Pakistani Rupee: పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తోంది. ఆర్థిక సమస్యలతో ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయిన కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలోకి జారిపోయారు. పాకిస్థాన్‌ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పాక్ ప్రజల ఆకలి కేకలు, కనీస అవసరాలు తీరక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. పాక్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్థాన్ రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. 


పాక్ రూపాయి విలువ డాలర్‌కు 255 రూపాయలకు పడిపోయింది. కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 24 రూపాయలు పతనమైంది. బుధవారం పాక్ కరెన్సీ విలువ రూ. 230.89 గా ఉండగా.. అది గురువారానికి రికార్డు స్థాయిలో పతనమైంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కరెన్సీ మారకపు రేటు నిబంధనలను మరింత సరళతరం చేసింది. దీని వల్ల పాకిస్థాన్ కరెన్సీ విలువ ఒక్కసారిగా 24 రూపాయలు పడిపోయింది.


దివాళా అంచున పాక్


పాక్ దివాళ తీయనుంది. చైనా, సౌదీ అరేబియా నుంచి ప్రపంచ బ్యాంకు వరకు వెనక్కి తగ్గాయి. ద్రవ్యోల్బణం ఆకాశంలో ఉంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో పాకిస్థాన్ రూపాయి రికార్డు స్థాయిలో పడిపోయింది. పాకిస్థాన్ లో ఒక్క డాలర్ ధర రూ.255 దాటింది. ద్రవ్యోల్బణం 25 శాతం దాటనుంది. 3 నెలల్లో పాకిస్థాన్ 5 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. 


20 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పాక్ రుపాయి


ఓపెన్, ఇంటర్ బ్యాంక్ మార్కెట్లలో రూపాయి క్షీణించడంతో పాకిస్థాన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ బెంచ్ మార్క్ సూచీలు 1000 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. విదేశీ మారక నిల్వలు భారీగా క్షీణించడం, ఐఎంఎఫ్ బలహీనపడటం, కరెన్సీపై ప్రభుత్వం తన పట్టును కఠినతరం చేయడానికి ప్రేరేపించిన తర్వాత రూపాయి విలువ భారీగా పడిపోయింది. 


ఐఎంఎఫ్ షరతుల్లో భాగంగానే!


2019లో పాకిస్థాన్‌ కు సాయం చేసేందుకు ఐఎంఎఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆ సాయం చేయాలంటే కొన్ని షరతులు పెట్టింది. కరెంట్స్ సబ్సిడీలను ఉపసంహరించుకోవడం, పాక్ రూపాయి మారక విలువను మార్కెట్ ఆధారంగా నిర్ణయించడం, లెటర్ ఆఫ్ క్రెడిట్లపై నిషేధం తొలగించడం లాంటి కొన్ని షరతులు పెట్టింది. అయితే అప్పట్లో ఈ షరతులకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అలా ఐఎంఎఫ్ సాయం నిలిచిపోయింది. అయితే పాక్ పరిస్థితి ఏమాత్రం బాగాలేకపోవడం, దివాళా అంచున ఉండటంతో ఐఎంఎఫ్ నుండి సాయం అనివార్యంగా మారింది. అలా ఐఎంఎఫ్ షరతులను అంగీకరించినట్లు తెలుస్తోంది. 


అలా కరెన్సీపై ప్రభుత్వ నియంత్రణను సరళీకరించడం, రూపాయి మారకపు విలువను మార్కెట్ నిర్ణయించేలా చూడాలన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షరతులు పాటించడంతో పాక్ రూపాయి రికార్డు స్థాయిలో పడిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. 


ఆహార ట్రక్కుల వెంట పరుగులు


పాకిస్థాన్ లో ఘోర పరిస్థితులు నెలకొన్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణ ప్రజలు నిత్యావసర సరకులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఒక ప్యాకెట్ పిండి ధర రూ.3 వేల కంటే ఎక్కువే ఉంది. సామాన్యులు రోజూ రెండు పూటలా తినడం కూడా కష్టంగా మారింది. ఎన్నో కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. పాకిస్తానీలు ఆహార ట్రక్కుల వెంట పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విద్యుత్ సంక్షోభం నెలకొంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడంతో పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు.