'గుంటూరు కారం' సినిమా విడుదల ముందు గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించారు. ఆ తర్వాత? ఆయన బయటకు రాలేదు. సంక్రాంతి తర్వాత మాటల మాంత్రికుడు కనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనను కలిశారు త్రివిక్రమ్. 'గుంటూరు కారం' విడుదలైన తర్వాత ఆయన కనిపించడం ఇదే తొలిసారి.
గురూజీ ముఖంలో నవ్వులు... కొత్త లుక్ చూశారా?
త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ పంచ్ డైలాగులకు, జోకులకు ప్రేక్షకులు నవ్వడం కామన్. ఇక్కడ అటువంటి గురూజీ మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు. మరి, మెగాస్టార్ ఏం జోక్ వేశారో?
''మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి ఆయన పూర్తిగా అర్హులు. తెలుగు జాతికి మెగాస్టార్ మరోసారి ఎనలేని గర్వాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి గారిని కలిసిన మా నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) గారు, త్రివిక్రమ్ గారు కలిశారు'' అని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
Also Read: నైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?
'గుంటూరు కారం' విడుదలయ్యాక త్రివిక్రమ్ కనిపించిన తొలి ఫోటో ఇదే కావడం విశేషం. ఆయన లుక్ బావుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి, త్రివిక్రమ్ ఫోటో చూసిన కొందరు నెటిజనులు వాళ్లిద్దరి కలయికలో సినిమా ఏమైనా వస్తుందా? అని ట్వీట్లు చేశారు. 'గుంటూరు కారం' తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. దాని కంటే ముందు వెంకటేష్ లేదా నాని... ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేయవచ్చని ఫిల్మ్ నగర్ టాక్. మరి, త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
'గుంటూరు కారం' సినిమా విడుదలైన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో సక్సెస్ పార్టీ జరిగింది. దానికి హీరోయిన్లు శ్రీ లీల, మీనాక్షి చౌదరితో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు, మహేష్ బాబు సన్నిహితుడు మహేష్ రమేష్ కనిపించారు. అయితే, త్రివిక్రమ్ కనిపించలేదు. సాధారణంగా ప్రతి సినిమా విడుదలకు ముందు ఇంటర్వ్యూలు ఇవ్వడం త్రివిక్రమ్ అలవాటు. 'గుంటూరు కారం' విడుదల ముందు, తర్వాత మీడియాతో ఆయన ముచ్చటించింది లేదు. సినిమా విడుదలయ్యాక మహేష్, శ్రీ లీల ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారంతే! త్రివిక్రమ్ మాత్రం ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు.
Also Read: హిమాలయాలకు వెళ్లిన గోపీచంద్... ఎందుకంటే?