Horror/Thriller/Mystery Movies: ఏవైనా ఒకటీ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లు కొడితే, అదే జోనర్ లో మూవీస్ తీయడానికి ఫిలిం మేకర్స్ ఆసక్తి కనబరుస్తుంటారు. దాన్ని హిట్ ఫార్ములాగా భావిస్తూ అదే తరహా టెంప్లేట్ తో స్టోరీలు రెడీ చేసుకుంటుంటారు. ప్రేక్షకాదరణ లభిస్తే కొన్నాళ్లపాటు అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తుంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో చేతబడులు, క్షుద్ర పూజల ట్రెండ్ నడుస్తోంది. మంత్రాలు తాంత్రిక శక్తుల నేపథ్యంలో రూపొందిన సినిమాలు సక్సెస్ అవుతుండటంతో, అలాంటి ఎలిమెంట్స్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. 


తెలుగులో క్రైమ్, మిస్టరీ, హారర్ జోనర్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి 'కాష్మోరా', 'తులసి దళం' దగ్గర నుంచి ఇప్పటి 'మసూద' వరకూ ఎన్నో చిత్రాలను ప్రేక్షకులు ఆదరించి, బ్లాక్ బస్టర్ విజయాలను అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో వచ్చిన మిస్టిక్ మిస్టరీ థ్రిల్లర్ 'విరూపాక్ష' మాంచి హిట్టయింది. చేతబడులు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు వంద కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేసింది. దీనికి కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు.


కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన 'బెదురు లంక 2012' చిత్రంలో మూఢనమ్మకాల కాన్సెప్ట్ ను ఫన్నీగా ప్రెజెంట్ చేసారు. విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందిన 'లియో' సినిమాలో మూఢనమ్మకాలతో కన్న పిల్లల్నే నరబలి ఇవ్వడానికి సిద్ధపడే మనుషుల గురించి ప్రస్తావించారు. ఓంకార్ రూపొందించిన 'మ్యాన్షన్ 24' వంటి మిస్టరీ వెబ్ సిరీస్ సైతం జనాలను ఆకట్టుకుంది. లేటెస్టుగా వచ్చిన సత్యం రాజేశ్ 'మా ఊరి పొలిమేర 2' సినిమా బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇది 'మా ఊరి పొలిమేర' చిత్రానికి సీక్వెల్. ఓటీటీలో రిలీజైన ఫస్ట్ పార్ట్ కి ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది. రీసెంట్ గా రెండో భాగాన్ని థియేటర్లలో విడుదల చెయ్యగా.. అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు 'పొలిమేర' ప్రాంచైజీని కొనసాగించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. 


'మా ఊరి పొలిమేర 2' సినిమా హిట్టైన తర్వాత పలువురు మీడియం రేంజ్ టాలీవుడ్ దర్శకులు చేతబడులు, బాణామతి, క్షుద్ర పూజలు, మూఢనమ్మకాలు వంటి ఎలిమెంట్స్ తో స్టోరీలు రాసుకుంటున్నారట. నిర్మాతలు సైతం అలాంటి కథల కోసమో చూస్తున్నారట. ఆ తరహా కథలు సిద్ధం చేయమని రైటర్స్, డైరెక్టర్స్ కి చెప్తున్నారట. మరోవైపు ఆల్రెడీ సెట్స్ మీదున్న చిన్నా చితకా హారర్ జోనర్ చిత్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి, థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 


'మా ఊరి పొలిమేర' ప్రాంచైజీలో 3, 4, 5 భాగాలు కూడా వస్తాయని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ శుక్రవారం (నవంబర్ 17) పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మంగళవారం' సినిమా ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఇది 80-90స్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన కథ అని ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి అర్థమవుతోంది. డైరెక్టర్ అజయ్ భూపతి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌ పుత్ ప్రధాన పాత్ర పోషించింది. స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగం అవడంతో సినిమాకి కావాల్సినంత బజ్ ఏర్పడింది. 


ఇక యువ హీరో సందీప్ కిషన్ 'ఊరి పేరు భైరవ కోన' అనే ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ తో రావడానికి రెడీ అవుతున్నారు. పోస్టర్లు, టీజర్లను బట్టి చూస్తే ఇది 'విరూపాక్ష' తరహా కంటెంట్ తో రాబోతోందనిపిస్తోంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సరికొత్త కథ కథనాలతో ఆడియన్స్ ను థ్రిల్ కు గురి చేయబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో 'పిండం' అనే హారర్ మూవీ తెరకెక్కుతోంది. 1930 నుంచి 1990 వ‌ర‌కు మూడు టైమ్‌లైన్‌లలో ఈ సినిమా ఉండ‌బోతోంది. 


ఇలా దెయ్యాలు, మంత్రాలు, యంత్ర తంత్ర, క్షుద్ర శక్తులు వంటి సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న మరికొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి రాబోతున్నాయి. ఒకవేళ ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్టయితే టాలీవుడ్ లో ఇంకొన్నాళ్లు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. 


Also Read: ‘కంగువ’ స్పెషల్ పోస్టర్ - ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకున్న సూర్య!