విజయాలు కోలీవుడ్ యంగ్ స్టార్ శింబు (Simbu) కు కొత్త కాదు. అలాగే, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) కు కూడా! ఇంతకు ముందు వీళ్ళిద్దరూ కలిసి తమిళంలో రెండు సినిమాలు చేశారు. రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అయితే, లేటెస్ట్ మూవీ 'వెందు తనిందదు కాడు' (Vendhu Thanindhathu Kaadu) విజయం మాత్రం వీళ్ళిద్దరికీ ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకు అంటే...
'మానాడు' సినిమాతో గత ఏడాది శింబు విజయం అందుకున్నారు. అది టైమ్ లూప్ కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్. శింబు నటన కంటే వెంకట్ ప్రభు దర్శకత్వ ప్రతిభ గురించి మాట్లాడారు. 'వెందు తనిందదు కాడు' సినిమాకు వస్తే శింబు నటన గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. పాతికేళ్ల కుర్రాడిగా, కాటి కాపరి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన మనిషిగా అద్భుతమైన నటన కనబరిచారని ప్రేక్షకులు, విమర్శకులు చెబుతున్నారు. అతడి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని ప్రశంసిస్తున్నారు. శింబుతో పాటు దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమాను తెరకెక్కించిన విధానాన్నీ మెచ్చుకుంటున్నారు.
గౌతమ్ మీనన్‌కు కొన్నేళ్ళుగా సరైన విజయాలు లేవు. 'వెందు తనిందదు కాడు'తో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారని తమిళనాట టాక్. గ్యాంగ్‌స్టర్ కథను చక్కగా చెప్పారని అంటున్నారు. టేకింగ్ పరంగా గౌతమ్ మీనన్ టాలెంట్ చూపించారని టాక్. కొన్ని సింగిల్ షాట్స్ హైలైట్ అంటున్నారు. తమిళంలో పాజిటివ్ రివ్యూలు రావడం, బ్లాక్‌బస్టర్ టాక్‌తో సినిమా నడుస్తుండటంతో తెలుగునాట ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ, టాక్ ఎలా ఉంటుందో? ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.
నిజం చెప్పాలంటే... గురువారమే తమిళంతో పాటు తెలుగు సినిమా విడుదల కావాలి. సాంకేతిక కారణాలతో శనివారానికి వాయిదా పడింది. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' (The Life Of Muthu) గా తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమా వస్తోంది. శింబు, గౌతమ్ మీనన్‌తో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో హీరోయిన్ సిద్ధీ ఇద్నాని (Siddhi Idnani) నెక్స్ట్ లెవల్‌కు చేరుకున్నట్లే. తెలుగులో ఆమె నటించిన సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. ఈ తమిళ్ హిట్‌తో యంగ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకోవచ్చు.
Also Read : 'శాకిని డాకిని' రివ్యూ : రెజీనా, నివేదా థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' రెండు భాగాలుగా రూపొందుతోంది. తమిళంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. తెలుగులో సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. 'నాయకుడు', 'పుష్పక విమానం', ' రెండు తోకల పిట్ట', రఘువరన్ బీటెక్' వంటి విజయాల తర్వాత స్రవంతి మూవీస్ నుంచి వస్తున్న మరో అనువాద చిత్రమిది. ఇందులో హీరో తల్లి పాత్రలో రాధికా శరత్ కుమార్ నటించారు. ఈ చిత్రానికి కథ: బి. జయమోహన్, సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: సిద్ధార్థ నూని, ఎడిటింగ్: ఆంథోనీ, పాటలు: అనంత్ శ్రీరామ్, కృష్ణ కాంత్, గానం: శ్రేయా ఘోషల్, చిన్మయి శ్రీపాద.