ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన సినిమా 'పుష్ప'. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన 'పుష్ప' కొత్త ఏడాది కూడా అదే జోరు కనబరుస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకి రీచ్ మరింత పెరిగింది. నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ సైతం ఈ సినిమాలో పాటలను, డైలాగ్స్ ను అనుకరిస్తూ.. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.365 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క బాలీవుడ్ లోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. దాన్ని బట్టి బాలీవుడ్ లో బన్నీ క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది. కేవలం అల్లు అర్జున్ కోసమే థియేటర్ కి వెళ్లి మరీ సినిమా చూశారు నార్త్ ఆడియన్స్.
ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక నటించింది. అలానే సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు. ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 2 రాబోతుంది. కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.