కమర్షియల్ సినిమాకు కాలం చెల్లిందా?
కరోనాలో జనాలు కొత్త సినిమాకు అలవాటు పడ్డారా?
కథలు, కథనాలు, కమర్షియల్ లెక్కలు మారాల్సిందేనా?
కమర్షియల్ సినిమాలు చేసే హీరోలకు తిప్పలు తప్పవా?
ఏడాది ప్రారంభంలో ఎన్నో సందేహాలు... ఎన్నో అనుమానాలు...
ఆ సందేహాలకు, అనుమానాలకు 2021 సమాధానం ఇచ్చింది.
2021లో కమర్షియల్ సినిమా కాలర్ ఎగరేసింది!


గత ఏడాది (2020) చాలా రోజులు కరోనా ఖాతాలో పడ్డాయి. లాక్‌డౌన్‌లో రోజులు లెక్క‌పెట్టుకున్న నెల‌లు ఉన్నాయి. అప్పుడు షూటింగులు లేవ్... సినిమా రిలీజులు లేవ్... బయట తిరుగుళ్లు లేవ్... వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కార‌ణంగా చాలా మంది ఇంటి నుంచి అడుగు తీసి బయట వేస్తే ఒట్టు! ఆ సమయంలో ఓటీటీలో సినిమాలు చూడటం జనాలకు అలవాటు అయ్యింది. కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు, ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు కూడా చూశారు. ప్రపంచ సినిమా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సమయంలో వరల్డ్ సినిమాకు అలవాటు పడిన ప్రేక్షకుడు, మళ్లీ కమర్షియల్ తెలుగు సినిమా చూడటం కష్టమేనని విమర్శలు వచ్చాయి. కొంత మంది సందేహాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఓటీటీకి అలవాటు పడిన ప్రేక్షకులు కొంత మంది అన్ని సినిమాల కోసం థియేటర్లకు రావడం లేదు. కొన్ని సినిమాలు చూడటానికి థియేటర్లకు వస్తున్నారు. మరి కొన్ని సినిమాలు ఓటీటీలో వస్తే చూద్దామని వెయిట్ చేస్తున్నారు.
 ఇటువంటి తరుణంలో ఈ ఏడాది విడుదలైన కొన్ని కమర్షియల్ సినిమాలు భారీ  విజయాలు సాధించాయి. విమర్శలకు చెక్ పెట్టాయి. కమర్షియల్ సినిమాలు తీయవచ్చనే ధైర్యాన్ని ఇచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి.
 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది తొలి హిట్ 'క్రాక్'. అందులో కథ కొత్తది ఏమీ కాదు. పోలీస్, విలన్ మధ్య వార్ మెయిన్ కాన్సెప్ట్. అయితే... దర్శకుడు గోపీచంద్ మలినేని స్క్రీన్ ప్లే కొత్తగా రాశారు. సినిమాను కొత్తగా ప్రజెంట్ చేశారు. దాంతో విజయం వరించింది. 'క్రాక్' తర్వాత 'ఉప్పెన' రూపంలో తెలుగు సినిమాకు మరో భారీ విజయం లభించింది. పతాక సన్నివేశాల్లో దర్శకుడు బుచ్చిబాబు సానా చూపించిన విషయం కొత్తది కావచ్చు. కానీ, అప్పటి వరకూ పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమా నడిచింది.
 "అనగనగా ఓ కుర్రాడు! ఓ అమ్మాయిని ప్రేమించాడు. కులంలోనూ, బలంలోనూ, ధనంలోనూ... అమ్మాయి కుటుంబంతో పోలిస్తే, అతడి కుటుంబం చిన్నది. అయితే... అమ్మాయి అవేవీ చూడలేదు. ప్రేమకు అవేవీ అడ్డంకి కాలేదు" - 'ఉప్పెన'లో పతాక సన్నివేశాలు తీసేసి కథను ఇలా చూడండి! తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారీ విజయాలు అందించిన కమర్షియల్ ఫార్మాట్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ ఇది. అయితే... 'ఉప్పెన'కు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి అభినయంతో పాటు దేవి శ్రీ ప్రసాద్ పాటలు తోడు కావడంతో భారీ వసూళ్లు సాధించింది. సానా బుచ్చిబాబు కమర్షియల్ ఫార్మట్‌ను చక్కగా ప్రజెంట్ చేశారు.
