టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ‘మైఖేల్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి జోరుగా ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా ‘మైఖేల్’ ప్రమోషన్‌లో భాగంగా సందీప్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. లోకేష్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మా నగరం’లో సందీప్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా కోసం వాళ్లు పడిన ఇబ్బందులను సందీప్ గుర్తు చేసుకున్నారు.
తెలుగు నిర్మాతలు ఎవరూ నమ్మలేదు
‘మా నగరం’ ప్రాజెక్ట్ కోసం లోకేష్ ను ఆరుగురు తెలుగు నిర్మాతల దగ్గరికి తీసుకెళ్లినట్లు సందీష్ కిషన్ వెల్లడించారు. వారిలో ఏ ఒక్కరు కూడా ఆయన మీద నమ్మకం పెట్టలేకపోయారని చెప్పారు. అయినా, పట్టు విడువకుండా ఈ సినిమా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. లోకేష్ కనగరాజ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ ప్రాజెక్ట్ తర్వాత, యువ దర్శకుడు పలువురు స్టార్ హీరోలతో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. విజయ్ తో కలిసి యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్టర్’ను రూపొందించారు. కార్తీతో కలిసి ‘కైతి’ చేశారు. కమల్ హాసన్ తో బ్లాక్ బస్టర్ ‘విక్రమ్’ తెరకెక్కించారు.
ఆకట్టుకుంటున్న‘మైఖేల్’ టీజర్
ఇక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడి మేనల్లుడు సందీప్ కిషన్ ‘ప్రస్థానం’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు కెరీర్ టర్న్ అయ్యే సినిమా మాత్రం ఒక్కటి కూడా చేయలేకపోయారు. ప్రస్తుతం రంజిత్ జయకోడి దర్శకత్వంలో ‘మైఖేల్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ వాయిస్ ఈ టీజర్ మొదలవుతుంది. “వేటాడటం రాని జంతువులే.. వేటాడే నోటికి చిక్కుతాయ్ మైఖేల్” అంటూ వినిపించే వాయిస్ కు కౌంటర్ గా.. “వెంటాడే ఆకలిని తీర్చుకోవడానికి వేటాడటం తెలియాల్సిన పనిలేదు మాస్టర్” అంటూ మైఖేల్ చెప్పే డైలాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టీజర్ అంతా భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది.
ఫిబ్రవరి 3న ‘మైఖేల్’ విడుదల
‘మైఖేల్’ చిత్రంలో విజయ్ సేతుపతి, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ, వరుణ్ సందేశ్, గౌతం వాసుదేవ్ మీనన్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 3న ఈ మూవీ విడుదల కానుంది.
Read Also: మూగబోయిన ‘సింగం’ గొంతు - ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మృతి