స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్‌ మహా సంగ్రామానికి సిద్ధమైంది. గత ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌లో టీమిండియా ఆశలపై నీళ్లు చల్లి కన్నీళ్లకు కారణమైన న్యూజిలాండ్‌తో రోహిత్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ప్రపంచకప్‌లో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత జట్టు.. అప్రతిహాత విజయాలతో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈ ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఓసారి ప్రతీకారం తీర్చుకుంది. కానీ అసలు సిసలు ప్రతీకారం తీర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది.  అన్ని విభాగాల్లో దుర్బేధ్యంగా రోహిత్‌ సేన... ఇక న్యూజిలాండ్‌పై విజయం సాధించడం  ఒక్కటే మిగిలింది. అయితే ఇప్పటివరకూ జరిగిన ప్రపంచకప్‌లలో భారత ప్రయాణాన్ని ఓసారి పరిశీలిస్తే... భారత్‌కు వన్డే ప్రపంచకప్‌లో ఇది ఎనిమిదో సెమీఫైనల్‌. అందులో మూడు సార్లు ఫైనల్లో ప్రవేశించి... రెండుసార్లు కప్పు గెలిచింది. మరో నాలుగుసార్లు భారత్‌ను దురదృష్టం వెంటాడింది. ఇప్పుడు భారత్‌ ఎనిమిదో సెమీఫైనల్‌ న్యూజిలాండ్‌తో తలపడనుంది. 

 

వన్డే ప్రపంచకప్‌ సంగ్రామం 1975 నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిన 1983 ప్రపంచకప్‌లో భారత్‌ తొలిసారిగా సెమీస్‌ చేరింది. ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని టీమిండియా తలపడింది. ఆ సెమీస్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 213 పరుగులు చేసింది. 

 

అప్పుడు 60 ఓవర్ల మ్యాచ్‌లు కావడంతో భారత్‌ 54.4 ఓవర్లలో 217 పరుగులు చేసి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన క్లైవ్‌ లాయిడ్‌ నేతృత్వంలోని కరేబియన్‌ జట్టును కపిల్‌దేవ్ నేతృత్వంలోని టీమిండియా జట్టు ఓడించి తొలి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం భారత్‌లో క్రికెట్‌కు వైభవాన్ని తీసుకొచ్చింది. 1987లోనూ భారత జట్టు సెమీస్‌ చేరింది. వాంఖెడేలో ఇంగ్లండ్‌తోనే మరోసారి సెమీఫైనల్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 254 పరుగుల చేయగా భారత్‌ 219 పరుగులకే  కుప్ప కూలింది. 1996లో ఎప్పుడూ జరగని ఘటనలు జరిగాయి. అప్పుడు భారత్‌లోనే జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్లో శ్రీలంక-భారత్‌ తలపడ్డాయి. కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 251 పరుగులు చేసింది. లంక బౌలర్ల ధాటికి భారత్ 34.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఈ దశలో అభిమానులు మ్యాచ్‌కు అంతరాయం కలిగించారు. దీంతో అంపైర్లు లంకను విజేతగా ప్రకటించారు.

 

2003 వరల్డ్‌కప్‌లో భారత్‌.. కెన్యాతో సెమీస్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన కెన్యా 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 225 పరుగులుచేయగా ఆ  లక్ష్యాన్ని భారత్‌ 47.5 ఓవర్లలో ఛేదించింది. నాటి భారత సారథి గంగూలీ ఈ మ్యాచ్‌లో అజేయ శతకంతో మ్యాచ్‌ను గెలిపించాడు. 2011లో భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడింది. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 260 పరుగులకే పరిమితం అయినా భారత బౌలర్ల అద్భుతంగా రాణించడంతో పాకిస్తాన్ 231 పరుగులకే ఆలౌట్ అయింది. 2015లో ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీస్‌ ఆడింది. ఈ పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 328 పరుగులు చేసింది. అనంతరం భారత్‌.. 46.5 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌట్‌ అయింది.

 

2019 ప్రపంచకప్‌లో కోహ్లీ సేన కివీస్‌తో సెమీస్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల కృషితో కివీస్‌ 50 ఓవర్లలో 239 పరుగులకే పరిమితం చేయగా లక్ష్య ఛేదనలో భారత్‌ తడబడింది. 49.3 ఓవర్లలో 221 పరుగులకే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్‌లో ధోని రనౌట్‌ ఇప్పటికీ భారత అభిమానులకు ఓ పీడకలలా వేధిస్తూనే ఉంది. ఈ ఓటమికి బదులు తీర్చుకునేందుకు ఇప్పుడు భారత్‌ ముందు సువర్ణావకాశం అంది.