నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవ్నీత్ కౌర్ నటించిన తాజా చిత్రం ‘టికు వెడ్స్ షేరు‘. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. అందులో నవాజుద్దీన్, అవ్నీత్ కౌర్ లిప్ లాక్ సన్నివేశం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కూతురు కంటే చిన్న వయసున్న అమ్మాయితో ముద్దులేంటి? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
టికు వెడ్స్ షేరు’ చిత్రంలో ముంబైలో తన కెరీర్ ను కొనసాగించేందుకు షేరు (నవాజుద్దీన్) ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేదే ఈ సినిమా. నటుడిగా నిలబడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో నటిగా మారాలని కలలు కనే టికు (అవ్నీత్) పరిచయం అవుతుంది. భోపాల్ నుంచి ముంబైకి వెళ్లి అక్కడ సినిమా పరిశ్రమలో రాణించాలి అనుకుంటుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్యన జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
నవాజుద్దీన్, అవ్నీత్ లిప్ లాక్ పై తీవ్ర విమర్శలు
అయితే, ‘టికు వెడ్స్ షేరు‘ ట్రైలర్‌లో నవాజుద్దీన్, అవ్నీత్ మధ్య లిప్ లాక్ సన్నివేశంపై విమర్శలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య వయసును పేర్కొంటూ నెటిజన్లు ట్రోలింగ్ కు దిగుతున్నారు. నవాజుద్దీన్‌కు 49 ఏళ్లు కాగా, అవ్నీత్‌కు 21 ఏళ్లు. ఆయన కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ ఏంటని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు నవాజ్ ను అభిమానించాను, ఇకపై కొనసాగించలేను అని ఓ అభిమాని సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ సీన్ మరీ దారుణంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అవ్నీత్ వయసు 20 ఏండ్లు ఉండవచ్చు. ఆమెతో లిప్ లాక్ ఏంటి అసహ్యంగా అని మరో వ్యక్తి కామెంట్ పెడ్డాడు.
ట్రైలర్ చూసి ఏడుపు వచ్చింది- అవ్నీత్
‘టికు వెడ్స్ షేరు’ సినిమాతో అవ్నీత్ కౌర్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది. తాజాగా జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అవ్నీత్ ఉద్వేగానికి గురయ్యింది. ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని వెల్లడించింది. ఈ సినిమాలో అవకాశాన్ని కల్పించిన కంగనా రనౌత్ కు ధన్యవాదాలు చెప్పింది. “ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ట్రైలర్ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. నా కెరీర్ కు ఇదో టర్నింగ్ పాయింట్. నవాజ్ సర్, కంగనా మేడమ్‌తో మొదటి సినిమా చేయడం గొప్పగా ఫీలవుతున్నాను. నాకు ఈ ప్రాజెక్టులో కంగనా మేడమ్ అవకాశం ఇచ్చినప్పుడు ఎంతో గర్వంగా ఫీలయ్యాను. నేను ఈ పాత్రకు న్యాయం చేయగలను అని అనుకున్నాను. అనుకున్నట్లుగా నా పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ప్రతి హృదయానికి దగ్గరగా చేరుకుంటుందని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.
జూన్ 23 నుంచి 'టికు వెడ్స్ షేరు' స్ట్రీమింగ్
'టికు వెడ్స్ షేరు' సినిమాను కంగనా రనౌత్ నిర్మించింది. ఈ సినిమా మొదట థియేట్రికల్ విడుదలకు ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు నేరుగా OTTలో విడుదల చేయాలని భావిస్తున్నారు. 'టికు వెడ్స్ షేరు' జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది.
Read Also: 'ఆదిపురుష్' రిలీజ్ అప్‌డేట్స్ - శుక్రవారం ఒక్క రోజే హైదరాబాద్‌లో 1000 ప్లస్ షోలు