గీతూ రాయల్... తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ అమ్మాయి చాలా బాగా తెలుసు. స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ సోషల్ మీడియాలో మొదట పాపులర్ అయ్యింది. ఆ తరువాత షోలో పార్టిసిపేట్ కూడా చేసింది. ఇప్పుడు ఆమెకు చిన్ని సీరియల్ చేసే అవకాశం వచ్చింది.
'చిన్ని'లో కొత్తగా ఎంటర్ అయిన గీతూ రాయల్!
తెలుగు బుల్లితెర వీక్షకులకు సూపర్ హిట్ సీరియల్స్ అందిస్తున్న 'స్టార్ మా'లో టెలికాస్ట్ అయ్యే సీరియళ్లలో చిన్ని ఒకటి. ప్రస్తుతానికి 225 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఇందులో కొత్తగా ఒక క్యారెక్టర్ ఎంటర్ అయ్యింది.
'చిన్ని'లో కుందన పాత్ర చేసే అవకాశం గీతూ రాయల్ సొంతం అయ్యింది. మరో బుల్లితెర పాపులర్ ఆర్టిస్ట్ 'జబర్దస్త్' పవిత్ర కూడా ఇటీవల ఈ సీరియల్ నటీనటుల జాబితాలో చేరింది. ఇప్పుడు ఆమెకు తోడు గీతూ రాయల్ కూడా చేరింది. మరి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? రాబోయే రోజుల్లో ఆవిడ పాత్ర ద్వారా ఎటువంటి ట్విస్ట్ ఇస్తారు? అనేది సీరియల్ ముందుకు వెళ్లే కొలది తెలుస్తుంది.
కావ్య వర్సెస్ నిఖిల్ అన్నట్లు మారిన సీరియల్!
'చిన్ని'లో ప్రముఖ బుల్లితెర హీరోయిన్ కావ్య మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇందులోకి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ నటుడు నిఖిల్ సైతం ఎంటర్ అయ్యారు.
'చిన్ని'లో ఓ చిన్నారికి తల్లి పాత్రలో కావ్య కనిపిస్తున్నారు. అయితే ఆవిడ తన ఐడెంటిటీని దాచి తన కుమార్తె ప్రాణాలు కాపాడుకోవడానికి తాపత్రయపడే తల్లిగా భావోద్వేగభరిత పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. జైలులో ఖైదీగా శిక్ష అనుభవించిన ఓ తల్లి తన ఐడెంటిటీని ఎందుకు మార్చుకోవలసి వచ్చింది? ఆమె కోసం ఏసీపీని పోలీసు శాఖ ఎందుకు రంగంలోకి దించింది? అనేది సీరియల్ చూసి తెలుసుకోవాలి.
ఇప్పుడు కావ్య వర్సెస్ నిఖిల్ అన్నట్లు సీరియల్ ముందుకు సాగుతూ ఉండడం వీక్షకులలో ఆసక్తి పెంచుతుంది. ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఇంతకు ముందు సీరియల్స్ కలిసి చేశారు. అప్పట్లో ప్రేమలో కూడా పడ్డారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమలో లేరు. బ్రేకప్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్యకు దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు నిఖిల్. రెండు మూడు కార్యక్రమాలలో కలిసి పాల్గొన్నారు. అయితే తనకు ప్రేమ మీద నమ్మకం పోయిందని నిర్మొహమాటంగా కావ్య చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ సీరియల్ వాళ్లను మరోసారి దగ్గరకు చేస్తుందేమో చూడాలి.