2022లో పలు వివాదాలు సినిమా పరిశ్రమను కుదిపేశాయి. తునీషా శర్మ ఆత్మహత్య తాజా సంచలనం కలిగించగా, రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్, ‘లాల్ సింగ్ చద్దా’ బాయ్ కాట్ వరకు చాలా సంఘటలను కాంట్రవర్సీకి దారితీశాయి.


1.తునీషా శర్మ ఆత్మహత్య  


టీవీ నటి తునీషా శర్మ తన షో ‘అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్’ సెట్స్‌ లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మాజీ ప్రియుడు, సహనటుడు షీజన్ ఖాన్‌ కారణంగానే తన కూతురు చనిపోయిందిన ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పోలీసులు షీజన్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. తను ఉరేసుకున్న మేకప్ రూమ్ నుంచి పోలీసులు ఓ నోట్ స్వాధీనం చేసుకున్నారు.   


2.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో కొత్త ట్విస్ట్


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్యకు గురైనట్లు శవపరీక్షలో పాల్గొన్న రూప్‌కుమార్ షా వెల్లడించడంతో అతడి మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. సుశాంత్ శరీరంపై పలు గాయాలున్నట్లు తెలిపారు. అతడి పోస్టుమార్టంను రికార్డు చేయాల్సి ఉన్నా, కేవలం ఫోటోలు తీయాలని ఉన్నతాధికారులు చెప్పినట్లు వెల్లడించారు. ఈ కేసు తదుపరి విచారణ సిట్ చేపట్టనుంది.   


3.’పఠాన్’ బేషరమ్ రంగ్ పాట వివాదం   


షారుఖ్ ఖాన్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘పఠాన్’ నుంచి విడుదలైన 'బేషరమ్ రంగ్' పాట తీవ్ర దుమారం రేపింది.  దీపికా పదుకొణె వేసుకున్న దుస్తులు వివాదానికి కారణం అయ్యాయి. ఆరెంజ్ కలర్ దుస్తుల్లో బేషరమ్ రంగ్ అనే పాటకు డ్యాన్స్ చేయడం పట్ల ఓ వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ పఠాన్’ ట్రెండ్ కొనసాగుతోంది.  


4.రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్


రణవీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటో షూట్ లో పాల్గొనడం వివాదం అయ్యింది. ఆయన ఫోటోలపై చెంబూర్‌కు చెందిన ఒక ఎన్‌జిఓ  పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'మహిళల మనోభావాలను' దెబ్బతీసేలా రణ్ వీర్ ఫోటోలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది.  


5.‘కాశ్మీర్ ఫైల్స్’పై నాదవ్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు   


IFFI జ్యూరీ హెడ్, ఇజ్రాయెలీ దర్శకుడు నదవ్ లాపిడ్, వివేక్ అగ్నిహోత్రి  బ్లాక్ బస్టర్ మూవీ ‘ది కాశ్మీర్ ఫైల్స్‌’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1990లో కాశ్మీరీ పండిట్ల వలసల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. నాదవ్ ఇదో వల్గర్ సినిమాగా అభివర్ణించారు. ఆ తర్వాత వివాదం చెలరేగడంతో ఆయన క్షమాపణలు చెప్పారు.   


6.క్రిస్ రాక్‌ చెంప పగలగొట్టిన విల్ స్మిత్  


ఆస్కార్స్ 2022 వేడుకలో విల్ స్మిత్ మాజీ భార్య జాడా పింకెట్ స్మిత్ బట్టతల గురించి హోస్ట్ క్రిస్ రాక్ ఎగతాళిగా మాట్లాడాడు. కోపంతో విల్ స్మిత్ క్రిస్‌ చెంప పగలగొట్టాడు. ఈ నేపథ్యంలో విల్ స్మిత్ ను 10 సంవత్సరాల పాటు అకాడమీ అవార్డుల నుంచి నిషేధించారు.   


7.మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్  


రూ.200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ఇరుక్కుంది. సుకేష్ చంద్రశేఖర్‌తో ఉన్న సంబంధాలతో ఆమె మెడకు ఈ కేసు చుట్టుకుంది. ప్రస్తుతం ఈడీ విచారణ కొనసాగుతోంది. గతంలో సుఖేష్‌ తో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉంది.


8.’లాల్ సింగ్ చద్దా’ బాయ్ కాట్


అమీర్ ఖాన్,  కరీనా కపూర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. సోషల్ మీడియాలో ఈ సినిమాను బహిష్కరించాలంటూ ప్రచారం కొనసాగింది. గతంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా  ఆన్ లైన్ ఉద్యమం కొనసాగింది. ఫలితంగా ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.   


9.’బ్రహ్మాస్త్ర’ వివాదం


రణ్ బీర్ కపూర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ విడుదలకు ముందు తను గతంలో చేసిన 'బీఫ్' వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో రణ్ బీర్ ప్రార్థనలు చేయకుండా బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు.  


10.బిగ్ బాస్ 16లో సాజిద్ ఖాన్  


మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న దర్శకుడు సాజిద్ ఖాన్ బిగ్ బాస్ 16 హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. షెర్లిన్ చోప్రా, సోనా మోహపాత్ర వంటి ప్రముఖులు అతని పాల్గొనడంపై ఫిర్యాదు చేశారు. అతడిని షో నుండి తొలగించాలని  డిమాండ్ చేశారు.  


Read Also: ‘పఠాన్’ సాంగ్‌పై వివేక్ అగ్నిహోత్రి విమర్శలు - ఆయన కూతురిని ట్రోల్ చేస్తున్న షారుఖ్ ఫ్యాన్స్