సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. తన సినీ కెరీర్, హిట్లు, ఫ్లాఫులు, రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.

  


రెమ్యునరేషన్ విషయాన్ని పెద్దగా పట్టించుకోను


తన సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్ గురించి సాయి ధరమ్ తేజ్ కీలక విషయాలు చెప్పారు. ఏనాడు తన సినిమాలకు ఇంత రెమ్యునరేషన్ కావాలని పట్టుబట్టలేదన్నారు. “రెమ్యునరేషన్ గురించి నేను ఏనాడు పెద్దగా ఆలోచించలేదు. మంచి స్టోరీ వస్తే తప్పకుండా సినిమా చేస్తాను. నా చాలా సినిమాలకు ఎవరూ ఫుల్ పేమెంట్ ఇవ్వలేదు. నా సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడు కూడా ముందుగా ప్రామీస్ చేసిన దానికంటే ఎక్కువ ఇవ్వలేదు. నేనూ ఎవరినీ ఇవ్వమని అడగలేదు.  నేను చేసిన సినిమాల్లో ఒకే ఒక్క సినిమాకు ఫుల్ రెమ్యునరేషన్ వచ్చింది. అదీ ‘జవాన్’ సినిమాకు. ‘జవాన్’ ప్రొడ్యూసర్ కృష్ణ ముందుగా చెప్పినట్లుగానే పూర్తి రెమ్యునరేషన్ ఇచ్చారు. మిగతా వాళ్లు ఎవరూ పూర్తిగా ఇవ్వలేదు.  నేనూ ఎవరినీ ఇవ్వమని అడగలేదు” అని చెప్పుకొచ్చారు. వరుస ఫ్లాఫుల తర్వాత రెమ్యునరేషన్ తగ్గించారా? మంచి హిట్స్ వచ్చినప్పుడు రెమ్యునరేషన్ పెంచారా? అన్న యాంకర్ ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ ఈ సమాధానం చెప్పారు.


ఏప్రిల్ 21న ‘విరూపాక్ష’ విడుదల


‘విరూపాక్ష’ సినిమాలో  సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరో సాయి ధరమ్ తేజ్  ఈ చిత్రంపై చాలా హోప్స్ తో ఉన్నారు. ఆయన గతంలో నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోవపోవడంతో ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీలో సునీల్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.  బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 21, 2023 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ‘సుప్రీం’, ‘విన్నర్’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు వల్ల వెనుకబడినట్లు కనిపించినా.. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండుగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల ద్వారా మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. యాక్సిడెంట్ సమయంలోనే ఆయన నటించిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదల అయ్యింది. ప్రస్తుతం ‘విరూపాక్ష‘లో నటించారు.   


Read Also: సెన్సార్ రిపోర్ట్: ‘విరూపాక్ష’కు A సర్టిఫికేట్ - సెకండాఫ్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట!