అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై నాగార్జున స్పందించారా? అంటే... 'స్పందించారు' అంటూ గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే ప్రచారం జరుగుతోంది. అలాగే, నేషనల్ మీడియాలో కూడా! గత ఏడాది న్యూ ఇయర్ వేడుకల తర్వాత చైతూ - సమంత మధ్య గొడవలు వచ్చాయని, సమంతే ముందుగా విడాకులు కోరిందని నాగార్జున పేర్కొన్నట్టు ప్రచారం జరిగింది. దానిపై ఆయన స్పందించారు. తాను అలా అనలేదని ట్వీట్ చేశారు.
"నాగ చైతన్య - సమంత గురించి నేను ఓ స్టేట్మెంట్ ఇచ్చినట్టు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అసంబద్ధం కూడా! దయచేసి పుకార్లను వార్తలుగా ప్రసారం చేయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నాను" అని నాగార్జున ట్వీట్ చేశారు. దీంతో కొన్ని రోజులుగా మీడియాలో నాగార్జున స్పందించినట్టు వార్తలు అన్నీ అవాస్తవాలేనని తేలింది.
ఇక, నాగచైతన్య విషయానికి వస్తే... 'బంగార్రాజు' విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరి సంతోషం కోసమే విడాకులు తీసుకున్నట్టు తెలిపారు. అంతకు మించి విడాకుల గురించి నాగచైతన్య స్పందించలేదు. ఎక్కువ సందర్భాల్లో అతను మౌనం వహిస్తున్నారు. తనపై విమర్శలు వస్తున్నాయి కనుక సమంత స్పందించక తప్పడం లేదు. అయితే... విడాకుల తర్వాత ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పట్లో ఇద్దరూ కలిసి నటించే అవకాశాలు లేకపోవచ్చు. కానీ, సమంతతో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ షేర్ చేసుకున్నట్టు ఇటీవల నాగచైతన్య చెప్పడం విశేషం.