 కామెడీ కూడా తెలుగు సినిమాకు కమర్షియల్ పాయింట్. ఏ భాషలోనూ లేనంత మంది కమెడియన్లు తెలుగులో ఉన్నారు. అయితే... 'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్', 'కామెడీ స్టార్స్' వంటి టీవీ ప్రోగ్రామ్స్‌ను జనాలు యూట్యూబ్‌లో వచ్చిన ఫ్రీగా చూస్తున్నారు. దాంతో డబ్బులు పెట్టి టికెట్ కొని థియేటర్లకు వచ్చి నవ్వుకోవాలని ఎవరూ కోరుకోవడం లేదనే మాటలు విన్పించాయ్. మరి, 'జాతి రత్నాలు' సినిమాకు వచ్చింది ఎవరు? జనాలే కదా! విచిత్రం ఏంటంటే... ఓటీటీలో ఆ సినిమా విడుదలైన తర్వాత చాలామంది చూసి పెదవి విరిచారు. దీనర్థం ఏమిటి? కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైతే జనాలు చూస్తారని! కమర్షియల్ సినిమా సెల్లింగ్ పాయింట్ థియేట్రికల్ బిజినెస్ అని!
 కమర్షియల్ సినిమా కాలర్ ఎగరేసిందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్‌... సెకండ్ లాక్‌డౌన్‌కు ముందు థియేట‌ర్ల‌లో విడుద‌లైన 'వ‌కీల్ సాబ్‌'. అలాగే, ఈ ఏడాది ఆఖ‌రి నెలలో వచ్చిన 'అఖండ‌', 'పుష్ప' సినిమాలు! ఇక్కడ కంటెంట్, కామెంట్స్ వంటివి పక్కన పెడితే... ఈ మూడు సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధించాయి. ఆ తర్వాత మంచి వసూళ్లు రాబట్టాయి.
 హిందీలో విమర్శకుల ప్రశంసలతో పాటు మహిళల మన్ననలు అందుకున్న 'పింక్' సినిమాకు 'వకీల్ సాబ్' రీమేక్. హిందీలో 'పింక్'ను ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అన్నారు. మరి, 'వకీల్ సాబ్'? మహిళల సమస్యను చర్చించిన సినిమా. దానికి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పలేం! హిందీతో పోలిస్తే... కథ పరంగా, క్యారెక్టర్ పరంగా తెలుగుకు చాలా మార్పులు చేశారు. ముఖ్యం పవన్ కల్యాణ్ పాత్రను కమర్షియలైజ్ చేశారు. అభిమానులు కోరుకునే విధంగా మలిచారు. అదే సమయంలో మహిళల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. పవన్ క్యారెక్టరరైజేషన్ వల్ల సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప‌వ‌న్‌ను చూడ‌టం కోసం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. అదీ స్టార్ పవర్. కమర్షియల్ సినిమా స్టామినా!
 'అఖండ' విషయంలోనూ స్టార్ పవర్ మరోసారి ప్రూవ్ అయ్యింది. సినిమాలో నట సింహ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎక్కువ అయ్యిందని పెదవి విరిచిన వారు ఉన్నారు. నేపథ్య సంగీతంలో తమన్ జోరు చూపించారని, దర్శకుడు బోయపాటి శ్రీను కథ కంటే యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో తమకు నచ్చలేదని చెప్పినవాళ్లు ఉన్నారు. అయితే... థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను అవేవీ ఆపలేకపోయాయి. ట్రాక్టర్లు ఎక్కి మరీ జనాలు 'అఖండ' చూడటం కోసం వచ్చారు. పక్కా కమర్షియల్ సినిమాకు భారీ ఓపెనింగ్స్, ప్రేక్షక ఆదరణ చూసి విమర్శకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. 'పుష్ప' సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. 'ఎస్ఆర్ కళ్యాణమండపం', 'శ్యామ్ సింగ రాయ్', 'రొమాంటిక్' వంటి కమర్షియల్ సినిమాలు సైతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
 కథ - కొత్తదనానికి, కలెక్షన్లకు సంబంధం లేదని ఈ ఏడాది విడుదలైన కమర్షియల్ సినిమాలు నిరూపించాయి. హీరోలు, దర్శకులు, నిర్మాతలు కాలర్ ఎగరేసేలా... కాలు మీద కాలేసుకుని కూర్చునేలా వసూళ్లు సాధించాయి. కరెక్టు సినిమా తీస్తే... కమర్షియల్ సినిమా హిట్ అవుతుందని 2021 టాలీవుడ్‌కు చెప్పింది.


- సత్య పులగం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి