Brahmamudi Serial Today Episode: తన చీర కుచ్చిళ్లు మడత పెట్టడానికి రుద్రాణిని పిలిచానని స్వప్న చెప్పడంతో.. రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. నేను నీ కాళ్ల దగ్గర కూర్చుని కుచ్చిళ్లు పెట్టాలా అంటూ కోపంగా రుద్రాణి ప్రశ్నిస్తుంది. కాళ్ళ దగ్గర కాకపోతే చేతుల దగ్గర కూర్చుంటారా ఎవరైనా అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్తుంది స్వప్న. దీంతో రుద్రాణి కోపంగా రాహుల్ వైపు చూడగానే ఎదో ఫోన్ వచ్చినట్లు రాహుల్ బయటకు వెళ్లిపోతాడు. రుద్రాణి.. స్వప్నను వెంటబడి కొట్టినట్లు కలగంటుంది. స్వప్న చిటికె వేసి రుద్రాణిని ఊహల్లో తనను కొట్టింది చాలు ముందు కుచ్చిళ్లు కట్టు అంటుంది. షాకైన రుద్రాణి, స్వప్న కాళ్ల దగ్గర కూర్చుని కుచ్చిళ్లు కట్టి బయటకు వెళ్లి రాహుల్‌ను తిడుతుంది. కింద వ్రతానికి అంతా సిద్దంగా ఉందని మూడు జంటలను వచ్చి కూర్చోమని పంతులు చెప్తారు. దీంతో బామ్మ అందరిని పిలుస్తుంది. కళ్యాణ్, అనామిక, స్వప్న, రాహుల్ రెడీ అయ్యి కిందకు వస్తారు. రాజ్, కావ్య మాత్రం రారు. కావ్య వచ్చి రాజ్ త్వరగా రెడీ అవ్వండి అని చెప్తుంది. రాజ్ అయిపోయింది పద అంటాడు. ఇంతలో కనకం కావ్యకు ఫోన్ చేసి అప్పుకు యాక్సిడెంట్ అయ్యిందని ఏడుస్తూ చెప్తుంది. డాక్టర్లు లోపలికి తీసుకెళ్లారని అప్పు స్పృహలో లేదని మీ నాన్నగారు కూలబడిపోయారు అంటూ చెప్తుంది. కావ్య హాస్పిటల్ పేరు కనుక్కుని అలాగే నిలబడి ఉంటుంది.
రాజ్: ఏయ్ ఇంకా ఏం ఆలోచిస్తున్నావు. పద వెళ్దాం.
కావ్య: వెళ్దాం కాదు నేను మాత్రమే వెళ్తాను.
రాజ్: నీకేమైనా పిచ్చా.. అప్పుకు యాక్సిడెంట్ అయ్యిందంటే ఒక్కదానివే వెళ్తానంటావేంటి?
కావ్య: అది కాదండి కింద అందరూ మనకోసం ఎదురుచూస్తున్నారు. అమ్మమ్మగారు మూడు జంటలు వ్రతం చేయాలి అన్నారు.
రాజ్: ఇప్పుడవన్నీ ఎందుకు?
కావ్య: కింద అందరూ సంతోషంగా ఉంటే.. అప్పుకు ఇలా అయ్యిందని తెలిస్తే పూజ ఆపేస్తారు. అనామిక చాలా ఫీలవుతుంది. నేను ఎవ్వరికీ చెప్పకుండా వెనక నుంచి వెళ్లిపోతాను. మీరు కిందకు వెళ్లి ఏదో ఒకటి చెప్పి వాళ్ల చేత వ్రతం జరిపించండి.
అంటూ కావ్య వెనక నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు కింద వాళ్లకు ఏం చెప్పాలి అంటూ రాజ్ ఆలోచిస్తాడు. కింద వాళ్లు రాజ్, కావ్య ఇంకా రాలేదేంటి అని అనుకుంటుండగానే రాజ్ ఒక్కడే కిందకు వస్తాడు. అందరూ షాక్ అవుతారు. కావ్య ఎక్కడని అడుగుతారు. కావ్య బయటకు వెళ్లిందని రాజ్ చెప్పడంతో మరోసారి అందరూ షాక్ అవుతారు. ఎందుకు వెళ్లిందని, ఈ టైంలో వెళ్లడం ఏంటని, వ్రతంలో కూర్చోవడం ఇష్టం లేకనే వెళ్లిందని తలో మాట అంటారు. ఇంతలో ఆమె రాకపోయినా పర్వాలేదు మీరు పూజ స్టార్ట్ చేయండని ధాన్యలక్ష్మీ చెప్పడంతో అపర్ణ ఫీలవుతుంది. ఎంతైనా అది ( కావ్య) నా కోడలు. నా కొడుకు వ్రతంలో కూర్చోకుండా పూజ చేయమంటావేంటి? అంటూ ధాన్యలక్ష్మీ మీద ఫైర్ అవుతుంది అపర్ణ. కళ్యాణ్ కూడా వదిన లేకుండా పూజ చేయడం ఏంటని వదిన వచ్చేవరకు వెయిట్ చేస్తామని చెప్తాడు. దీంతో రుద్రాణి ఫీలవుతుంది.
రుద్రాణి: సరిపోయింది. అన్నదమ్ములు రామలక్ష్మణులు అయినా వచ్చిన వాళ్లు కరెక్టుగా ఉండాలిగా..
స్వప్న: మీకు ఓపిక లేకపోతే వెళ్లి మరోసారి మేకప్ వేసుకుని రండి. అందరూ వెయిట్ చేస్తామంటే మీరేదో మునిగిపోయినట్లు మాట్లాడతారేంటి?
ధాన్యలక్ష్మీ: అంతా నా కర్మ నేనేం మాట్లాడినా తప్పై పోతుంది. నాకెందుకు ఓ మూలన కూర్చుంటాను.
అనడంతో ధాన్యలక్ష్మీ భర్త ఈశాన్యం మూలవైపు కూర్చోమాకు ఎందుకంటే అక్కడ బరువు ఉండకూడదు అంటూ వెటకారంగా చెప్తాడు. ఇప్పుడెలా అప్పుకు యాక్సిడెంట్ అయ్యిందని ఎవ్వరికీ చెప్పొదంది కావ్య.. ఇక్కడేమో ఇలా అంటూ మనసులో అనుకుంటాడు రాజ్. మరోవైపు కావ్య హాస్పిటల్‌కు వస్తుంది. కనకం, మూర్తిలను ఓదారుస్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి అర్జంట్‌గా బ్లడ్ కావాలని అది రేర్ గ్రూప్ అని త్వరగా తీసుకురావాలని లేదంటే చాలా ప్రమాదం అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు కావ్య కోసం ఇంట్లో అందరూ ఎదురుచూస్తుంటారు. ఇంతలో అనామిక లేచి వెళ్లిపోతుంటే.. అందరూ కూర్చోమని చెప్తారు. కావ్య ఇవాళ రాదని, తనకు వ్రతం జరగడం ఇష్టం లేదని నాకు అర్థం అయ్యిందని అనామిక చెప్తుంది. కావ్య కోరుకున్నట్లే వ్రతం ఆపేద్దాం అంటుంది. అనామికను కళ్యాణ్ తిడతాడు. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్ అయిపోతుంది.