US Economy: ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. టెక్నాలజీ రంగం సహా అన్ని రంగాల కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. వ్యయాలు తగ్గించుకుంటూ, మాంద్యం నీడ తమ మీద పడకముందే జాగ్రత్త పడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో, US ఆర్థిక వ్యవస్థ గణాంకాలు చాలా ప్రోత్సాహకరంగా వెలువడ్డాయి. అమెరికన్ ఎకానమీ (US Economy), గత త్రైమాసికంలో అంటే, 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 2.9 శాతం పెరిగింది. ఇది కాస్త నెమ్మదైన వృద్ధే అయినా... మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితుల్లో ఈ గణాంకాలను సానుకూలంగా చూడాలి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది కాబట్టి ఫెడ్ దూకుడు ఇకపై తగ్గొచ్చు అన్నదానికి దీనిని ఒక సిగ్నల్‌గా భావించవచ్చు.
అంతకుముందు త్రైమాసికంతో తగ్గిన పోలిస్తే జీడీపీ
అమెరికా వాణిజ్య శాఖ (Commerce Department)) గురువారం (26 జనవరి 2023) విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 2022 డిసెంబర్ త్రైమాసికంలో అమెరికా దేశీయ స్థూల ఉత్పత్తి (GDP) వృద్ధి రేటు 2.9 శాతంగా నమోదైంది. మునుపటి సెప్టెంబర్ త్రైమాసికంతో (జులై- సెప్టెంబర్ కాలం) పోలిస్తే ఇది తక్కువగా ఉంది. అయితే ఈ పనితీరు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నందున నిపుణులు ఈ సంఖ్యను సానుకూల పరిస్థితులకు నిదర్శనంగా భావిస్తున్నారు.
జులై-సెప్టెంబర్ కాలంలో అమెరికా GDP 3.2 శాతంగా నమోదైంది. ప్రస్తుత త్రైమాసికంలో (2023 జనవరి నుంచి మార్చి వరకు) US GDP మరింత మందగించే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ సంవత్సరం మధ్య నాటికి ఆ దేశంలో తేలికపాటి మాంద్యం ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.
మాంద్యానికి దారి తీస్తున్న ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు
అమెరికా సహా ప్రపంచ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు తమ తమ దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 నుంచి వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో ఇప్పుడున్న వడ్డీ రేట్లు బహళ సంవత్సరాల గరిష్ట స్థాయుల్లో ఉన్నాయి.
ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా గత ఏడాది తన వడ్డీ రేట్లను చాలా సార్లు పెంచింది. ఈ కారణంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం (Inflation in America) తగ్గింది. అయితే.. దీంతో పాటు ఆర్థిక వృద్ధి, ప్రజలు చేసే వ్యయాలు కూడా తగ్గాయి. ఫలితంగా, మాంద్యానికి దారి తీసే ప్రమాద ఘంటికలు ఇప్పటికే మోగాయి. ఇప్పుడు, ఫిబ్రవరిలో మరోమారు రేట్ల పెంపునకు సిద్ధం అవుతోంది. అయితే, గతంలోలాగా పెద్ద మొత్తంలో వడ్డీ రేట్లు పెంచకుండా ఈసారి కేవలం 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్ల పెంపునకు మాత్రమే ఫెడ్ పరిమితమవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
ఫెడ్ నుంచి 25 బేసిస్ పాయింట్ల పెంపు నిర్ణయం వస్తుందన్న అంచనాకు అనుగుణంగా అమెరికన్, భారత్ సహా గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే సర్దుబాటు అయ్యాయి. ఒకవేళ దీని కంటే ఎక్కువ రేట్ పెంపు ఉంటే, ఆ ప్రభావం మార్కెట్ల మీద ప్రతికూలంగా ఉండవచ్చు. 25 బేసిస్ పాయింట్ల పెంపు ఉంటే, ఇప్పటికే దానిని ఫ్యాక్టర్ చేశాయి కాబట్టి, మార్కెట్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.