సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా.. చిన్న లూప్ హోల్ కనిపిస్తే చాలు ఓ రేంజ్ లో ఆడేసుకుంటూ ఉంటారు నెటిజన్లు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడ్డారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళిని సైతం ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దానికి కారణమేంటంటే.. ఈరోజు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు రాజమౌళి.
'బాహుబలి' పోస్ట్ ప్రొడక్షన్ లో కీలకపాత్ర పోషించిన దేవిక క్యాన్సర్ తో పోరాడుతుందని.. ఆమె వైద్యానికి సాయం చేయమని ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరారు. ఆయన చేసిన ప్రయత్నం మంచిదే అయినప్పటికీ.. నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
'దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడివి.. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటావ్.. ఆ సాయం నువ్వే చేయొచ్చుగా అని' ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. 'సినిమాకి వంద కోట్లు తీసుకునే నువ్వు మూడు కోట్ల కోసం ఫండ్స్ రైజ్ చేస్తున్నావా..?' అంటూ మరో నెటిజన్ కామెంట్స్ చేశారు. ఇలాంటి కామెంట్స్ వరుసగా పడుతూనే ఉన్నాయి. చాలా మంది రాజమౌళిపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు.
'బాహుబలి' లాంటి సినిమాకి పని చేసిన వ్యక్తి కోసం నువ్ చేసే సాయం ఇదా..? అంటూ రాజమౌళిని తిట్టిపోస్తున్నారు. నువ్వే సాయం చేయగలిగే స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలా అడగడానికి సిగ్గులేదా..? అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. బహుశా.. రాజమౌళి తను చేసిన సాయం గురించి చెప్పి మీరు కూడా సాయం చేయండని అడిగితే ఇంత నెగెటివిటీ వచ్చేది కాదేమో.. ఇతరుల సాయం అడగడానికి ముందే తనవంతు సాయం చేసి.. అప్పుడు ట్వీట్ చేసి ఉంటే ట్రోలింగ్ నుంచి తప్పించుకునేవారు.