తిరుపతి :  కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న చిత్తూరు జిల్లా తిరుమలకు పుణ్యక్షేత్రానికి భక్తులు దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్ధం వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు వివిధ రూపాల్లో టీటీడీ శ్రీవారి దర్శనం కల్పిస్తుంది. అయితే సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, ఆర్జిత సేవల ద్వారా స్వామి వారిని దర్శించుకుని భక్తులు పునీతులు అవుతుంటారు. ఇది అంతా కరోనా‌ మహమ్మారి విజృంభించ ముందు వరకూ సాగింది. కోవిడ్ తరువాత ఇందుకు బిన్నంగా తిరుమలలో పరిస్ధితులు మారాయి. 


నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు దక్కించుకోలేని శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త అందించింది. నేటి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది. ఇందులో ఫిబ్రవరి 1వ తేది నుంచి 15 తేది వరకు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి నెల కోటాలో రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తోంది టీటీడీ. కోవిడ్ తీవ్రత తగ్గితే తిరుపతిలో ఫిబ్రవరి 16 నుంచి ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని ప్లాన్ చేసింది. 


కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వ దర్శనం టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి టీటీడీ రద్దు చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్నది భక్తుల ఆవేదన. ఈ క్రమంలో సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్‌లైన్ విధానంలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయాలని అనేకసార్లు భావించిన కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేస్తూ వచ్చిన టీటీడీ ఫిబ్రవరి నెల 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెప్తున్నా కారణంగా వారి సూచనల మేరకు ఆఫ్‌లైన్లో టికెట్లు విడుదల చేయాలని భావిస్తోంది. టీటీడీ నిర్ణయంపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


కొండపై కోవిడ్‌ నిబంధనలు.. 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తుంది టీటీడీ. భక్తులు ఖచ్చితంగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ గానీ, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ గానీ ఉండి దర్శనం టిక్కెట్ ఉన్న భక్తులను మాత్రమే కొండకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అనుమతిస్తుంది. ప్రతి భక్తుడు ఖచ్చితంగా మాస్కు ధరించేలా టిటిడి అధికారులు సిబ్బందితో భక్తులకు అవగాహన కల్పిస్తుంది.‌ మాస్కులు ధరించిన వారిని మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతిస్తున్నారు.


Also Read: TTD Tirumala Tirupati Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నిమిషాల్లో ఖాళీ అయిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు..


Also Read: వారంలో ఈ రోజు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు సిద్ధిస్తాయట...