'ఎవరు మీలో కోటీశ్వరులు' షో డేట్ ఫిక్స్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. సోమవారం నుండి గురువారం వరకు సాయంత్రం సమయంలో ప్రసారం కాబోయే 'మీలో ఎవరు కోటీశ్వరులు' షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు ఎన్టీఆర్. జెమినీ టీవీలో ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 22 నుండి ఈ షో ప్రారంభం కానుంది. ప్రోమోలో ఎన్టీఆర్ 'వస్తున్నా.. మీ ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా' అంటూ డేట్ అనౌన్స్ చేశారు.
బండ్ల గణేష్ షాకింగ్ డెసిషన్..
సోషల్ మీడియాలో నిర్మాత బండ్ల గణేష్ ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఇప్పటివరకు ఆయన చేసిన ట్వీట్లు చాలా సార్లు వైరల్ అయ్యాయి. అలాంటిది ఇప్పుడు ఆయన సడెన్ గా ట్విట్టర్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ''త్వరలోనే ట్విటర్ గుడ్ బై చెప్పేస్తా. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నా'' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు, ఫాలోవర్లు ఎందుకు వెళ్లిపోవాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి బండ్ల గణేష్ దీనికి కారణం ఏమైనా చెబుతారేమో చూద్దాం!
గోవా ట్రిప్ లో మహేష్ ఫ్యామిలీ..
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ క్రమంలో మహేష్ తన ఫ్యామిలీని తీసుకొని గోవాకు వెళ్లారు. ఓవైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరోపక్క ఫ్యామిలీతో సరదాగా గడపనున్నారు. మహేష్ ఫ్యామిలీ మొత్తం చార్టర్డ్ ఫ్లైట్ లో గోవాకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.