యంగ్ హీరో రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరువాత కెరీర్ ఆరంభంలో హిట్స్ అందుకున్నారు. కానీ ఆ తరువాత అతడి క్రేజ్ తగ్గింది. ఈ మధ్యకాలంలో ఒక్క సరైన హిట్టు కూడా అందుకోలేకపోయారు. రీసెంట్ గా 'అనుభవించు రాజా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఇప్పుడు 'స్టాండ్ అప్ రాహుల్' అనే సినిమాలో నటిస్తున్నారు. 
ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.


ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమాలో 'తప్పా..?' అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. స్వీకర్ అగస్తి స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్ బెన్నీ దయాల్ ఆలపించారు. రఘురాం లిరిక్స్ అందించారు. ఈ పాటను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన రాజ్ తరుణ్ 'కొట్టమని చెప్తే తప్పా..? తప్పుగా అనుకోకండి.. నేను అనేది మా 'తప్పా' సాంగ్ చూసి లైక్ కొట్టమని' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 


ప్రస్తుతం ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టాండప్ కమెడియన్‌ అయిన ఓ కుర్రాడి జీవితంలో నిజమైన ప్రేమ ఎదురవుతుంది. తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్టపడాల్సి ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ కీలకపాత్రలు పోషిస్తున్నారు.