్నించాడు. తనను కలవడానికి వచ్చిన ఒక అభిమాని కారు వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఏడుస్తుందని కారులో ఉన్న ఒక వ్యక్తి పల్లవి ప్రశాంత్‌తో చెప్పాడు. ‘ఏం చేయాలిరా. పోలీసులే వద్దంటున్నారు’ అని ఆ వ్యక్తిపై కూడా పల్లవి ప్రశాంత్ సీరియస్ అయ్యాడు. ‘ప్రశాంత్ నీకోసం ఇంతమంది వస్తుంటే నువ్వు ఎందుకు ఆగట్లేదు. ఒక కామన్ మ్యాన్‌గా నిన్ను సపోర్ట్ చేయట్లేదా’ అని  ఒక అమ్మాయి రైతు బిడ్డను ప్రశ్నించింది. కానీ దాన్ని కూడా పల్లవి ప్రశాంత్ పట్టించుకోలేదు. జనాలను, పోలీసులను మొత్తం వీడియోలు తీయమని కారులో ఉన్న తన ఫ్రెండ్స్‌కు ప్రశాంత్ చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు.


కొందరు పోలీసులు ప్రశాంత్‌ను వెళ్లిపోమని చెప్తుంటే ఒక పోలీస్ మాత్రం కారు పక్కన పరిగెడుతూ వచ్చి రైతు బిడ్డను పలకరించాడు. ‘ఎలా ఉన్నావు, ఇంటికి వచ్చి కలుస్తా’ అని ప్రశాంత్‌కు చెప్పాడు. అది చూసిన ప్రశాంత్ ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ‘పోలీసులే ఇలా చేస్తున్నారు ఏంటన్నా? ఒక రైతుబిడ్డ అన్నా.’ అని పోలీసుకు చెప్తూ బాధపడ్డాడు. కానీ ఆ పోలీస్ మాత్రం పల్లవి ప్రశాంత్ చెప్పేది పట్టించుకోకుండా వెళ్లిపోమన్నాడు. దీంతో ఏం చేయలేని పరిస్థితిలో ప్రశాంత్ తనకోసం వచ్చిన అభిమానులకు సారీ చెప్పాడు. నిజానికి పోలీసులు జోక్యం చేసుకొని పంపించడం వల్లనే పల్లవి ప్రశాంత్ సేఫ్‌గా వెళ్లగలిగాడు. కానీ రన్నరప్ అమర్‌దీప్‌పై దాడిని వారు కంట్రోల్ చేయలేకపోయారు. అమర్ కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. కారులో ఉన్న అమర్ కుటుంబం అయితే భయపడ్డారు.