Deepika Singh Injured During Shooting: మామూలుగా సినిమా సెట్‌లో, సీరియల్ సెట్‌లో ఎవరికీ ఏ హాని జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ప్రమాదాల వల్ల ఇప్పటికే ఎంతోమంది నటీనటులు కొన్నాళ్లు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి దీపికా సింగ్ కూడా యాడ్ అయ్యింది. తాజాగా ఒక షూటింగ్‌లో పాల్గొంటున్న ఆమెకు ప్రమాదం జరిగింది. దీంతో షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త చూసి ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.


తెలుగులో కూడా సక్సెస్..


పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా బాలీవుడ్ బుల్లితెరపై తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది దీపికా సింగ్. తన యాక్టింగ్‌తో చాలామంది బుల్లితెర ప్రేక్షకులను తన ఫ్యాన్స్‌గా మార్చుకుంది. హిందీలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా దీపికా సింగ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. తన హిందీ సీరియల్స్ తెలుగులో డబ్ అవ్వగా అవి ఇక్కడ కూడా మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయిన దీపికా సింగ్‌కు తాజాగా సెట్‌లో ఒక ప్రమాదం జరిగిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై ఎవరూ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ ఈ వార్త దీపికా ఫ్యాన్స్‌ను కంగారుపెడుతోంది.


షూటింగ్‌లో గాయం..


ప్రస్తుతం దీపికా సింగ్.. ‘మంగళ్ లక్ష్మి’ అనే సీరియల్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సీరియల్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా.. ఒక బరువుగా ఉన్న చెక్క వచ్చి తన వీపుపై పడిందట. షూటింగ్ జరుగుతున్న సమయంలో గట్టిగా గాలి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆ చెక్క చాలా బరువుగా ఉండడంతో దీపికా నొప్పిని తట్టుకోలేక అరిచిందని, దీంతో తన భర్త కూడా షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నాడని తెలుస్తోంది. అంత నొప్పిలో కూడా తాను షూటింగ్ పూర్తిచేయాలని ప్రయత్నించిందట. కానీ నొప్పి వల్ల భరించడం కష్టం అవ్వడంతో మేకర్స్.. షూటింగ్ ఆపేశారు.


మొదటిసారి కాదు..


‘మంగళ్ లక్ష్మి’ షూటింగ్ జరుగుతున్న దగ్గరే మరో సెట్‌లో పిల్లల డ్యాన్స్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా అక్కడ నుండి ఒక ఐస్ ప్యాక్ తీసుకొచ్చి దీపికా సింగ్‌కు అందించారట మేకర్స్. కాసేపు ఆ ఐస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత, తనకు నొప్పి తగ్గిన తర్వాత పలు ముఖ్యమైన సీన్స్‌ను షూట్ చేసిందట దీపికా. ఆ తర్వాత నొప్పి మరీ ఎక్కువ అవ్వడంతో తను ఇంటికి వెళ్లిపోయిందని సమాచారం. అయితే సెట్‌లో దీపికా సింగ్‌కు ప్రమాదం జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. కొన్నిరోజుల క్రితమే సెట్‌లో తన కంటికి గాయం అయ్యింది. అంతే కాకుండా అక్కడ రక్తం కూడా క్లాట్ అయ్యింది. అయినా ఆమె షూటింగ్ మాత్రం ఆపలేదట. ప్రస్తుతం ఆమెకు ఎలా ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది.


Also Read: వేదిక ఈజ్ బ్యాక్... అప్పుడు 'ముని', ఇప్పుడు 'యక్షిణి'... హారర్‌తో హిట్స్